టీడీపీకి భయం పట్టుకుందా.. కొల్లు రవీంద్ర అరెస్టుపై అందుకే మౌనంగా ఉండిపోయిందా

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

ఏపీ ప్రతిపక్ష పార్టీ టీడీపీ నేతల్లో భయం మొదలైందట. వరుసగా ఆ పార్టీ నేతల అరెస్టులతో ఇతర నేతల్లో కూడా ఆందోళన పెరుగుతోందని చెబుతున్నారు. ముందుజాగ్రత్తగా కొల్లు రవీంద్ర అరెస్టును కొందరు టీడీపీ నేతలే సమర్ధిస్తున్నారట. మరికొందరు ఖండించడానికి కూడా భయపడుతున్నారు. వైసీపీపై ఒంటికాలుపై వెళ్లే మాజీ మంత్రి దేవినేని ఉమా సైతం కొల్లు రవీంద్ర విషయంలో ఎందుకు మౌనంగా ఉండిపోయారనే ప్రశ్న ఇప్పుడు పార్టీలో వినిపిస్తోంది.

మచిలీపట్నం వాసి, జిల్లా టీడీపీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ అయిన బచ్చుల అర్జునుడు కూడా ఎందుకు సాయంత్రం వరకూ స్టేషన్ సమీపంలోకి కూడా రాలేకపోయారు? వీటన్నింటిపైనా అంతర్గతంగా పెద్ద స్థాయిలో చర్చ జరుగుతోంది. పార్టీ అధినేత చంద్రబాబు సైతం కిందిస్థాయి నేతల్ని ఏమీ అనలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారని చెబుతున్నారు.

కృష్ణా జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో గత నెలలో వైసీపీ నాయకుడు మోకా భాస్కరరావు హత్య కేసులో నాలుగో నిందితునిగా మాజీ మంత్రి కొల్లు రవీంద్రను అరెస్టు చేశారు. భాస్కరరావు హత్య జరిగిన రోజే ఇది రాజకీయ హత్య అని, దీనిపై కొల్లు రవీంద్ర ప్రమేయం ఉందని విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో పోలీసులు ముందుగా ముగ్గురిని అరెస్టు చేశారు. తర్వాత వారిచ్చిన సమాచారం మేరకు కొల్లు రవీంద్రను అరెస్టు చేశారు.

రవీంద్రను అరెస్టు చేస్తారని టీడీపీ నేతలకు ముందుగానే సమాచారం ఉంది. అలాంటపుడు వ్యూహాత్మకంగా వ్యవహరించాల్సి ఉంది. కానీ కొల్లు విషయంలో అలా చేయలేదు. దీనికి పార్టీ అధినాయకత్వాన్ని స్థానిక టీడీపీ తప్పుదారి పట్టించిందా? రవీంద్రతో ఆరంభం నుంచీ ఉన్న ఆధిపత్య పోరాటం ఈ విధంగా కక్ష తీర్చుకునేలా చేసిందా? అనే దానిపై ఇప్పుడు చర్చ జరుగుతోంది. అరెస్టు చేస్తారని తెలిసినప్పటికీ కొల్లు రవీంద్రను ఎందుకు మచిటీపట్నంలోని ఇంటి నుంచి విశాఖకు పంపే ఏర్పాట్లు చేశారు?

రవీంద్రకు సరైన న్యాయ సలహాలు అందించే విషయంలో ఎందుకు నిర్లక్ష్యం చేశారు? అనే చర్చ సాగుతోంది. బందరు ప్రాంతానికి చెందిన మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ, జిల్లా టీడీపీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు కూడా బీసీ సామాజిక వర్గానికి చెందిన వారే. ఆరంభం నుంచీ కూడా మూడు వర్గాలకూ పొసగడం లేదు. అయినా పార్టీ అధినేత చంద్రబాబు కారణంగా సర్దుకొని వెళుతున్నారు. అనూహ్యంగా కొల్లు రవీంద్ర హత్యకేసులో చిక్కుకోవడంతో పరిస్థితులు తారుమారయ్యాయి. పార్టీలోని కొన్ని శక్తులు సైతం దీన్ని రాజకీయంగా ఉపయోగించుకోవడానికి సిద్ధమయ్యాయని అంటున్నారు.

తెలుగుదేశం పార్టీలో వ్యక్తిగత క్రమశిక్షణ ఎక్కువ. పార్టీ అధినేతను కాదని ఎవరూ ఏమీ చేయరు. పార్టీ ఏదైనా పిలుపునిస్తే దాన్ని తూ.చ తప్పకుండా పాటించడమే తెలుసు. అదే విధంగా అచ్చెన్నాయుడు అరెస్టు జరిగినపుడు కూడా అన్నింటా నిరసనలు వ్యక్తమయ్యాయి. అచ్చెన్నాయుడుని విజయవాడ వరకూ తరలించే క్రమంలో అన్ని ప్రాంతాల్లోనూ పోలీసు నిఘా పెట్టారు. కానీ కొల్లు రవీంద్రను అరెస్టు చేసి, పోలీస్ స్టేషన్లో 10 గంటల పాటు ఉంచినా స్టేషన్ సమీపంలోకి పరిసర ప్రాంతం నుంచి మండల స్థాయి నేతలు మినహా మరెవరూ రాని అసాధారణ పరిస్థితి.

READ  టీడీపీ నేతల కార్లపై వైసీపీ కార్యకర్తల దాడి...మాచర్లలో టెన్షన్

ఆ రోజు పార్టీ అధినేత నుంచి అన్ని స్థాయిల నేతలూ అమరావతిలోనే ఉన్నారు. కనీసం మోరల్ సపోర్టుగా అయినా స్టేషన్ దగ్గరకు వచ్చి, మేమున్నాం అని చెప్పడానికి కూడా ఎవరూ సాహసించలేదు. తెల్లవారు జామున గూడూరు పోలీస్ స్టేషన్‌కు తీసుకొస్తే సాయంత్రానికి మాజీ ఎంపీ కొనకళ్ల నారాయరణ, బచ్చుల అర్జునుడు వెళ్లడం విమర్శలకు దారితీస్తోంది.

కొల్లు రవీంద్ర అరెస్టు, అనంతర పరిణామాలపై టీడీపీలో సీరియస్ గానే చర్చ జరిగింది. ఎవరికి వారు దీన్ని సమర్ధించుకునేలా వ్యవహరిస్తున్నారు. భాస్కరరావు హత్యలో కొల్లు ప్రమేయం ఉందా, లేదా అనేది విచారణలో తేలుతుంది. కానీ పార్టీ అధినాయకత్వం ఎందుకు కొల్లుకు అండగా నిలవలేకపోయింది? అడ్డుకున్నది ఎవరు? అధినాయకత్వానికి సరైన సమాచారం ఇవ్వకుండా చేసింది ఎవరు? అన్నది ఇపుడు ప్రధానమైన చర్చగా మారింది. ఇదే విధానం కొనసాగితే రాబోయే రోజుల్లో వైసీపీకి వ్యతిరేకంగా ఎవరూ పన్నెత్తి మాట్లాడే పరిస్థితి ఉండదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఇది టీడీపీకి ఏమాత్రం మంచిది కాదని పార్టీ అభిమానులు అంటున్నారు.

Related Posts