కుటుంబంలో నలుగురికి, వైసీపీలోకి వెళ్తారని అనుకుంటున్న వారికి పదవులు.. చంద్రబాబు ఫ్యామిలీ ప్యాక్ పై తమ్ముళ్ల విస్మయం

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

chandrababu: తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కమిటీలు, పొలిట్‌బ్యూర్‌ సభ్యుల ప్రకటనలు జరిగిపోయాయి. వచ్చినోళ్లకు పదవులు వచ్చాయి.. రానోళ్లకు రాలేదు. ఏ పార్టీలో ఉన్నదైనా ఇదే.. తెలుగుదేశం పార్టీ రెండు రాష్ట్రాల అధ్యక్షులుగా బీసీలనే నియమించింది. వారిలో ఒకరికి తొలిసారి ఆ పదవి దక్కగా.. మరొకరికి కొనసాగింపు దొరికింది. టీడీపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడు, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎల్‌.రమణను నియమిస్తూ చంద్రబాబు ప్రకటించారు. మరోపక్క, తెలుగుదేశంలో ఫ్యామిలీ ప్యాక్‌పై ఇప్పుడు చర్చ సాగుతోంది.

బాలయ్యకు పొలిట్ బ్యూరోలో చోటుపై విస్మయం:
నారా చంద్రబాబు… నారా లోకేశ్‌… నందమూరి బాలకృష్ణ. తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరోలో ఈ ముగ్గురూ ఉన్నారు. పార్టీ వ్యవహారాల్లో బాలకృష్ణ జోక్యం చేసుకునేదే చాలా తక్కువ. అలాంటిది ఏకంగా ఇప్పుడు ఆయనకు పార్టీ పొలిట్‌బ్యూరోలో చోటు కల్పించడం పార్టీలో చర్చనీయాంశం అయ్యింది. అధినేత చంద్రబాబు ప్రకటించిన కమిటీల్లో వింతలెన్నో ఉన్నాయని పార్టీలో గుసగుసలాడుకుంటున్నారు.

అధికారంలో ఉన్నప్పుడు ఏనాడూ ఆయనకు సముచిత స్థానం దక్కలేదు:
పార్టీలో ఇప్పుడు వర్ల రామయ్యకు ప్రాధాన్యం కల్పించారు. ఆయనకు అత్యంత కీలకమైన పొలిట్‌బ్యూరోలో చోటు దక్కటంతోపాటు.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి కూడా కేటాయించారు. మొన్నటి ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయం తర్వాత టీడీపీ వ్యవస్థాపక సభ్యుడైన గోరంట్ల బుచ్చయ్యచౌదరి వంటి నేతలకు పార్టీ పొలిట్‌బ్యూరోలో స్థానం కల్పించారు. అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడూ ఆయనకు సముచిత స్థానం కల్పించ లేదు. ఎందుకంటే పార్టీ విషయాలు ఏదైనా నిక్కచ్చిగా మాట్లాడడమే కారణమంటున్నారు.

వద్దన్నా గల్లా అరుణ పదవి, అనితకు డబుల్ ధమాకా:
గల్లా అరుణకుమారి ఈ మధ్యే పొలిట్‌బ్యూరో పదవికి రాజీనామా చేశారు. పార్టీలో కొనసాగుతా కానీ.. పదవులు వద్దన్నారు. ఆమెకు ఇఫ్పుడు జాతీయ ఉపాధ్యక్షురాలి పదవి కట్టబెట్టారు. అంతే కాదు ఆమె తనయుడు, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్‌కు కూడా పొలిట్‌బ్యూరోలో చోటు కల్పించారు. వంగలపూడి అనితకు కూడా ఇప్పుడు డబుల్ థమాకా. ఇప్పటికే టీడీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలిగా ఉన్న ఆమెకు తాజాగా పొలిట్‌బ్యూరోలో చోటు కల్పించడం విశేషం.

