కొద్దిగంటల్లో ఆకాశంలో సూపర్ సీన్.. 5 గ్రహాలు ఒకేసారి చూడొచ్చు!

  • Published By: sreehari ,Published On : July 18, 2020 / 07:53 PM IST
కొద్దిగంటల్లో ఆకాశంలో సూపర్ సీన్.. 5 గ్రహాలు ఒకేసారి చూడొచ్చు!

కొద్దిగంటల్లో ఆకాశంలో సూపర్ సీన్ కనిపించబోతోంది. ఆదివారం  తెల్లవారుజామున ఆకాశంలో సుందర దృశ్యం ఆవిష్కృతం కానుంది. ఒకట్రెండు కాదు ఏకంగా ఐదు గ్రహాలు ఒకే వరుసలో కనువిందు చేయనున్నాయి. ఎప్పుడో ఒకసారి జరిగే ఇలాంటి సీన్లు మిస్ కావొద్దంటున్నారు ఖగోళ శాస్త్రవేత్తలు. ఈ సూపర్ సీన్‌ కోసం అంతరిక్ష ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇంతకీ ఆ ఆరు గ్రహాలు ఎలా ఉండబోతున్నాయి..? కొత్తగా వాటిలో ఏం కనిపించబోతున్నాయి..? అవును ఇది నిజం… ఆదివారం పొద్దున పొద్దున్నే ఒకటి రెండు కాదు ఏకంగా ఐదు గ్రహాలు ఒకేసారి కనువిందు చేయనున్నాయి. సూర్యోదయానికి 45 నుంచి 60నిమిషాల ముందు బుధుడు, శుక్రుడు, అంగారకుడు, బృహస్పతి, శని గ్రహాలతో పాటు చంద్రుడ్ని కూడా చూడొచ్చు.

ఖగోళంలో కనిపించే వింతల్ని చూసేందుకు ప్రతి ఒక్కరు ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ఎప్పుడో సూర్యగ్రహణమో, చంద్రగహణమో వచ్చినప్పుడు ఇలాంటి అరుదైన క్షణాలను వీక్షిస్తుంటారు. సాధారణంగా కొన్ని మిలియన్ల దూరంలో ఉన్న గ్రహాలను టెలిస్కోప్ సాయంతో చూస్తుంటారు. అయితే ఈసారి అలా కాదు.. ఏకంగా ఐదు గ్రహాలను ఎట్‌ ఏ టైమ్‌లో వీక్షించొచ్చు.

సాధారణం కంటే ఎక్కువ ప్రకాశవంతంగా..
ప్రకాశవంతంగా మెరిసే బుధుడు, శుక్రుడు, అంగారకుడు, బృహస్పతి, శని గ్రహాలను నేరుగా చూడొచ్చు. సాధారణం కంటే చాలా బ్రైట్‌గా నక్షత్రాల్లా కనిపిస్తాయి. అయితే తూర్పు-ఈశాన్యంలో బ్రిలియంట్‌గా కాకుండా శుక్రుడు తక్కువగా కనిపిస్తుంది. అంగారకుడు ఆగ్నేయంలో ఒంటరి నక్షత్రంగా ప్రకాశించనున్నాడు. బృహస్పతి, శని నైరుతిలో స్టార్‌లా ప్రకాశించనుంది. కనిపించే గ్రహాలన్నీ స్పేస్‌ క్రాఫ్ట్‌ తీసిన ఫోటోల్లా కనిపించవు. అతిగా ప్రకాశవంతమైన తారల్లా కనిపిస్తాయంటున్నారు ఖగోళ శాస్త్రవేత్తలు.

బైనాక్యులర్లతో వీక్షించే అవకాశం :
బుధుడ్ని ఐడెంటీఫై చేయడం కొంచెం కష్టంగా ఉండొచ్చు. అయితే సూర్యోదయానికి ముందుగానే బైనాక్యులర్లను ఉపయోగించి చూస్తే మెరిసిపోయే గ్రహాలను చూసే అవకాశం ఉంటుంది. నెలవంక చంద్రుడు ఆకాశం తూర్పు-ఈశాన్య భాగంలో కనిపిస్తాడు. కేవలం 1 శాతం మాత్రమే ఇది ప్రకాశిస్తుంది. బుధుడు చంద్రుని కుడి వైపున ఉంటుంది. అంగారక గ్రహం ఆగ్నేయంలో సగం వరకు ఉంటుంది.

బృహస్పతి నైరుతిలో క్షితిజ సమాంతరంగా ఉండనుంది. శని మాత్రం బృహస్పతి పైభాగంలో ఎడమ వైపున ప్రకాశిస్తూ కనిపిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ అద్భుత దృశ్యం ఉత్తర, దక్షిణ అర్ధగోళంలో కనిపిస్తుంది. భూ మధ్యరేఖకు దక్షిణాన, హంట్ గమనికలు, మార్స్ ఆగ్నేయంలో కాకుండా వాయువ్యంలో కనిపిస్తుంది. ప్రతి రోజు ఉదయం 3-4 నిమిషాల ముందు చూడొచ్చని.. ఈ గ్రహాలు జూలై 25 వరకు ఆకాశంలో కనిపిస్తాయంటున్నారు శాస్త్రవేత్తలు.

