tdp

చంద్రబాబు రాంగ్ స్టెప్ వేశారా? వైసీపీ, బీజేపీ ఆడుతున్న గేమ్‌లో పావులా మారారా?

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

tdp mistake : ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ అధికారంలోకి 16 నెలలు అయ్యింది. రాజకీయాల్లో వేడి కొనసాగుతూనే ఉంది. అధికార, ప్రతిపక్షాలు ఢీ అంటే ఢీ అంటూ ప్రతి చిన్న విషయానికి రోడ్డున పడుతున్నాయి. మీది అవినీతి అంటే మీది అవినీతి అంటూ గత 16 నెలలుగా ఆరోపణలు గుప్పించుకుంటూనే ఉన్నాయి. రోజు ఏదో ఒక కొత్త సమస్య తెరపైకి వస్తూనే ఉంది. తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానంలోకి దర్శనానికి వెళ్లాలంటే అన్యమతస్థులు డిక్లరేషన్ ఇవ్వాలనే అంశం తెరపైకి వచ్చింది. గత వారం నుంచి రాష్ట్ర రాజకీయాలు మొత్తం దీని చుట్టూనే తిరుగుతున్నాయి.

ఆలయాలు, డిక్లరేషన్ వివాదాలు:
అంతర్వేదిలో రథం దగ్ధం కావడం, అనంతరం విజయవాడ కనకదుర్గ అమ్మవారి గుడిలో రథానికి ఉన్న సింహాలు మాయం కావటంపై పెద్ద వివాదం చెలరేగింది. తిరుమల బ్రహ్మోత్సవాలకు ముఖ్యమంత్రి పట్టువస్త్రాలు సమర్పించాలంటే డిక్లరేషన్‌పై సంతకం చేయాల్సిందేనంటూ ప్రతిపక్ష టీడీపీ, బీజేపీ, ఇతర హిందూ సంస్థలు డిమాండ్ చేయడంతో రాజకీయంగా రచ్చ మొదలైంది. ఈ మధ్యలో కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు అగ్గిని మరింత రాజేశాయి. దీంతో రాష్ట్రంలో మిగతా అంశాలు పక్కకు పోయాయి.

పంథా మార్చిన టీడీపీ:
మతం పేరు చెప్తే ఆమడ దూరంగా ఉండే టీడీపీ ఈసారి తన పంథా మార్చుకున్నట్టుగా కనిపిస్తోంది. ముఖ్యమంత్రి జగన్‌కి ముకుతాడు వేయాలంటే మతాన్ని వాడుకోవాల్సిందేనని డిసైడ్‌ అయినట్టుగా ఉంది. దీనిలో భాగంగానే బీజేపీ, హిందూ సంస్థల కంటే ముందే ప్రతి విషయంలో ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ ముందుకు దూసుకుపోతోందని అంటున్నారు. అయితే ఇది పార్టీకి లాభమా? నష్టమా? అనే చర్చ టీడీపీలో మొదలైందని చెబుతున్నారు.

కరెక్ట్ కాదంటున్న టీడీపీ సీనియర్లు:
చాలామంది టీడీపీ సీనియర్ నేతలు జరుగుతున్న పరిణామాలపై లోతైన చర్చలు జరుపుతున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో పార్టీ అనుసరిస్తున్న విధానం సరిగా లేదని కొందరు సీనియర్ నేతలు అభిప్రాయపడుతున్నారట. రాబోయే రాజకీయ పరిణామాలను అంచనా వేయటంలో ప్రతిపక్షంగా విఫలమవుతున్నామనే భావన కొందరిలో ఉందట. హిందూత్వ అజెండాను మనం ఎందుకు భుజాన వేసుకోవాలి? దాని వల్ల పార్టీకి వచ్చే లాభం ఏమిటి? పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసుకోకుండా వేరే పార్టీల అజెండాను టేకప్ చేయడం సరి కాదని సీనియర్లు భావిస్తున్నారట.

సమస్యలను టేకప్ చేసి ప్రభుత్వాన్ని టార్గెట్:
చాలా కాలంగా ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ రాష్ట్రంలో అనేక సమస్యలను టేకప్ చేసి ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ ముందుకెళ్తోంది. దళితులపై దాడులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, వైసీపీ నాయకుల అవినీతి అక్రమాలు, వ్యవసాయానికి విద్యుత్తు మీటర్లు, ఇతర వైఫల్యాలు, ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలు.. ఇలా వివిధ అంశాలను తెరపైకి తెచ్చి, ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెడుతోంది. తాజాగా మంత్రి జయరామ్ కుమారుడు ఈఎస్ఐ స్కాంలో నిందితుల వద్ద నుంచి బెంజ్ కార్ గిఫ్ట్‌గా తీసుకున్నారనే అంశాన్ని పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లగలిగింది.

READ  జేసీకి సీఎం జగన్ మరో షాక్ : బస్సుల సీజ్ నుంచి తేరుకోక ముందే

టీటీడీ పోరాటం వృథా:
దేవాలయాలపై దాడుల అంశం తెర మీదకు వచ్చిన తర్వాత టీటీడీ చేపట్టిన పోరాటం అంతా వృథా అయిపోయిందని అంటున్నారు. ఇప్పుడు రాష్ట్రంలో మొత్తం హిందూత్వ అజెండాగా జరుగుతోన్న కార్యక్రమాలను ప్రధాన పార్టీలు భుజాన మోయాల్సిన పరిస్థితి వచ్చింది. హిందుత్వంపై ఎంత అరిచి గగ్గోలు పెట్టినా దానికి పేటెంట్ హక్కులు మొత్తం బీజేపీకే చెందుతాయి. ఏదైనా రాజకీయ లబ్ధి దాని ద్వారా జరుగుతుందంటే అది బీజేపీకే అంటున్నారు. కానీ టీడీపీ దాని కోసం ఎందుకు ఆరాటపడుతుందనే ప్రశ్న ఆ పార్టీ నేతల మెదళ్లను తొలి చేస్తోందట.

వైసీపీ, బీజేపీ కలసి ఆడుతున్న గేమ్‌లో టీడీపీ పావులా మారింది:
కొందరు నేతలు మాత్రం వైసీపీ, బీజేపీ కలసి ఆడుతున్న గేమ్‌లో టీడీపీ పావులా మారిందని అంటున్నారు. రాష్ట్రంలో టీడీపీ స్థానంలో ప్రధాన ప్రతిపక్షంగా బీజేపీ రాబోతుందనే మెసేజ్ ఇవ్వడానికి అధికార పార్టీ ప్రయత్నిస్తోందని టాక్‌.

దీనిలో భాగంగానే ఆ రెండు పార్టీలు కలిసి వ్యూహాత్మకంగా ఇలాంటి అంశాలను తెరపైకి తీసుకొచ్చి, టీడీపీని బలహీనపరిచే రాజకీయాలు చేస్తున్నాయని టీడీపీ నేతలు కొందరు భావిస్తున్నారట. ప్రజలకు సంబంధించిన అంశాలపై పోరాడితేనే టీడీపీకి మేలు జరుగుతందని, మీడియా సమావేశాలు పెట్టి చేతులు దులుపుకోవడం కాకుండా ప్రజల్లోకి వెళ్లి వారి సమస్యలపై పోరాడాలంటున్నారు. అప్పుడే పార్టీ గట్టిగా నిలబడే వీలుంటుందని చెబుతున్నారు.

Related Posts