వాట్సాప్‌కు బై.. బై, సిగ్నల్‌ యాప్‌కు హాయ్‌..హాయ్‌

వాట్సాప్‌కు బై.. బై, సిగ్నల్‌ యాప్‌కు హాయ్‌..హాయ్‌

Whatsapp Bye ye hi signal : టెక్ దిగ్గజం, టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ దెబ్బకు వాట్సాప్ ఢమాల్ అవుతుంది. మూడు రోజులుగా సోషల్ మీడియాలో ఇన్‌స్టంట్ మెజేసింగ్ యాప్ వాట్సాప్‌ హాట్ టాపిక్‌గా మారింది. వాట్సాప్ ప్రైవసీ పాలసీని అప్‌డేట్ చేసి కొత్త రూల్స్‌ని ప్రకటించడం పెద్ద దుమారాన్నే రేపుతోంది. వాట్సాప్ కొత్త ప్రైవసీ రూల్స్‌పై యూజర్లు అసంతృప్తితో ఉన్నారు. వాట్సాప్ కొత్త ప్రైవసీ రూల్స్ అంగీకరిస్తే.. యూజర్ల ఫోన్ మోడల్, ఆపరేటింగ్ సిస్టమ్, బ్యాటరీ లెవెల్, సిగ్నల్ స్ట్రెంత్, బ్రౌజర్ ఇన్ఫర్మేషన్, మొబైల్ నెట్వర్క్, భాష, ఐపీ అడ్రస్ లాంటి వివరాలన్నీ వాట్సప్‌కు తెలుస్తాయి. అంతేకాదు… ఆ వివరాలను ఫేస్‌బుక్‌తో పంచుకుంటామని కూడా వాట్సప్ తెలిపింది. ఒకప్పుడు యూజర్ల ప్రైవసీకి ప్రాధాన్యం ఇచ్చిన వాట్సాప్, ఇప్పుడు ఆ ప్రైవసీ విషయంలో కొత్త రూల్స్ తీసుకురావడాన్ని యూజర్లు సహించలేకపోతున్నారు. అందుకే వాట్సాప్‌కు ప్రత్యామ్నాయంగా సిగ్నల్ యాప్‌ను ఎంచుకుంటున్నారు.

ఎలాన్ మస్క్ దెబ్బ : –
వాట్సాప్ తన ప్రైవసీ పాలసీని లాంచ్ చేసిన తర్వాత ప్రపంచ సంపన్నుడైన టెస్లా సీఈవో ఎలాన్ మస్క్.. వాట్సాప్‌ను వదిలిపెట్టి సిగ్నల్ యాప్‌ను ఎంచుకోవాలని సూచించాడు. మస్క్ పిలుపునకు భారత్‌లో విశేష స్పందన లభించింది. సిగ్నల్‌కు డౌన్‌లోడ్లు పోటెత్తాయి. ఫలితంగా వాట్సాప్‌ను వెనక్కి నెట్టేసి, యాప్‌స్టోర్‌లో దేశంలోనే టాప్ ఫ్రీ యాప్‌గా సిగ్నల్‌ అవతరించింది. మూడు రోజులుగా సిగ్నల్ మెసెంజర్ యాప్ డౌన్‌లోడ్ చేసేవారి సంఖ్య పెరుగుతోంది. కొత్త యూజర్ల సంఖ్య పెరుగుతోందని సిగ్నల్ ప్రకటించింది. నాన్ ప్రాఫిట్ సంస్థ అయిన సిగ్నల్ ఫౌండేషన్ రూపొందించిన ఎన్‌క్రిప్టెడ్ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ ఇది. సిగ్నల్ డౌన్‌లోడ్స్ ఎంతలా పెరిగిపోయాయంటే కొత్త అకౌంట్లకు ఫోన్ నెంబర్ వెరిఫికేషన్స్ చాలా ఆలస్యంగా జరుగుతున్నాయి. డౌన్‌లోడ్స్‌లో వాట్సప్‌ని దాటిపోయినట్టు ట్విట్టర్‌లో ప్రకటించింది సిగ్నల్.

వాట్సాప్ ప్రైవసీ పాలసీ : –
వాట్సాప్ తన ప్రైవసీ పాలసీ, సేవా నియమాలకు మార్పులు చేసింది. అంతేకాకుండా ఫిబ్రవరి 8 కల్లా వీటికి అంగీకరించకపోతే వాట్సాప్ ఖాతా డిలీట్ అవుతుందని పేర్కొంది. అంటే వాట్సాప్ వాడాలంటే వీటిని అంగీకరించడం తప్ప వేరే ఆప్షన్ లేదు. దీంతో డేటా ప్రైవసీకి ప్రాధాన్యతనిచ్చే కొంతమంది వాట్సాప్‌కు బై.. బై.. చెప్పేసి సిగ్నల్‌కు హాయ్‌.. హాయ్‌ చెబుతున్నారు. వాట్సాప్‌ పాలసీపై గుర్రుగా ఉన్న వినియోగదారులు సిగ్నల్ మెసేజింగ్ యాప్‌పై ఆసక్తి చూపుతున్నారు. వినియోగదారుల డేటాను ఫేస్‌బుక్‌తో పంచుకునేలా తీసుకొచ్చిన వాట్సాప్ అప్‌డేట్ పాలసీ తీవ్ర విమర్శలకు తావిస్తోంది.

వినియోగదారులకు ఒక వరం : –
దీంతో ప్రత్యామ్నాయం కొరకు చూస్తున్న వినియోగదారులకు సిగల్న్ ఒక వరంలా కనిపించింది. వినియోగదారుల గోప్యతను కాపాడుతామని హామీ ఇవ్వడంతో ఇప్పుడందరూ సిగ్నల్ యాప్ వైపు చూస్తున్నారు. గత రెండు రోజుల్లో యాపిల్ యాప్ స్టోర్, గూగుల్ ప్లేస్టోర్లలో లక్ష మంది వరకు సిగ్నల్ యాప్‌ను ఇన్ స్టాల్ చేసుకున్నారు. మరోవైపు వాట్సాప్ డౌన్‌లోడ్లు గత వారంతో పోలిస్తే 11 శాతం వరకు పడిపోయాయి.