టీడీపీ కంచుకోటకు బీటలు, పార్టీకి అండగా ఉన్న వారికి ద్రోహం చేస్తే ఫలితం ఇలానే ఉంటుందంటున్న తమ్ముళ్లు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

గతమెంతో ఘనం.. వర్తమానం మాత్రం ప్రశ్నార్థకం అనేలా తయారైంది విశాఖ జిల్లా టీడీపీ పరిస్థితి. పార్టీని నమ్ముకున్న వాళ్లకు కాకుండా అప్పటికప్పుడు పార్టీలు మారిన వారికి పార్టీ అధిష్టానం టికెట్లు ఇవ్వడం ప్రారంభించినప్పటి నుంచి పతనం ప్రారంభమైందంటున్నారు. 2019 ఎన్నికల నాటికి పార్టీ నుంచి పోటీ చేసిన వాళ్లకు కనీసం పార్టీ ప్రాథమిక సభ్యత్వం అయినా ఉందా లేదా అంటే అనుమానమే అంటున్నారు కార్యకర్తలు. ఎన్నికలు కాగానే అలాంటి వారంతా పార్టీని వదిలేశారు.

ఎంపీ నియోజకవర్గాలు టీడీపీకి కంచుకోటలు:
విశాఖలో జిల్లాలో తొలుత రెండు పార్లమెంటు నియోజకవర్గాలుండేవి. 2008లో పునర్విభజన తర్వాత మూడో నియోజకవర్గం వచ్చి చేరింది. పార్టీ స్థాపించినప్పటి నుంచి జిల్లాలో లోక్‌సభ నియోజకవర్గాలు టీడీపీకి కంచుకోటలా ఉండేవి. 1984 లోక్‌సభ ఎన్నికల్లో విశాఖ నియోజకవర్గం నుంచి భాట్టం శ్రీరామ్మూర్తి, అనకాపల్లి నుంచి పెతకంశెట్టి అప్పల నరసింహం విజయం సాధించారు. ఆ తర్వాత 1991, 1996 ఎన్నికల్లో విశాఖ పార్లమెంట్ స్థానం నుంచి ఎంవీవీఎస్ మూర్తి విజయం సాధించారు. అనకాపల్లి నుంచి 1996లో అయ్యన్నపాత్రుడు, 1999లో గంటా శ్రీనివాసరావు, 2004 పప్పల చలపతిరావు, 2014 ముత్తంశెట్టి శ్రీనివాసరావు విజయం సాధించారు.

సీనియర్లను పక్కన పెట్టి కొత్త వారికి టికెట్లు:
ఇప్పుడు ఇదంతా గతం. 2019లో సీనియర్లకు కాకుండా టీడీపీ అధిష్టానం కొత్త వారిని బరిలోకి దింపింది. 2019 విశాఖ పార్లమెంట్ స్థానం నుంచి ఎంవీవీఎస్ మూర్తి మనవడు, బాలకృష్ణ రెండో అల్లుడు శ్రీభరత్‌ను బరిలోకి దింపింది. అనకాపల్లి నుంచి టికెట్‌ ఆశించిన సత్యవతికి కాకుండా విశాఖ డెయిరీ చైర్మన్ అడారి తులసీరాం కుమారుడు అడారి అనంద్‌కు టికెట్లు కేటాయిచింది. ఇక అరకు నుంచి కాంగ్రెస్‌ పార్టీ నుంచి వచ్చిన మాజీ కేంద్ర మంత్రి కిశోర్ చంద్రదేవ్‌కు టికెట్‌ ఇచ్చింది. వీరిలో ఏ ఒక్కరూ విజయం సాధించలేదు.

పార్టీకి నష్టమే తప్ప ప్రయోజనం లేదు:
అనకాపల్లి నుంచి పోటీ చేసిన అడారి ఆనంద్‌ ఏకంగా వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. కిశోర్ చంద్రదేవ్ ఢిల్లీకే పరిమితం అయ్యారు. బాలకృష్ణ రెండో అల్లుడు భరత్ కూడా ఎన్నికల తర్వాత పార్టీ కార్యక్రమాల్లో కనిపించడం లేదు. కొత్త నీరు రావాల్సిన ప్రస్తుత తరుణంలో నేతలెవ్వరూ పట్టించుకోకపోవడంతో టీడీపీకి పెద్ద కష్టం వచ్చి పడిందంటున్నారు. ఇప్పుడు పార్టీ నేతలంతా ఎవరికి వారే అన్నట్టుగా ఉంటున్నారు. ఎంపీ అభ్యర్థులుగా పోటీ చేసి ఓడినవారు అసలు కనుచూపు మేరలో కూడా కనిపించడం లేదని కార్యకర్తలు అసంతృప్తిగా ఉన్నారు. తొలి నుంచి పార్టీతో ఉన్న వారికి కాకుండా ఇలాంటి వారికి ఇవ్వడం వల్ల పార్టీకి నష్టమే తప్ప ప్రయోజనం లేదంటున్నారు.


Related Posts