ఫేస్‌బుక్‌పై ఇన్‌స్టా యూజర్ దావా : యూజర్ల మొబైల్ కెమెరాలను యాక్సస్ చేస్తోందంట!

  • Published By: sreehari ,Published On : September 19, 2020 / 04:32 PM IST
ఫేస్‌బుక్‌పై ఇన్‌స్టా యూజర్ దావా : యూజర్ల మొబైల్ కెమెరాలను యాక్సస్ చేస్తోందంట!

ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌ యూజర్ డేటా ప్రైవసీ ఆరోపణలను ఎదుర్కొంటోంది. ఇన్ స్టాగ్రామ్ యూజర్ల ప్రైవసీ డేటాను చాటుగా గమనిస్తోందని పేరంట్ కంపెనీ ఫేస్ బుక్ పై దావా నమోదైంది. ఇన్‌స్టా యూజర్ల మొబైల్ ఫోన్ కెమెరాల ద్వారా వారికి తెలియకుండానే ఫేస్ బుక్ గమనిస్తోందంటూ న్యూజెర్సీ ఇన్‌స్టా యూజర్ శాన్ ఫ్రాన్సిస్ కోలోని ఫెడరల్ కోర్టులో దావా వేశాడు.



ఇన్‌స్టా యూజర్లు యాప్ ఓపెన్ చేయకపోయినా  ఐఫోన్ కెమెరాలను ఫొటో షేరింగ్ యాప్ యాక్సస్ చేసుకున్నట్టు ఓ రిపోర్టు వెల్లడించింది. అయితే ఈ ఆరోపణలను సోషల్ దిగ్గజం ఫేస్ బుక్ తీవ్రంగా ఖండించింది. అది బగ్ కారణంగానే అలా జరిగి ఉంటుందని వెల్లడించింది.

ఆ బగ్ ఫిక్స్ చేసే పనిలో ఉన్నామని స్పష్టం చేసింది. ఇన్ స్టాగ్రామ్ యాప్ ఐఫోన్ కెమెరాలను యాక్సస్ చేస్తున్నట్టు కొన్ని తప్పుడు నోటిఫికేషన్లు వచ్చినట్టు గుర్తించామని పేర్కొంది. యూజర్ అనుమతి లేకుండా ఫేస్ బుక్ కావాలనే యూజర్ల విలువైన డేటాను సేకరిస్తోందని ఇన్ స్టా యూజర్ Brittany Conditi ఆరోపించాడు.. దీనిపై ఫేస్ బుక్ స్పందించేందుకు నిరాకరించింది.



ఫేస్ బుక్ తమ ఫేషియల్ రికగ్నైజేషన్ టెక్నాలజీ ద్వారా అక్రమంగా 100 మిలియన్లకు పైగా ఇన్ స్టా యూజర్ల బయో మెట్రిక్ డేటాను సేకరించిందంటూ ఆరోపణలు వచ్చాయి. దీనిపై స్పందించిన ఫేస్ బుక్ తీవ్రంగా ఖండించింది. ఇన్ స్టాగ్రామ్ లో ఎలాంటి ఫేస్ రికగ్నైజేషన్ టెక్నాలజీని వాడటం లేదని స్పష్టం చేసింది.