2005లో ఒకే వరుసలో ఐదు గ్రహాలు
ఐదు గ్రహాలు ఒకేసారి గతంలో కనిపించాయా..? టెలీస్కోప్‌ల అవసరం లేకుండా నేరుగా వాటిని చూడొచ్చా..? స్వయంగా చూస్తే ఏమైనా ఇబ్బందులు వస్తాయా..? ఒకే రాశిలో గ్రహాలు ఎలా మెరిసిపోనున్నాయి..? ఎన్ని రోజులు ఇలా కనువిందు చేయనున్నాయి..? గతంలోనూ ఇలాంటి అద్భుతం అంతరిక్షంలో చోటు చేసుకుంది. సౌర కుటుంబంలోని నాలుగు కంటే ఎక్కువ గ్రహాలు ఒకే వరుసలో కనిపించాయి. దాదాపు 14 ఏళ్ల తర్వాత మళ్లీ ఈ అపురూపమైన దృశ్యం కనువిందు చేయనుంది. 2005లో బుధుడు, శుక్రుడు, అంగారకుడు, శని, గురు గ్రహాలు ఒకే వరుసలోకి వచ్చాయి. అంతరిక్షంలో ఈ అద్భుతం చివరిసారిగా 2016లో జరిగింది. మళ్లీ ఇప్పుడు ఈ రోదసీ అద్భుతం సర్‌ప్రైజ్‌ చేయబోతోంది. ఆదివారం ఉదయాన్నే ఎలాంటి పరికరాలు లేకుండా చూడొచ్చు.

అద్భుతంగా కనిపించనున్న గ్రహాల వరుస :
నక్షత్రాల్లా మెరిసే గ్రహాలను గుర్తించడం కొంచెం కష్టమే. కానీ బైనాక్యులర్‌ను ఉపయోగిస్తే గ్రహాలను మరింత స్పష్టంగా చూసే అవకాశం ఉంటుంది. గ్రహాల వరుస అద్భుతంగా కనిపించనుంది. బుధ గ్రహాన్ని చూసేందుకు ప్రజలు ఎంతో కష్టపడాల్సి ఉంటుందని.. అయితే శుక్రుడు, అంగారకుడు, శని, గురు గ్రహాలను బైనాక్యూలర్‌, టెలిస్కోప్‌ల ద్వారా వీక్షించొచ్చని అంటున్నారు ఖగోళ శాస్త్రవేత్తలు. ఫోటోల్లో మాత్రమే చూసే ఇలాంటి అరుదైన దృశ్యాలు నేరుగా చూస్తే భలే ముచ్చటగా ఉండనుంది.

సాధారణంగా రెండు గ్రహాలు ఒక రాశిలో ఉండడం ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. ఐదు అంతకంటే ఎక్కువ గ్రహాలు ఒక రాశిలో అప్పుడప్పుడు మాత్రమే దర్శనం ఇస్తుంటాయి. చాలా అరుదుగా జరిగే ఇలాంటి సందర్భాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ మిస్ చేసుకోవద్దని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. గ్రహాలను నేరుగా చూడడం వల్ల ఎలాంటి సమస్యలు, ఇబ్బందులు ఉండవంటున్నారు పైగా ఖగోళంలో జరిగే ఇలాంటి దృశ్యాలను తప్పకుండా చూడాలని సజెస్ట్ చేస్తున్నారు.

అయితే ఒకే వరుసలో గ్రహాలు కనిపించడంపై రకరకాల రూమర్స్ వినిపిస్తున్నాయి. కొంతమంది సోషల్‌ మీడియాలో భయపెట్టేస్తున్నారు. విశ్వంలో ఇలాంటివి జరిగితే ఫలితాలు దారుణంగా ఉంటాయనే ప్రచారం చేస్తున్నారు. ఇవన్నీ ఒట్టి రూమర్సేనని కొట్టిపారేస్తున్నారు సైంటిస్ట్‌లు. గ్రహాల కూటమిని ఆదివారం చూసే ఛాన్స్ మిస్ అయితే మరుసటి రోజు ఉదయం కూడా వీక్షించే అవకాశముంది. 25లోగా ఎప్పుడైనా ఈ ఐదు ప్లానెట్స్ నేరుగా సూర్యోదయానికి ముందు చూడొచ్చు. ఆరు రోజుల పాటు ఈ అద్భుతమైన దృశ్యాన్ని మీరు మిస్‌ అయితే.. మళ్లీ జూన్‌ 2022 వరకు వెయిట్ చేయాల్సిందే. ఆ సీన్‌ ఉత్తర, దక్షిణ అర్ధగోళంలో కనిపించనుంది.