మరో యుగాంతం.. నిజంగానే ప్రళయం ముంచుకోస్తోందా..? ఇందులో వాస్తవమెంత?

మరో యుగాంతం.. నిజంగానే ప్రళయం ముంచుకోస్తోందా..? ఇందులో వాస్తవమెంత?

Asteroid will whiz past Earth in March 2021 : భూమి అంతం కాబోతోందా? ప్రళయం ముంచుకొస్తోందా? యుగాంతం కాబోతుందా? ఇలాంటి అంచనాలు, ఊహాగానాలు గతంలోనూ అందరిని ఆందోళనకు గురిచేశాయి. నిజంగా భూమి అంతమైపోతుందనే భయంతో వణికిపోయారు. కానీ, ఇప్పటివరకూ అలా జరిగింది లేదు. ఇప్పుడు అలాంటి ఊహాగానాలే మళ్లీ ఊపందుకున్నాయి. యుగాంతం రాబోతుందంటూ మళ్లీ అంచనాలు మొదలయ్యాయి. 2021లో భూగోళానికి పెను ముప్పు రాబోతోందంటూ అసత్య ప్రచారం జరుగుతోంది. 2020 కరోనా మహమ్మారితోనే ప్రపంచమంతా అంతమైపోతుందని అంటూ వచ్చారు. కానీ, అలా జరగలేదు. ప్రాణనష్టమైతే జరిగింది కానీ, యుగాంతం అనేది ఇప్పటివరకూ జరగలేదు.

కానీ, ఈసారి మార్చిలో భూమి అంతమైయ్యే అవకాశం ఉందంటూ ప్రచారం జరుగుతోంది. అతిపెద్ద ఆస్టరాయిడ్ గ్రహశకలం ఒకటి భూమి అతిదగ్గరగా రాబోతోందంట.. ఒకవేళ ఈ గ్రహశకలం భూమిని ఢీకొడితే యుగాంతం సంభవించే అవకాశం ఉందంటూ తప్పుడు కథనాలు వైరల్ అవుతున్నాయి. ఖగోళ సైంటిస్టులు మాత్రం అలాంటిదేమి లేదని గట్టిగా చెబుతున్నారు. మార్చి 21న గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ అంతా భారీ ఆస్టరాయిడ్‌ (2001 FO32) భూమికి అతిసమీపంలోకి రానున్నమాట వాస్తవమే అంటున్నారు. కానీ, అది భూమిని ఢీకొట్టడం అసాధ్యమని అంటున్నారు.

భూ కక్ష్యకు 3 కోట్ల మైళ్ల లోపు దగ్గరకు వచ్చే శకలాలను NEOలుగా పిలుస్తారు. ఇప్పటివరకు దాదాపు 25వేల ఎన్‌ఈఓలను సైంటిస్టులు గుర్తించారు. వీటిలో అధిక శాతం ఆస్టరాయిడ్స్‌ ఉన్నాయి. కొన్ని తోకచుక్కలుగా గుర్తించారు. ఈ 25వేల ఎన్‌ఈఓల్లో 2100 ఎన్‌ఈఓలను ప్రమాదకరమైనవిగా గుర్తించారు. భూకక్ష్యకు 46 లక్షల మైళ్ల దూరంలోకి వచ్చేవి, వ్యాసార్ధంలో 460 అడుగుల కన్నా పెద్దవైన శకలాలుగా వర్ణిస్తారు. ఇవన్నీ భూమిని తాకుతాయని కచ్చితంగా అంచనా వేయలేమంటున్నారు.

ఇప్పుడు రాబోయే గ్రహశకలం వ్యాసార్ధం దాదాపు 2,526–5,577 అడుగులు వరకు ఉంటుందని చెబుతున్నారు సైంటిస్టులు. మార్చి 21 ఉదయం 11గంటలకు ఈ శకలం భూమికి 13 లక్షల మైళ్ల దగ్గరకు వస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ సమయంలో ఆస్టరాయిడ్‌ గంటకు 76,980 మైళ్ల వేగంతో దూసుకొస్తుంది. భూమికి దగ్గరగా వచ్చిన అనంతరం తిరిగి తన దిశలోనే పయనిస్తుంది తప్పా.. భూ వాతావరణంలోకి దూసుకొచ్చే అవకాశమే లేదని సైంటిస్టులు చెబుతున్నారు. అందుకే ఎవరూ ఆందోళన చెందనక్కర్లేదు.. ఇప్పట్లో యుగాంతనేది లేనేలేదని మరోసారి స్పష్టమైపోతోంది..