ఎయిర్‌టెల్ యూజర్లకు హెచ్చరిక.. ఈ లింకులు ఓపెన్ చేయొద్దు..!

ఎయిర్‌టెల్ యూజర్లకు హెచ్చరిక.. ఈ లింకులు ఓపెన్ చేయొద్దు..!

Airtel KYC Fraud : ప్రముఖ టెలికం దిగ్గజం ఎయిర్ టెల్ తమ యూజర్లను హెచ్చరించింది. సైబర్ నేరగాళ్ల విషయంలో జాగ్రత్త ఉండాలంటూ పలు సూచనలు చేసింది. ప్రత్యేకించి అనుమానాస్పద లింకులను ఎట్టిపరిస్థితుల్లో కూడా ఓపెన్ చేయొద్దని సూచిస్తోంది. ఇటీవల యూజర్ల కేవైసీ అప్ డేట్ పేరుతో కొన్ని లింకులు ఎస్ఎంఎస్ రూపంలో ఎయిర్ టెల్ యూజర్ల ఫోన్లకు వస్తున్నాయి. ఎయిర్ టెల్ కేవైసీ అని పొరబడి వాటిని లింకు చేస్తున్నారు. యూజర్లు సైబర్ నేరగాళ్లకు చిక్కి బాధితులు అవుతున్నారు.


కెవైసి అప్ డేట్ చేసుకోకపోతే.. మీ మొబైల్ సర్వీసు నిలిచిపోతుందని మెసేజ్ లు పంపుతున్నారు సైబర్ నేరగాళ్లు.. కంగారులో ఎయిర్ టెల్ వినియోగదారులు అప్ డేట్ చేసుకోవాలని లింక్ క్లిక్ చేసి మోసపోతున్నారు. ఎయిర్ టెల్ యూజర్లను కేవైసీ విషయంలో హెచ్చరించిన ఫొటోను హైదరాబాద్ సిటీ పోలీసులు ట్వీట్ చేశారు. ఎయిర్ టెల్ కెవైసి పేరుతో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారని, యూజర్లు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆన్ లైన్, ఫోన్ కాల్ చేసి కేవైసీ అప్ డేట్ చేసుకోవాలంటూ ఎవరైనా చెబితే.. నమ్మొద్దని సూచిస్తున్నారు. మీ బ్యాంకు వివరాలు నేరగాళ్ల చేతుల్లోకి వెళ్లే రిస్క్ ఉందని తెలిపారు.

‘ఎయిర్ టెల్ యూజర్లు కెవైసి అప్ డేట్ చేయాలని మోసగాళ్లు ఫోన్లు, మెసేజ్ పంపుతున్నారు. ఒక లింక్ పంపి.. దానిపై క్లిక్ చేసి కేవైసీ అప్ డేట్ చేసుకోవాలని సూచిస్తున్నారు. ఆ లింక్ ఓపెన్ చేయగానే సరాసరి బ్యాంకు, క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు వివరాలు ఎంటర్ చేయాల్సిందిగా అడుగుతారు. ముందుగా రూ. 10 చెల్లిస్తే మొబైల్ సేవలు కొనసాగుతాయని నమ్మబలుకుతారు. అమాయకంగా నేరగాళ్లు చెప్పినట్టు లింకులు క్లిక్ చేస్తే అంతే.. అకౌంట్లో నగదుతో పాటు విలువైన మీ వ్యక్తిగత వివరాలు సైబర్ మోసగాళ్ల చేతుల్లోకి వెళ్లినట్టే.. అని పోలీసులు హెచ్చరిస్తున్నారు.