Google Play Store : 8 లక్షల యాప్‌‌ ల‌ను నిషేధించిన గూగుల్, యాపిల్

భద్రతా  కారణాల దృష్ట్యా గూగుల్  ప్లేస్టోర్‌ నుంచి, యాపిల్‌ యాప్‌స్టోర్‌ నుంచి సుమారు 8 లక్షల యాప్‌లపై రెండు సంస్ధలు నిషేధం విధించాయి.

10TV Telugu News

Google Play Store  : భద్రతా  కారణాల దృష్ట్యా గూగుల్  ప్లేస్టోర్‌ , యాపిల్‌ యాప్‌స్టోర్‌ నుంచి సుమారు 8 లక్షల యాప్‌లపై రెండు సంస్ధలు నిషేధం విధించాయి. పిక్సలేట్‌ అనే సైబర్‌ సెక్యూరిటీ సంస్థ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ‘హెచ్‌1 2021 డీలిస్టెడ్‌ మొబైల్ యాప్స్‌ రిపోర్ట్‌’ పేరుతో పిక్సలేట్‌ ఒక నివేదికను తయారు చేసింది. ఇందులో మోసపూరితమైన, హానికరమైన 8,13,000 యాప్‌ల జాబితాను పొందుపరిచింది.

ఈ యాప్‌లు కెమెరా, జీపీఎస్‌ వంటి వాటి ద్వారా యూజర్ డేటాను సేకరిస్తున్నట్లు నివేదికలో వెల్లడించారు. వీటిలో 86 శాతం యాప్‌లు 12 ఏళ్లలోపు పిల్లలే లక్ష్యంగా సైబర్ దాడులకు పాల్పడుతున్నట్లు గుర్తించామని నివేదికలో పేర్కొంది. ఈ యాప్‌లను తొలగించటానికి ప్రధాన కారణం యాప్‌స్టోర్, ప్లేస్టోర్‌ భద్రతాపరమైన నిబంధనలను ఉల్లంఘించడమేనని పిక్సలేట్ తెలిపింది. నిషేధిత యాప్‌ల జాబితాను రూపొందించే ముందు ప్లేస్టోర్‌, యాప్‌స్టోర్‌లలో సుమారు 5 మిలియన్ యాప్‌లను విశ్లేషించినట్లు పిక్సలేట్ సంస్ధ తెలిపింది.

Also Read : Covaxin Kids : త్వరలోనే చిన్నారులకు కొవాగ్జిన్.. భారత్ బయోటెక్ గుడ్ న్యూస్

నివేదికలో పేర్కొన్న యాప్‌లకు ప్రపంచ వ్యాప్తంగా సుమారు 21 మిలియన్‌ యూజర్‌ రివ్యూలు ఉన్నట్లు పేర్కోంది. ప్రస్తుతం నిషేధిత యాప్‌లను ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది యూజర్స్ ఉపయోగిస్తున్నట్లు పిక్సలేట్ తెలిపింది. యాపిల్‌ యాప్‌స్టోర్‌, గూగుల్ ప్లేస్టోర్‌ నుంచి యాప్‌లను నిషేధించినప్పటికీ ఈ యాప్‌లు యూజర్ల ఫోన్లలో ఉండి ఉండొచ్చనే అభిప్రాయాన్ని పిక్సలేట్ వ్యక్తం చేసింది. యూజర్స్ వెంటనే వాటిని తమ ఫోన్లలోంచి డిలీట్ చేయాలని సూచించింది.

అయితే నిషేధిత యాప్ లు మీ ఫోన్‌లో ఉన్నాయో లేదో తెలుసుకోవాలంటే మీరు యాప్‌స్టోర్‌లోని వెళ్లి మీ ఫోన్‌లోని యాప్‌ల వివరాలు సరిచూసుకోవాలని టెక్ నిపుణులు సూచిస్తున్నారు. అంటే మీ ఫోన్‌లో ఉన్న యాప్‌ పేరు ప్లేస్టోర్‌, యాప్‌స్టోర్‌లో టైప్‌ చేయండి. సదరు యాప్‌ మీ ఫోన్ లోని యాప్ స్టోర్‌లలో ఉంటే అది నిషేధిత యాప్‌ కాదు. ఒకవేళ లేకపోతే వెంటనే ఆ యాప్‌ను డిలీట్ చేయమని చెపుతున్నారు.

×