మేధావులను వెదికే పనిలో టీడీపీ.. వైసీపీ వ్యూహాన్నే తిప్పికొట్టాలని ప్లాన్

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్‌ని మొదట 2014 నుంచి 19 వరకు టీడీపీ పరిపాలించింది. ఈ ఐదేళ్ల కాలంలో ప్రభుత్వం పై అనేక ఆరోపణలు వచ్చాయి. మొదటి సంవత్సరం హైదరాబాదులో ఉండి పాలన సాగించినా తర్వాత అమరావతిని రాజధానిగా గుర్తిస్తూ సచివాలయం అసెంబ్లీ నిర్మించుకొని అంతా ఆంధ్రప్రదేశ్ నుంచే పాలన సాగింది. పట్టిసీమ మొదలుకొని పోలవరం ప్రాజెక్ట్, రాజధానికి భూ సమీకరణ, పుష్కరాలలో జరిగిన ఘటనలు, బోటు మునిగిపోయిన ఘటనలు, మద్యం షాపులు, బెల్టుషాపులు, కాల్ మనీ, సెక్స్ రాకెట్లు, ఉద్యోగులపై అధికార పార్టీ నేతల దౌర్జన్యం, ప్రభుత్వంలో విచ్చలవిడిగా అవినీతి ఇవన్నీ ఆనాడు ప్రతిపక్షంగా ఉన్న వైసీపీ చేసిన ఆరోపణలు.

ఆ అయిదేళ్ల కాలంలో ప్రతిపక్ష పార్టీగా ఆ స్థాయిలో ప్రభుత్వంపై పెద్దగా ఉద్యమాలు చేసిన చరిత్ర కూడా లేదు. జనచైతన్య వేదిక పేరుతో వి.లక్ష్మణ్ రెడ్డి ఆధ్వర్యంలో మేధావులంతా ఒక టీంలా ఏర్పడి ఊరూ వాడా తిరుగుతూ ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టారు. రాయలసీమ ప్రాంతంలో ఆ ప్రాంత వెనుకబాటుతనానికి ప్రభుత్వమే కారణమంటూ రౌండ్ టేబుల్ సమావేశాలు కూడా ఏర్పాటు చేశారు. రాజధాని భూసేకరణలో రైతుల భూములు బలవంతంగా లాక్కున్నారంటూ పెద్ద ఎత్తున ఉద్యమాలు చేశారు.

ఇవన్నీ ఒక రాజకీయ పార్టీగా చేస్తే పెద్ద ఉపయోగం ఉండేది కాదు. ఒక మేధావుల ఫోరంగా ఏర్పడి ప్రభుత్వంపై పెద్ద ఎత్తున నెగిటివ్ ప్రచారం చేయడంతో అది ఆనాటి ప్రతిపక్షమైన వైసీపీకి బాగా ఉపయోగపడింది. ఇప్పుడు ప్రతిపక్షమైన టీడీపీ కూడా ఆ విధమైన ఆలోచనే చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రభుత్వంపై సంవత్సర కాలంలో అనేక ఆరోపణలు చేసి సాక్ష్యాధారాలతో సహా చూపించినా పెద్దగా ఉపయోగపడలేదని టీడీపీ భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే మేధావి మంత్రాన్ని జపిస్తోందని అంటున్నారు.

ఇప్పుడున్న పరిస్థితుల్లో అధికార పార్టీపై ఎన్ని ఆరోపణలు చేసినా రాజకీయ విభేదాలతోనే ప్రతిపక్షం ఆరోపణలు చేస్తోందని ప్రజలు భావిస్తున్నారట. అందువల్ల గతంలో వైసీపీ మేధావులను అడ్డుపెట్టుకొని ఏ విధంగా అయితే సక్సెస్ అయిందో అదే స్టయిల్‌లో ముందుకు పోవాలని టీడీపీ ఆలోచన చేస్టోందంట. అందుకే ప్రస్తుతం మేధావుల్ని వెదికే పనిలో టీడీపీ ఉందని అంటున్నారు. రిటైర్డ్ ఐఎఎస్‌లు, ఐపీఎస్‌లు, రిటైర్డ్ జడ్జీలు, ఇంజనీర్లు, సమాజంలో పేరు ప్రఖ్యాతులు కలవారి కోసం వేట మొదలుపెట్టిందట.

