facebook data leak : ఇటీవల 533 మిలియన్ ఫేస్బుక్ వినియోగదారుల వ్యక్తిగత డేటా ఆన్లైన్లో లీక్ అయిందని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. డేటాలో కాంటాక్ట్ నంబర్, ఫేస్బుక్ ఐడిలు, పుట్టిన తేదీలు ఉన్నాయి. అమెరికాలో 3.2 కోట్లకు పైగా, యుకెలో 1.1 కోట్లు, భారతదేశంలో 60 లక్షల మంది వినియోగదారుల వ్యక్తిగత సమాచారం లీక్ అయిందని ఓ బిజినెస్ పత్రిక నివేదించింది. ఇందులో ఫేస్బుక్ సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ తోపాటు ఇతర సహ వ్యవస్థాపకులు క్రిస్ హ్యూస్ మరియు డస్టిన్ మోస్కోవిట్జ్ ప్రభావిత వినియోగదారులలో ఉన్నారు.
భద్రతా నిపుణుడు,సైబర్ క్రైమ్ ఇంటెలిజెన్స్ సంస్థ హడ్సన్ రాక్ సిటిఓ అలోన్ గాల్ మొదట ఫేస్బుక్ డేటా ఉల్లంఘనను ట్విట్టర్లో నివేదించారు. మొత్తం 533 మిలియన్ ఫేస్బుక్ రికార్డులు లీక్ అయ్యాయని.. ఫేస్బుక్ ఖాతా కోసం ఉపయోగించిన ఫోన్ నంబర్ లీక్ అయ్యే అవకాశం ఉందని ఆయన అన్నారు. ఫోన్ నంబర్ తోపాటు ఫేస్బుక్ ఐడి, పూర్తి పేరు, స్థానం, గత స్థానం, పుట్టిన తేదీ, ఈ-మెయిల్ అడ్రస్, ఖాతా సృష్టించిన తేదీ, సంబంధాల స్థితి.. ఈ లీక్‌లో ఉన్నాయన్నారు.
సోషల్ ఇంజనీరింగ్, స్కామింగ్, హ్యాకింగ్ , మార్కెటింగ్ కోసం సైబర్ క్రైమినల్స్ ఈ సమాచారాన్ని ఉపయోగిస్తారని ఆయన వినియోగదారులను హెచ్చరించారు. అయితే డేటా లీక్ లో ఫోన్ నంబర్ బహిర్గతమైందో లేదో తనిఖీ చేసే మార్గాలు.. ఖాతా వివరాలు ఆన్లైన్లో లీక్ అయ్యాయో లేదో తనిఖీ చేయడానికి కొన్ని సైట్లు ఉన్నాయి. haveibeenpwned.com వెబ్‌సైట్‌కి వెళ్లి ఇమెయిల్ చిరునామాను టైప్ చేయాలి.. క్లిక్ చేయగానే వెబ్సైట్ మీరు ఫేస్బుక్ లీక్‌లో ఉన్నారా లేదా అని ప్రదర్శించడమే కాకుండా, మీరు మరేదైనా లీక్ లో భాగమా లేదా అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తుంది.