Home » మన్యంలో టీడీపీ మాయమేనా.. అక్కడేం జరుగుతోంది?
Published
5 months agoon
By
subhnవిశాఖ ఏజెన్సీలో మొదటి నుంచి టీడీపీ చాలా బలంగా ఉండేది. బలమైన నాయకత్వంతో పాటు నడిచి వచ్చే క్యాడర్ కూడా ఉండేది. ఏజెన్సీలోని రెండు నియోజకవర్గాలు అయిన అరకు, పాడేరు నుంచి గెలిచిన వారు కచ్చితంగా మంత్రులవుతారు. పాడేరు నుంచి గెలిచిన మత్స్యరాస మణికుమారి మంత్రి అయ్యారు. అంతకు ముందు పాడేరు నుంచే బాలరాజు కాంగ్రెస్ పార్టీ హయాంలో మంత్రిగా కొనసాగారు. ఈ రెండు నియోజకవర్గాల్లో ముఖ్యంగా అరకు నియోజకవర్గంలో 2014 వరకూ టీడీపీదే హవా. ఆ పార్టీ వారే ఎమ్మెల్యేగా గెలిచేవారు. చివరి సారిగా 2009లో సివేరి సోమా టీడీపీ నుంచి అరకు శాసనసభ్యుడిగా గెలిచారు.
2014 ఎన్నికల్లో వైసీపీ తరపున పాడేరు నుంచి గిడ్డీ ఈశ్వరి, అరకు నుంచి కిడారి సర్వేశ్వరరావు విజయం సాధించారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలోకి ఈ ఇద్దరూ చేరిపోయారు. తెలుగుదేశం ప్రభుత్వంలో కిడారి సర్వేశ్వరరావుకు విప్ హోదా దక్కింది. 2017లో కిడారి సర్వేశ్వరరావు, సివేరీ సోమా మావోయిస్టుల చేతిలో హత్యకు గురయ్యారు. తర్వాత కిడారి సర్వేశ్వరరావు కుమారుడు కిడారి శ్రవణ్‌ను చంద్రబాబు కేబినెట్లోకి తీసుకున్నారు. 2019లో జరిగిన ఎన్నికల్లో అరకు నుంచి పోటీ చేసిన శ్రవణ్, పాడేరు నుంచి పోటీ చెసిన గిడ్డి ఈశ్వరి పరాజయం పాలయ్యారు.
ఓటమి తర్వాత ఈ ఇద్దరు నాయకులు కనిపించడం మానేశారు. కార్యకర్తలకు అందుబాటులో లేకుండాపోయారు. పార్టీ కార్యక్రమాల్లో కూడా కనిపించడం లేదు. దీంతో టీడీపీ కార్యకర్తలను ముందుండి నడిపించే నాయకులు లేకుండా పోయారు. పాడేరులో మణికుమారి లాంటి నేతలు ఉన్నా టీడీపీ అధిష్టానం ఆమెను కాదని 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి వచ్చిన ఈశ్వరికి టికెట్ ఇవ్వడంతో బలమైన కేడర్ ఉన్న మణికుమారి సైలెంట్ అయిపోయారు. అడపాదడపా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నా గతంలో లాగా ముఖ్యభూమిక పోషించడం లేదు. మాజీ ఎమ్మేల్యే గిడ్డి ఈశ్వరీ టీడీపీలోనే ఉన్నా పార్టీ స్థానిక నాయకులతో సత్సంబంధాలు లేవు. దీంతో టీడీపీ క్యాడర్ వలసల బాట పట్టారు.
పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి ఆధ్వర్యంలో టీడీపీ నుంచి వైసీపీలోకి పెద్ద ఎత్తున కేడర్ చేరిపోయింది. అరకులో కూడా ఇదే పరిస్థితి ఏర్పడింది. మాజీ ఎమ్మెల్యే సివేరీ సోమా కుమారుడు అబ్రహాం ఎస్టీ కమిషన్ సభ్యుడిగా ఉన్నా, కిడారి సర్వేశ్వరరావు కుమారుడు మాజీ మంత్రి శ్రవణ్ కుమార్ టీడీపీలో ఉన్నా పార్టీ కార్యక్రమాల్లో పెద్దగా పాల్గొనడం లేదు. ఈ రెండు నియోజకవర్గాల్లో వైసీపీ ఎమ్మెల్యేలు జోరుగా ముందుకు వెళ్తుండడంతో ఇతర టీడీపీ నేతలు వైసీపీలో చేరేందుకు సిద్ధపడుతున్నారట. ఇదే పరిస్థితి కొనసాగితే మన్యంలో టీడీపీ ఉనికి కష్టమేనంటున్నారు.