ఈ లోన్‌ యాప్‌లు ప్లే స్టోర్‌లో ఇకపై ఉండవు.. గూగుల్ బ్యాన్ చేసేసింది!

ఈ లోన్‌ యాప్‌లు ప్లే స్టోర్‌లో ఇకపై ఉండవు.. గూగుల్ బ్యాన్ చేసేసింది!

Google Removes 10 Loan Apps from Play Store : ఆన్‌లైన్ రుణాల పేరిట ప్రజలను వేధింపులకు గురిచేస్తున్న యాప్‌లపై గూగుల్ కొరడా ఝుళిపించింది. ఆ యాప్‌లను ప్లే స్టోర్ నుంచి తొలగించింది. సదరు యాప్‌లు ఇండియా చట్టాలకు లోబడి లేవని.. అంతేగాక భారత నిబంధనను ఉల్లంఘిస్తూ వినియోగదారుల ప్రాణాలను బలిగొంటున్నాయని ఆరోపిస్తూ గూగుల్ ఈ చర్యలకు దిగింది. దాదాపు 10 భారతీయ లోన్ యాప్‌లపై గూగుల్ చర్యలు తీసుకుంది. వాటిని ప్లే స్టోర్ నుంచి కూడా డిలీట్ చేసింది. ఈ మేరకు గూగుల్ తన బ్లాగ్‌లో ఈ విషయాన్ని వెల్లడించింది.

వినియోగదారులు, ప్రభుత్వ సంస్థలు సమర్పించిన ఫిర్యాదుల ఆధారంగా తాము భారత్‌లో ఉన్న పలు రుణ యాప్‌లపై సమీక్ష జరిపామని గూగుల్ తెలిపింది. అవి వినియోగదారుల భద్రతా విధానాలను ఉల్లంఘించినట్లు తాము గుర్తించడంతో వెంటనే వాటిని ప్లే స్టోర్ నుంచి తొలగించామని.. మిగిలిన యాప్‌లు కూడా స్థానిక చట్టాలకు లోబడి పనిచేస్తున్నాయో లేదో తెలపాలని వాటి నిర్వాహకులకు నోటీసులు ఇచ్చామని వెల్లడించింది.

ప్లే స్టోర్ నుంచి టెన్ మినట్స్ లోన్, ఎక్స్ మనీ, ఎక్స్‌ట్రా ముద్రా, స్టక్కర్డ్ వంటి యాప్‌లతో పాటు మరో ఆరు యాప్‌లను తొలగించింది. అమాయకులను వేధిస్తూ వారి చావులకు కారణమవుతున్న చైనా యాప్ నిర్వాహకులను తెలంగాణ పోలీసులు అరెస్టు చేసిన మరుసటి రోజే గూగుల్ ఈ నిర్ణయం తీసుకుంది.