Social Media Platforms : సోషల్ మీడియా సంస్ధలు కొత్త ఐటీ నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలి

వినియోగదారుల సమాచార పరిరక్షణ, గోప్యత అంశంలో గూగుల్ ప్రతినిధులు ఇచ్చిన సమాధానం వింటే సమాచార రక్షణ అన్న పదం ఎంత హాస్యాస్పదమో అర్ధమవుతుంది.

Social Media Platforms : సోషల్ మీడియా సంస్ధలు కొత్త ఐటీ నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలి

Social Media Platforms

Social Media Platforms :  సోషల్ మీడియా సంస్దలు కొత్త ఐటీ నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలని ఐటీ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆదేశించింది. ఫేసు బుక్, గూగుల్ సంస్ధ ప్రతినిధులుతో మంగళవారం జరిగిన సమావేశంలో ఈ మేరకు ఆదేశించింది. వినియోగదారుల సమాచార పరిరక్షణ, గోప్యత అంశంలో గూగుల్ ప్రతినిధులు ఇచ్చిన సమాధానం వింటే సమాచార రక్షణ అన్న పదం ఎంత హాస్యాస్పదమో అర్ధమవుతుంది.

ఏ సమాచారం కావాలన్నా క్షణాల్లో అందించే గూగుల్‌మీద ఆధారపడని వారు ఆధునిక ప్రపంచంలో లేరనడం అతిశయోక్తి కాదు. ఏదన్నా సందేహం వచ్చినా..ఏమన్నా సమాచారం కావాల్సి ఉన్నా గూగుల్‌ ఓపెన్ చేస్తాం. గూగుల్‌ లేనిదే…రోజు గడవదు చాలా మందికి. ఇక గూగుల్‌ అందించే రకరకాల ఫీచర్లతో….అందరం సెర్చ్ ఇంజన్‌ డిపెండబుల్స్ అయిపోయాం. వాటిలో ప్రధానమైనది..గూగుల్ అసిస్టెంట్ ఫీచర్.

ఒక్కో అక్షరం టైప్ చేసే బదులు ఫోన్, ల్యాప్ ట్యాప్, డెస్క్ టాప్ వంటివాటిలో స్పీకర్ ఆన్ చేసి మనకు కావాల్సింది అడుగుతాం…ఓకె..గూగుల్ అంటూ సంభాషిస్తాం. ఇదే గూగుల్ యూజర్ల కొంపముంచుతోంది. ఈ ఫీచర్‌తో గూగుల్ మనకు మెరుగైన సేవలందిస్తున్నట్టు కనపడుతూనే..మన సమాచారం మొత్తాన్ని నిక్షిప్తం చేసుకుంటోంది. అసిస్టెంట్‌లో మనం మాట్లాడే మాటలు, సంభాషణ మొత్తం గూగుల్ రికార్డుల్లో చేరిపోతోంది.

ఒక్కమాటలో చెప్పాలంటే…సమస్త సమాచారం అందించే గూగుల్…వ్యక్తిగతం నుంచి, వృత్తిగతం దాకా..మన సమాచారం మొత్తాన్ని వింటోంది.. దాచుకుంటోంది. ఇది సోషల్ మీడియా సంస్థలపై కొరడా ఝుళిపిస్తున్న కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ఆరోపణ కాదు. స్వయంగా గూగుల్ అంగీకరించిన నిజం. ఆ సంస్థ ప్రతినిధులు చెప్పిన మాటలు వింటే….సమాచార రక్షణ అన్న పదం ఎంత హాస్యాస్పదమో అర్ధమవుతుంది.

గూగుల్ అసిస్టెంట్‌ను ఉపయోగించి యూజర్లు మాట్లాడే మాటలను తమ ఉద్యోగులు వింటారని….ఆ సంస్థ అంగీకరించింది. యూజర్ల హక్కుల రక్షణపై వివరణ ఇచ్చేందుకు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ముందు హాజరైన గూగుల్ ప్రతినిధులు కీలక విషయాలు వెల్లడించారు. గూగుల్ అసిస్టెంట్ ద్వారా యూజర్లు జరిపే ప్రైవేట్ సంభాషణ సహా అన్ని రకాల మాటలను కంపెనీ ఉద్యోగులు వినే అవకాశముందని తెలిపారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా గూగుల్ అసిస్టెంట్ సౌకర్యాన్ని అందిస్తోంది.

సున్నితమైన సమాచారాన్ని తమ ఉద్యోగులు వినరని, సాధారణ సంభాషణ మాత్రమే వింటారని, అదే రికార్డవుతుందని చెప్పారు. అయితే ఏ సంభాషణ..సున్నితమైనది…ఏది కాదు అన్నదానిపై ఎలాంటి స్పష్టత లేదని అంగీకరించారు. గూగుల్ తీరుపై ప్యానల్ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇది యూజర్ల ప్రైవసీకి భంగం కలిగించడమేనని మండిపడ్డారు.

గూగుల్‌పై అనేక ప్రశ్నలు సంధించారు ప్యానల్ సభ్యులు. ఒక ప్రశ్న అడగగానే…దానికి సంబంధించిన సమాచారం మాత్రమే కాకుండా..అవసరంలేని అనేక విషయాలు..మన ఎకౌంట్లను ముంచెత్తడాన్ని ప్రశ్నించారు. హోటళ్ల గురించి యూజర్లు గూగుల్ అసిస్టెంట్‌ను ఓ ప్రశ్న వేస్తే..వారి అకౌంట్లకు ఇతర ప్లాట్ ఫాంల నుంచి డీల్స్, ఆఫర్ల గురించి అవసరం లేని సమాచారం అంతా ఎందుకొస్తుందని ప్యానల్ సభ్యులు నిలదీశారు.

సంభాషణలు వినడంతో పాటు…యూజర్లు అంగీకరిస్తే…వ్యక్తిగత సమాచారాన్ని గూగుల్ ఇతరులకు షేర్ చేస్తుందని, ఇది యూజర్ల ప్రైవసీకి భంగం కలిగించే తీవ్రమైన చర్యని ప్యానల్ సభ్యులన్నారు. యూజర్లు మాన్యువల్‌గా డిలీట్ చేసేంతవరకు గూగుల్‌ స్టోర్‌డ్‌ డేటాను తొలగించడం లేదని, ఈ అంశాన్ని కూడా తీవ్రంగా పరిగణిస్తున్నామని ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ సీనియర్ అధికారి చెప్పారు.

స్పీచ్ టెక్నాలజీని మెరుగుపర్చేందుకు..గూగుల్ అన్ని భాషలను అర్ధం చేసుకునేలా సహకరించేందుకు 2019లో భాషా నిపుణులు అంతర్జాతీయ స్థాయిలో గూగుల్ రికార్డింగులన్నింటినీ విన్నారని కంపెనీ ముఖ్యాధికారి ఒకరు చెప్పారు. గూగుల్ వివరణ విన్న ప్యానల్ సభ్యులు..ఆ కంపెనీ తీరుపై అభ్యంతరాలు వ్యక్తంచేశారు.

సోషల్ మీడియాను ఉపయోగించే మహిళల భద్రతపై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ తీవ్ర ఆందోళన వ్యక్తంచేశారు. శశిథరూర్ నేతృత్వంలోని స్టాండింగ్ కమిటీ దీనిపై ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది. సమాచార భద్రత, ప్రైవసీ పాలసీలో ప్రస్తుతం ఉన్న లోపాలన్నింటినీ సరిచేయాల్సిన అవసరం ఉందని సోషల్ మీడియా ప్రతినిధులకు ప్యానల్ తేల్చిచెప్పింది. భారతీయ యూజర్ల సమాచార పరిరక్షణకు, భద్రతకు సరైన చర్యలు తీసుకోవాలని సూచించింది.