లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Andhrapradesh

గుంటూరు జిల్లాలో టీడీపీ నేత పురంశెట్టి అంకులు దారుణ హత్య

Published

on

tdp leader murder in guntur district

TDP Leader Puramsetti Ankulu murder : గుంటూరు జిల్లా గురజాల నియోజకవర్గం దాచేపల్లి మండలం పెదగార్లపాడు మాజీ సర్పంచ్‌, టిడిపి నేత పురంశెట్టి అంకులు (55) దారుణ హత్యకు గురయ్యారు. దాచేపల్లి సితార రెస్టారెంట్ సమీపంలో నిర్మాణంలో ఉన్న ఓ అపార్ట్‌మెంట్‌ లో ఈ ఘటన చోటు చేసుకుంది. అంకులును పంచాయితీ కోసమని పిలిచి ప్రత్యర్థులు గొంతు కోసి చంపినట్లు తెలుస్తోంది. పెదగార్లపాడు గ్రామంలో పురంశెట్టి అంకులు తెలుగుదేశం పార్టీ తరఫున సర్పంచ్‌గా 15 సంవత్సరాల పాటు సేవలందించారు. ఇంతటి సీనియర్ నాయకుడు దారుణ హత్యకు గురికావడం స్థానికంగా సంచలనం రేపుతోంది.

సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ టీడీపీ నాయకులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. వైసీపీ నేతలే అంకులును హత్య చేశారని వారు ఆరోపించారు. ఘటనాస్థలికి చేరుకున్న గురజాల డిఎస్‌పి వివరాలు అడిగి తెలుసుకున్నారు. హత్యకు పూర్తి బాధ్యత పోలీసులే వహించాలని టీడీపీ నేతలు డిమాండ్‌ చేశారు. దాచేపల్లి ఎస్‌ఐ నాగి రెడ్డి ప్రమేయం తోనే ఈ హత్య జరిగిందని టీడీపీ నేతలు తీవ్రంగా ఆరోపించారు. పోలీసులు డౌన్‌ డౌన్‌ అంటూ.. నినాదాలు చేశారు.

పురంశెట్టి అంకులు హత్యతో గుంటూరు జిల్లాలో ఒక్కసారిగా రాజకీయ కలకలం చెలరేగింది. అంకులు హత్యను నిరసిస్తూ స్థానిక టీడీపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. వైసీపీ నాయకులే ఈ ఘాతుకానికి పాల్పడ్డారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. పోలీసులు ఘటనా స్థాలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ఘటనాస్థలికి చేరుకొని ఘటన పూర్వాపరాలు తెలుసుకున్నారు. పురంశెట్టి ఆంకులు హత్య… ముమ్మాటికీ రాజకీయ హత్యేనని యరపతినేని ఆరోపించారు. ఈ హత్యకు గురజాల ఎమ్మెల్యే, దాచేపల్లి ఎస్సై బాధ్యత వహించాలన్నారు. వైసీపీ ప్రభుత్వం ప్రత్యర్థులను హత్యా రాజకీయాల ద్వారా అంతమొందించాలని చూస్తోందని… దీనికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ఆయన హెచ్చరించారు. నిందితులను తక్షణమే అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. గ్రామంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో గురజాల నుంచి అదనపు పోలీసు బలగాలను రప్పించారు.

అంకులు హత్యపై టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. వైసీపీ హత్యా రాజకీయాలు చేస్తోందంటూ.. ఖండించారు. 15 ఏళ్లు సర్పంచిగా పనిచేసిన అంకులును హత్య చేయడం కిరాతక చర్య అని అన్నారు. గత 19 నెలల్లో 16 మంది టీడీపీ కార్యకర్తలను మట్టుబెట్టారని చంద్రబాబు చెప్పారు. ప్రొద్దుటూరులో నందం సుబ్బయ్య హత్య, దాచేపల్లిలో అంకులు హత్య వైసీపీ హత్యా రాజకీయాలకు నిదర్శనాలని అన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో హత్యాకాండ పేట్రేగి పోయిందని, జగన్మోహన్‌ రెడ్డి అండ చూసుకునే నేరగాళ్లు పేట్రేగిపోతున్నారని ఆగ్రహాన్ని వ్యక్తపరిచారు. ప్రశాంతంగా ఉండే రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేస్తున్నారని, శాంతి భద్రతలను అధ: పాతాళానికి దిగజార్చారని చంద్రబాబు దుయ్యబట్టారు. మాజీ సర్పంచి పురంశెట్టి అంకులు హంతకులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు.

పురంశెట్టి అంకులు హత్యపై టీడీపీ ప్రధాన కార్యదర్శి, మాజీమంత్రి నారాలోకేశ్‌ మండిపడ్డారు. వైసీపీ పాలనలో ప్రతిపక్ష పార్టీ నాయకులకు రక్షణ లేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మొన్న ప్రొద్దుటూరు, ఇప్పుడు గురజాల.. వరుసగా టీడీపీ నేతలను హత్య చేయించి.. జగన్‌ రాక్షసానందం పొందుతున్నారని విమర్శించారు. వైసీపీ హత్యారాజకీయాలను ఖండిస్తున్నట్టు ఆయన ట్వీట్‌ చేశారు. గ్రామ సర్పంచ్‌గా 15ఏళ్లపాటు పనిచేసిన అంకులును హత్య చేయడం దారుణమన్నారు.

ఆంధ్రప్రదేశ్‌ ను హత్యల ఆంధ్రప్రదేశ్‌ గా మారుస్తున్నారని టిడిపి రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. గుంటూరు జిల్లా గురజాలలో టిడిపి మాజీ సర్పంచ్‌ అంకులును దారుణంగా హత్య చేయడాన్ని టిడిపి తీవ్రంగా ఖండిస్తోందన్నారు. ” హత్యలతో టిడిపి కార్యకర్తలను బెదిరించాలని చూస్తే ఖబడ్దార్‌ జగన్‌ రెడ్డి.. ” అని హెచ్చరించారు. బాధిత కుటుంబానికి టిడిపి అన్ని విధాలా అండగా నిలబడుతుందన్నారు. నిందితులను 24 గంటలలోపు అరెస్టు చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని అచ్చెన్నాయుడు హెచ్చరించారు.

” తలకెక్కిన వైసిపి అహంకారాన్ని, మదాన్ని దించే రోజులు దగ్గర పడ్డాయి. వైసిపి ని ప్రజలు మోకాళ్ల మీద నిలబెట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రజా సమస్యలను పక్కదారి పట్టించేందుకే వారానికొక టిడిపి కార్యకర్తను పొట్టనపెట్టుకుంటున్నారు. రాష్ట్రంలో క్రూరత్వాన్ని జగన్‌ రెడ్డి పాలుపోసి పెంచుతున్నారు. పులివెందుల ఫ్యాక్షనిజాన్ని రాష్ట్ర వ్యాప్తం చేసి రాష్ట్రాన్ని రావణ కాష్టం చేస్తున్నారు. ఏ నియంత పాలనలోనూ లేని అరాచకాలు, దౌర్జన్యాలు జగన్‌ రెడ్డి పాలనలో చూస్తున్నాం. ప్రశ్నిస్తే దాడులు.. నిలదీస్తే హత్యలు చేసుకుంటూ పోతే రాష్ట్రంలో ఎవరూ మిగలరు. రాష్ట్రంలో భయానక పరిస్థితులు నెలకొల్పారు.” అని అచ్చెన్నాయుడు దుయ్యబట్టారు.