లక్షల్లో ఇంటర్నెట్ బిల్లు.. ఒక రోజు రూ. 4.6 లక్షలు!

లక్షల్లో ఇంటర్నెట్ బిల్లు.. ఒక రోజు రూ. 4.6 లక్షలు!

One day Internet Bill : లక్షల్లో ఇంటర్నెట్ బిల్లు చూసి ఓ కంపెనీ షాక్ అయింది. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 4.6 లక్షల నెట్ బిల్లు వచ్చింది. అది కూడా నెలకు కాదు.. ఒక రోజు ఇంటర్నెట్ బిల్లు అంట.. అంత మొత్తంలో ఇంటర్నెట్ బిల్లు రావడం చూసి సదరు కంపెనీ నివ్వెరపోయింది. అంతర్జాతీయ ఫోన్ కాల్స్ రీరూటింగ్ ద్వారా సైబర్ నేరగాళ్లు తమ నెట్ వర్క్ ను హ్యాక్ చేశారంటూ ఆరోపించింది. వెంటనే సీసీఎస్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

అంతర్జాతీయ వాయిస్ కాల్స్ ను వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ (VOIP) పద్ధతిలో లోకల్ కాల్స్ మాదిరిగా మార్చేస్తున్నారంటూ బాధిత కంపెనీ ఆరోపించింది. విదేశాల నుంచి ఫోన్ కాల్స్ దేశీయ ఎక్ఛ్సేంచ్ నుంచి నేషనల్‌ లాంగ్‌ డిస్టెన్స్‌ ఆపరేటర్‌కు చేరుతుంటాయి. అంతర్జాతీయ గేట్‌ వే ఆఫ్‌ ఐఎల్‌డీ ఆపరేటర్‌కు చేరుతాయి. ఆప్టికల్‌ ఫైబర్‌ కేబుల్స్‌, శాటిలైట్‌ ద్వారా ఇండియాకు వస్తాయి. ఇండియాలోకి వచ్చిన తరువాత ఇంటర్నేషనల్‌ గేట్‌వే ఆఫ్‌ ఐఎల్‌డీ ఆపరేటర్‌కు, నేషనల్‌ డిస్టెన్స్‌ ఆపరేటర్‌కు చేరుకొని బీఓఎస్‌ఓ టెలిఫోన్‌ ఎక్సేంజ్‌ ద్వారా యూజర్లకు ఫోన్ వాయిస్ కాల్స్‌ వస్తుంటాయి.

ఇదంతా సెకన్ల సమయంలోనే జరిగిపోతుంది. గేట్‌వేలకే ఆపరేటర్లు కొంత మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. ఈ మొత్తాన్ని చెల్లించని కొందరు అంతర్జాతీయ కాల్స్‌ను, ఇంటర్‌నెట్‌ సాయంతో లోకల్‌ కాల్స్‌గా మార్చేస్తున్నారు. ఇంటర్‌నెట్‌ కనెక్షన్లు ద్వారా వీఓఐపీ పద్ధతిలో కాల్స్‌ రీరూటింగ్‌ చేసేస్తున్నారు. బంజారాహిల్స్‌లోని ప్రైవేట్‌ సంస్థకు చెందిన ఇంటర్‌నెట్‌ నెట్‌ వర్క్‌ను ముఠా హ్యాకింగ్ చేసినట్టు ఫిర్యాదు అందింది. హ్యాక్ చేసిన ఇంటర్‌నెట్‌ను ఉపయోగించి కాల్స్‌ రీరూటింగ్‌ చేశారు. దీని ప్రభావంతో కాల్స్‌ను రీరూటింగ్‌ చేయగా.. ఒక్కరోజే సదరు కంపెనీకి రూ. 4.6 లక్షల ఇంటర్నెట్ బిల్లు వచ్చింది. కేసు నమోదు చేసిన సైబర్‌క్రైమ్‌ పోలీసులు ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు.