హెల్మెట్ మస్ట్ : లేదంటే బైక్ స్టార్ట్ అవ్వదు

  • Published By: veegamteam ,Published On : March 10, 2019 / 07:17 AM IST
హెల్మెట్ మస్ట్ : లేదంటే బైక్ స్టార్ట్ అవ్వదు

రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువగా హెల్మెట్ పెట్టుకోకపోవడం వల్లే చనిపోతున్నారు. తలకు తీవ్ర గాయాలతో ప్రాణాలు కోల్పోతున్నారు. దీంతో హెల్మెల్ రూల్ ను ట్రాఫిక్ పోలీసులు మస్ట్  చేశారు. హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేసే వారికి ఫైన్లు వేస్తున్నారు. కనీసం అలా అయినా హెల్మెట్లు ధరిస్తారని ఆశించారు. ఫైన్లు వేసినా కొందరిలో మార్పు రావడం లేదు. హెల్మెట్ లేకుండానే బైక్స్  నడుపుతున్నారు. దీంతో ప్రమాదాల బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు.

ఈ సమస్యకు చెక్ చెప్పేలా ఓ యువకుడు వినూత్న ప్రయోగం చేసి సక్సెస్ అయ్యాడు. హెల్మెట్‌ ఉంటేనే బైక్ స్టార్ట్ అయ్యేలా టెక్నిక్ కనిపెట్టాడు. హెల్మెట్ ధరించకపోతే బైక్ ఇంజిన్ ఆన్  అవ్వదు. భద్రాద్రి జిల్లా బూర్గంపాడు మండలం పినపాక పట్టీనగర్‌ గ్రామానికి చెందిన కొట్టె ప్రవీణ్‌ ఈ సాంకేతికతను కనుగొన్నాడు.

కొత్తగూడెంలోని రుద్రంపూర్‌ ప్రభుత్వ పాలిటెక్నిక్‌లో ప్రవీణ్ ఈఈఈ పూర్తి చేశాడు. తరుచుగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు, మోటార్‌ సైకిళ్ల చోరీ అతడిని ఆలోచనలో పడేశాయి. వీటికి అడ్డుకట్ట వేయాలని నిర్ణయించుకున్న ప్రవీణ్ తన బుర్రకి పదును పెట్టాడు. తనకు తెలిసిన సాంకేతిక పరిజ్ఞానం, గతంలో రిమోట్‌ టాయ్స్‌ తయారుచేసిన అనుభవంతో మోటార్‌ సైకిల్‌  నడవాలంటే హెల్మెట్‌ ఉండేలా సరికొత్త సాంకేతికతను తయారుచేశాడు. మోటార్‌ సైకిల్‌ ఇగ్నిషన్‌ను రిలే సర్క్యూట్‌తో అనుసంధానం చేశాడు. రిలే సర్క్యూట్ ఆన్, ఆఫ్‌ చేసేందుకు ఓ ట్రాన్స్‌మీటర్‌ను హెల్మెట్‌లో అమర్చాడు. ట్రాన్స్‌మీటర్‌ సిగ్నల్‌ కమ్యూనికేషన్‌ ఉంటేనే మోటార్‌ సైకిల్‌ ఇగ్నిషన్‌కు అనుసంధానం చేసిన రిలే సర్క్యూట్‌ పనిచేస్తుంది. హెల్మెట్‌ దగ్గరుంటేనే ట్రాన్స్‌మీటర్‌ నుంచి సిగ్నల్స్‌ అంది.. బైక్ స్టార్ట్‌ అవుతుంది. లేకుంటే కాదు. హెల్మెట్‌ మరిచిపోయినా బైక్ స్టార్ట్ అవ్వదు.

హెల్మెట్‌కు అమర్చిన ట్రాన్స్‌మీటర్‌ పనిచేసేందుకు వారానికి ఒకసారి చార్జింగ్‌ పెట్టుకోవాల్సి ఉంటుందని ప్రవీణ్‌ తెలిపాడు. గోవాలో జిందాల్‌ కంపెనీలో పనిచేస్తున్న సమయంలో సెల్‌ఫోన్‌ ఆధారంగా  విద్యుత్‌ మోటార్‌లు ఆన్, ఆఫ్‌ చేసి సక్సెస్‌ అయ్యానని, ఇళ్లలోని గదులకు రక్షణ కల్పించేందుకు సెక్యూరిటీ సిస్టం డెవలప్‌ చేశానని ప్రవీణ్‌ తెలిపాడు. హెల్మెట్‌ పెట్టుకోవాలని ఎంత ప్రచారం చేసినా  వాహనదారులు పట్టించుకోవటం లేదని, తాను తయారుచేసిన హెల్మెట్‌ ట్రాన్స్‌మీటర్‌ సిస్టం పూర్తిస్థాయిలో డెవలప్‌ చేస్తే బైక్ నడిపే ప్రతిఒక్కరు హెల్మెట్‌ తప్పనిసరిగా పెట్టుకుంటారని, దీంతో రోడ్డు ప్రమాదాల్లో మరణాల శాతం తగ్గుతుందని అభిప్రాయపడ్డాడు. హెల్మెట్‌ లేకుంటే బైక్ స్టార్ట్‌ కానందున బైక్‌ చోరీలు కూడా తగ్గిపోతాయన్నారు.