లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Political

క్రైసిస్‌లో ఛాన్స్.. బందర్ స్థానంపై కన్నేసిన తెలుగు తమ్ముళ్లు!

Published

on

tdp-senior-leaders-moving-with-strategic-plan-for-bandar-seat

అవకాశం వచ్చినప్పుడే అందిపుచ్చుకోవాలన్న నానుడిని బాగా ఒంటబట్టించుకున్నారు తెలుగుదేశం పార్టీ నాయకుడు బచ్చుల అర్జునుడు. వైసీపీ నేత హత్య కేసులో కృష్ణా జిల్లా మచిలీపట్నం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అరెస్టయి జైలుకు వెళ్లారు. ప్రస్తుతం ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు.

రాజకీయాల్లో చురుగ్గా ఉండే నేత ఓ హత్య కేసులో ఇరుక్కోవడం అంటే ఇక రాజకీయ జీవితం ముగిసినట్టేననే ప్రచారం జరుగుతోంది. ఇదే అదునుగా అవకాశాన్ని క్రైసిస్‌లో అవకాశాన్ని వెదుక్కోవాలనే తమ అధినేత చంద్రబాబూ సూక్తులను ఒంటబట్టించుకున్న టీడీపీ సీనియర్ నేతలు, ఎప్పటి నుంచో బందర్ స్థానంపై కన్నేసిన నేతలు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారట.

దూసుకుపోతున్న ఎమ్మెల్సీ బచ్చుల :
బందరు అసెంబ్లీ స్థానం కోసం ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న జిల్లా పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు తనదైన శైలిలో ముందుకు పోతున్నారు. టీడీపీలో కొల్లు రవీంద్ర కన్నా బచ్చుల సీనియర్ అయినా కుల సమీకరణాల కారణంగా పోటీ చేసే అవకాశం రావడం లేదు.

కాగల కార్యం గంధర్వులు తీర్చినట్టు హత్య కేసులో రవీంద్ర ఇరుక్కోవడం బచ్చులకు కలిసొస్తుందని కృష్ణా జిల్లా టీడీపీ నేతలు గుసగుస లాడుకుంటున్నారు. గతంలో ఓసారి బచ్చుల అర్జునుడు బందరు మున్సిపల్ చైర్మన్‌గా పనిచేశారు. మొదటి నుంచి రవీంద్ర, అర్జునుడుకు పొసిగేది కాదని అంటున్నారు. ఈ నేపథ్యంలో కొల్లు వ్యవహారాన్ని జిల్లా పార్టీ లైట్‌గా తీసుకుందనే టాక్‌ నడుస్తోంది.

చంద్రబాబు సైతం మచిలీపట్నం వెళ్లి కొల్లు రవీంద్ర కుటుంబసభ్యులను పరామర్శించాలని అనుకున్నా గ్రూప్ పాలిటిక్స్ వల్ల ఆఖరి నిమిషంలో పర్యటన రద్దయిందని అనుకుంటున్నారు. మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గానికి ఓ ప్రత్యేకత ఉంది. మాజీ మంత్రులు కొల్లు రవీంద్ర, నరసింహారావు, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ, జిల్లా టీడీపీ అధ్యక్షుడు అర్జునుడు మచిలీపట్నం కేంద్రంగానే రాజకీయాలు కొనసాగిస్తారు. 1994లో ఇక్కడ నుంచి టీడీపీ అభ్యర్థిగా అంబటి బ్రాహ్మణయ్య గెలిచారు. 1999లో కొల్లు రవీంద్ర మామ అయిన నడికుడిది నరసింహా రావు పోటీచేసి గెలవడంతో పాటు చంద్రబాబు కేబినెట్లో మంత్రి అయ్యారు. ఆ తర్వాత 2004లో పేర్ని నాని చేతిలో ఓటమి చెందారు.

కొల్లు.. కోలుకోవడం కష్టమేనా? :
అనంతరం రిటైర్మెంట్ ప్రకటించి తన రాజకీయ వారసుడిగా కొల్లు రవీంద్రను రంగంలోకి దింపారు. 2009 ఎన్నికల్లో నాని చేతిలో ఓటమి చెందిన కొల్లు రవీంద్ర 2014లో గెలిచి మంత్రి అయ్యారు. 2019 ఎన్నికల్లో కొద్ది ఓట్ల తేడాతోనే నాని చేతిలో మళ్లీ ఓటమి పాలయ్యారు.

నరసింహారావు రాజకీయ వారసుడిగా కొల్లు రవీంద్ర తెరమీదికి వచ్చినప్పటి నుంచి బచ్చుల అర్జునుడు, కొనకళ్ల నారాయణ వర్గం బందరు పై ఆశలు వదులుకున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో హత్య కేసులో రవీంద్ర ఇరుక్కోవడం పార్టీకి పెద్ద దెబ్బ. సౌమ్యుడిగా పేరు తెచ్చుకున్న రవీంద్ర.. ఇక కోలుకోవడం కష్టమని టీడీపీ నేతలు అంటున్నారు.

మోకా భాస్కరరావు హత్యలో రవీంద్ర పాత్ర అంటూ ప్రచారం జరుగుతున్నప్పుడు కూడా పార్టీ నేతలు అండగా నిలవలేదని కొల్లు అనుచరులు వాపోతున్నారు. ప్రతి చిన్న అంశానికి మీడియా ముందుకు వచ్చి హడావుడి చేసే దేవినేని ఉమా సైతం అంతా అయిపోయిన తర్వాత ఫీల్డ్‌లోకి వచ్చారని ఆరోపిస్తున్నారు.

సొంత పార్టీ నేతలే తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, పార్టీ అధిష్ఠానం స్పందించి రవీంద్రకు బెయిలు వచ్చేలా న్యాయసహాయం అందించాలని కోరుతున్నారు. మరి కొల్లు నిర్దోషిగా బయటకు వస్తారా? అర్జునుడు కోరుకుంటున్నది జరుగుతుందా అన్న చర్చ ఇప్పుడు పార్టీలో జోరుగా సాగుతోంది.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *