పోగొట్టుకొన్న చోటే వెతుక్కొని ఎలాగైనా నిలదొక్కుకోవాలనే పనిలో టీడీపీ

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

tdp sc classification: చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే లాభం లేదంటారు.. కానీ, ఒక్కోసారి ఆలస్యంగానైనా ఆకులు పట్టుకుంటే కొంచెం ఉపశమనం లభించే చాన్స్‌ ఉండొచ్చన్నది టీడీపీ ఉద్దేశంగా కనిపిస్తోంది. పోగొట్టుకొన్న చోటే వెతుక్కొని ఎలాగైనా నిలదొక్కుకోవాలని ఆ పార్టీ భావిస్తోంది. అందుకు అనుగుణంగానే వ్యూహాలు సిద్ధం చేస్తోంది. ఆ దిశగా అడుగులు వేస్తోంది. ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత దానికి కట్టుబడి ఉండిపోవడం రాజకీయ పార్టీలకు కష్టంగా ఉంటుందేమో? ఎస్సీ వర్గీకరణకు మద్దతు పలికిన తెలుగుదేశం పార్టీ.. ఆ తర్వాత అందులోని వర్గాలకు దూరం కాకూడదనే ఉద్దేశంతో దానిని పక్కన పెట్టేసింది. దశాబ్దాల తరబడి పార్టీకి మద్దతుగా నిలిచిన మాదిగ వర్గం ఇప్పుడు టీడీపీని పక్కన పెట్టేసిందంటున్నారు.

ఇప్పటికీ మాదిగలకి కోపం తగ్గలేదట:
గత ఎన్నికల్లో తమ సామాజికవర్గ ప్రయోజనాలను విస్మరించిందంటూ మాదిగలు టీడీపీకి వ్యతిరేకంగా పని చేశారట. చివరకు దామాషా ప్రకారం మాదిగ వర్గానికి రావలసిన పదవులు సైతం మాల సామాజికవర్గానికి ఇచ్చారని, అందుకే ఇప్పటికీ మాదిగలకి టీడీపీపై కోపం తగ్గలేదని అంటున్నారు టీడీపీలోని మాదిగ సామాజికవర్గ నేతలు. ఉమ్మడి రాష్ట్రంలో కూడా మొదటి నుంచి మాల సామాజికవర్గం టీడీపీకి వ్యతిరేకంగా ఉందని, కానీ, పార్టీకి అండగా నిలుస్తోంది మాత్రం మాదిగ వర్గమేనని ఉదాహరణలు చూపిస్తున్నారు.

అందుకే పార్టీకి ఆ వర్గం దూరమైంది:
ఎస్సీలను ఏబీసీడీలుగా వర్గీకరణ చేశారనే కారణంతో చాలాకాలం మాదిగ వర్గం టీడీపీకి అండగా నిలిచింది. కానీ అధికారంలోకి వచ్చాక ఆ వర్గ నాయకులను, ప్రయోజనాలను పూర్తిగా విస్మరించిందని అంటున్నారు. అందుకే పార్టీకి ఆ వర్గం దూరమైందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే టీడీపీలోని మాదిగ సామాజికవర్గ నేతలు.. పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య నాయకత్వంలో రహస్యంగా సమావేశమయ్యారట. గతంలో వర్ల రామయ్యకి రాజ్యసభ సీటు ఇచ్చినట్టే ఇచ్చి పార్టీ మోసం చేసిందని, ఒక నాయకుడు ఈ సమావేశంలో వాఖ్యానించినట్లు సమాచారం. ఎస్సీ వర్గీకరణ కోసం పార్టీలకు అతీతంగా పోరాటం చేయాలని నిర్ణయించారని అంటున్నారు.

తిరుపతి పార్లమెంట్‌ ఉప ఎన్నికల్లో త్రిముఖ పోరు


మాదిగలకు జరిగిన అన్యాయంపై అసంతృప్తి:
పార్టీలో మాదిగలకు జరిగిన అన్యాయంపై అందరూ అసంతృప్తి వ్యక్తం చేశారట. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ సామాజికవర్గాన్ని దూరంగా పెట్టారని, ఏపీలో మాలలు ఎక్కువ శాతం ఉన్నారనే ఆలోచనతో మాదిగలను అధిష్టానం విస్మరించిందని ఆ సమావేశంలో పాల్గొన్న నేతలు అభిప్రాయపడ్డారట. పదవులన్నీ మాలలకే ఇచ్చారని, అప్పటికప్పుడు పార్టీలోకి వచ్చిన జూపూడి ప్రభాకర్‌రావు, కారెం శివాజీలకు పెద్ద పీట వేసి మొదటి నుంచి పార్టీని నమ్ముకున్న మాదిగలకు అన్యాయం చేశారని దెప్పి పొడిచారని అంటున్నారు.

పక్క పార్టీల నుంచి వచ్చినోళ్లకు పదవులు, మొదట్నుంచి నమ్ముకున్నోళ్లకు అన్యాయం:
డొక్కా మాణిక్య వరప్రసాద్ లాంటి పక్క పార్టీల నుంచి వచ్చిన నేతలకు ఒకటికి నాలుగు పదవులు ఇచ్చారని, మొదటి నుంచి పార్టీని నమ్ముకున్న వారికి మాత్రం అన్యాయం చేశారని మండిపడ్డారట. వీరందరినీ వర్ల రామయ్య, జవహర్ లాంటి నేతలు సముదాయించి ఇక నుంచి అధిష్టానవర్గం అలాంటి పొరపాటు చేయదని నచ్చజెప్పారని టాక్‌. త్వరలోనే పార్టీ అధినేత చంద్రబాబును కలిసి వర్గీకరణపై మరోసారి దృష్టి పెట్టాలని, అవసరమైతే ఢిల్లీకి వెళ్లి ప్రధాని, ఇతర పార్టీల నేతలను కలిసి మాదిగలకు న్యాయం జరిగేలా చొరవ తీసుకోవాలని కోరబోతున్నారట.

రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని నిర్ణయం:
సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఎస్సీ వర్గీకరణ అంశం ఆయా రాష్ట్రాల్లోని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలనేది మాదిగ సామాజికవర్గ నేతల ఆలోచన అంటున్నారు. చంద్రబాబు మొదటిసారి సీఎం అయినప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఎస్సీలను ఏబీసీడీలుగా వర్గీకరించారు. ఆ తర్వాత సుప్రీంకోర్టు జోక్యంతో ఈ అంశం మరుగున పడింది. వర్గీకరణ అంశం తర్వాత కొంతకాలం మాదిగలు టీడీపీకి గట్టిగా మద్దతిచ్చారు.

త్వరలోనే మందకృష్ణ మాదిగతో కలిసి పెద్దఎత్తున ఉద్యమం:
రాష్ట్ర విభజన నేపథ్యంలో ఏపీలో మాదిగ సామాజికవర్గం ప్రభావం తక్కువనే ఆలోచనతో చంద్రబాబు మాలలను ప్రోత్సహించడం మొదలుపెట్టారంటారు. దీంతో మాల, మాదిగ వర్గాలు రెండూ పార్టీకి దూరమయ్యాయని చెబుతారు. టీడీపీలోని మాదిగ సామాజికవర్గ నేతలంతా త్వరలోనే మందకృష్ణ మాదిగతో కూడా చర్చించి పెద్దఎత్తున ఉద్యమం చేయాలని భావిస్తున్నారట. మొన్న జరిగిన సమావేశం పార్టీకి వ్యతిరేకంగా జరిగిన మీటింగ్ కాదంటున్నారు నేతలు. కేవలం అధికార పార్టీని, ఆ పార్టీలోని మాదిగ సామాజిక వర్గ నేతలని టార్గెట్ చేస్తామని అంటున్నారు టీడీపీ నేతలు. మరి టీడీపీ చేసే పోరాటం ఎంత వరకు వర్కవుట్ అవుతుందో చూడాలి.

Related Tags :

Related Posts :