పార్టీలో ఉంటారా? లేరా? అన్న వారికి పదవులు:
చిత్తూరు జిల్లాకు చెందిన డీకే సత్యప్రభ అసలు పార్టీలో ఉంటారా? లేదా అన్న చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఆమెకు కూడా జాతీయ ఉపాధ్యక్షురాలి పదవి ఇవ్వడం చర్చనీయాంశం అయ్యింది. ప్రతిపక్షంలో పార్టీ కోసం పోరాడే వారిని గుర్తించి పదవులు ఇవ్వాలి. కానీ ఇలా ఒకే కుటుంబంలో, ఒక్కొక్కరికి రెండేసి పదవులు ఇవ్వటం ఏమిటో అర్థం కావడం లేదని పార్టీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు. తనకు ఎలాంటి పదవి రాకపోవడంతో మాజీ మంత్రి పీతల సుజాత అసంతృప్తిగా ఉన్నారని అంటున్నారు. ఆమె పార్టీ మారతారనే ప్రచారం కూడా మొదలైంది.

చంద్రబాబు కుటుంబంలో నలుగురికి పదవులు:
తన కుటుంబంలో మొత్తం నలుగురికి పదవులు లభించాయి. చంద్రబాబు ఎలాగో పార్టీ అధినేతగా ఉన్నారు. కుమారుడు లోకేశ్‌కు జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి ఇవ్వగా, బాలయ్యకు పొలిట్‌బ్యూరోలో చోటు కల్పించారు. ఇక హరికృష్ణ కుమార్తెకు తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షురాలి పదవి అప్పగించారు. గతంలో మంత్రులుగా పని చేసి ఓ వెలుగు వెలిగిన నారాయణ, పత్తిపాటి పుల్లారావు, గంటా శ్రీనివాసరావు వంటి వారు ఇప్పుడు ఎక్కడ ఉన్నారో ఎవరికీ తెలియదని అంటున్నారు.

గంటా, వెలగపూడి, గణబాబుకి నో:
మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు ఎలాంటి పదవి ఇవ్వక పోవడం వెనుక చాలా కారణాలున్నాయని అంటున్నారు. పార్టీలో ప్రస్తుతానికి ఆయన యాక్టివ్‌గా లేకపోవడమే కాదు.. తొందర్లోనే వైసీపీలో చేరతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇలాంటి తరుణంలో ఆయనకు పదవి ఇవ్వకపోవమే మంచిదనే అభిప్రాయంతో ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఇక వెలగపూడి రామకృష్ణ, గణబాబు లాంటి వారికి కూడా అవకాశం ఇవ్వకపోవడం ఏమిటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

వెలగపూడి, పయ్యావులకు ఎందుకివ్వలేదు:
గణబాబు విషయంలో కొంత అయోమయం ఉందంటున్నారు. ఆయన పార్టీ మారతారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో పక్కన పెట్టి ఉంటారని చెబుతున్నారు. కానీ, వెలగపూడికి ఏదో ఒక పదవి ఇవ్వాల్సిందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఇక, పార్టీకి, చంద్రబాబుకు విధేయుడిగా ఉండే పయ్యావుల కేశవ్‌కు తప్పకుండా ఏదో పదవి ఇచ్చి ఉండాల్సిందని అంటున్నారు. ఆయనపై పార్టీ మారతారనే ప్రచారం కూడా ఇప్పటి వరకూ రాలేదు. కాకపోతే ఆయన టీడీపీ తరఫున పీఏసీ చైర్మన్‌గా ఉన్నందునే పార్టీ కమిటీలో చోటివ్వలేదనే వాదనా వినిపిస్తోంది.

వైసీపీలోకి వెళ్తారని అనుకుంటున్న వారికి పదవులు ఎలా ఇచ్చారు?
పయ్యావులతో పాటు మరికొందరు నాయకులు టీడీపీలో ఎక్కువ కాలం ఉండరనే అభిప్రాయం చంద్రబాబులో ఉందనే అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. అలాంటప్పుడు వైసీపీలో చేరతారని భావిస్తున్న మాజీ స్పీకర్‌ ప్రతిభాభారతి, మాజీ ఎమ్మెల్యే డీకే సత్యప్రభ లాంటి వారికి కమిటీలో చోటివ్వడం విడ్డూరంగా ఉందని పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది. మరి ఈ విషయంలో చంద్రబాబు ఎలాంటి సర్దుబాట్లు చేస్తారో చూడాల్సిందే.

Related Tags :

Related Posts :