ఇప్పటికే వైఎస్ కుటుంబానికి సన్నిహితులైన ఉండవల్లి అరుణ్‌కుమార్, సబ్బం హరిలు న్యూట్రల్‌గా ఉంటూ ప్రభుత్వ తప్పులను ఎత్తి చూపుతున్నారు. సబ్బం హరి భీమిలి అసెంబ్లీ నుంచి టీడీపీ తరఫున పోటీ చేసినా పార్టీకి దూరంగానే ఉంటున్నారు. ఆయనకి ప్రజల్లో ఒక ఇమేజ్ ఉంది. ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా ఉన్నది ఉన్నట్టు మాట్లాడతారనే పేరుంది. టీడీపీ ప్రభుత్వ హయాంలో కూడా అనేక సార్లు విమర్శలు చేశారు ఉండవల్లి. సోషల్ మీడియా ద్వారా ఉండవల్లిపై ఒత్తిడి పెంచుతోందట టీడీపీ. ఈ విషయాన్ని ఉండవల్లి స్వయంగా చెప్పారు కూడా. అందుకే విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు ఉండవల్లి.

దళిత వర్గాల్లో మంచి పట్టు ఉన్న మాజీ ఎంపీ హర్షకుమార్ కూడా ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉందని టీడీపీ భావిస్తోంది. రాష్ట్రంలో ఈ మధ్య కాలంలో దళితులపై జరుగుతున్న దాడుల విషయాన్ని టీడీపీ ఫోకస్ చేస్తోంది. దళితవర్గాలకు చెందిన మేధావులతో ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్య మాట్లాడుతూ ఉన్నారు. దళితులపై దాడుల పట్ల మేధావులతో రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేయాలని టీడీపీ భావిస్తోంది. వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జస్టిస్ లక్ష్మణ్ రెడ్డి, ఆంజనేయ రెడ్డి, రిటైర్డ్ సీఎస్‌లు ఐవైఆర్ కృష్ణారావు, అజయ్ కల్లాం, జన చైతన్య వేదిక అధ్యక్షులు వి.లక్ష్మణ్ రెడ్డి టీడీపీకి వ్యతిరేకంగా మాట్లాడినవారే. వీరంతా ఆనాటి ప్రభుత్వంపై చేసిన ప్రచారం వైసీపీకి కలిసి వచ్చింది. ఇప్పుడు ఇదే ఫార్ములాని టిడిపి అవలంబించబోతోందని టాక్‌.

డాక్టర్ సుధాకర్, డాక్టర్ అనితారాణి, జడ్జి రామకృష్ణతో టీడీపీ చర్చిస్తోందట. ప్రభుత్వం చేతిలో ఇబ్బందులకు గురవుతున్నఅధికారుల జాబితాను కూడా రెడీ చేసుకుంటోంది. అన్నీ సక్రమంగా జరిగితే త్వరలోనే ఒక సంఘంగా ఏర్పడి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టటం మొదలుపెడతారని అంటున్నారు. ఈ విషయంలో టీడీపీ వ్యూహం ఎంత వరకూ సక్సెస్‌ అవుతుందో చూడాలి. ఆనాడు వైసీపికి కలసి వచ్చినట్టుగా టీడీపీకి కూడా కలసి వస్తుందా? లేక మూడో ప్రత్యామ్నాయం అని చెబుతున్న బీజేపీ, జనసేనలకు ప్లస్‌ అవుతుందా? వేచి చూడాల్సిందే.

Related Tags :

Related Posts :