విక్రమ్ పోతే పోనీ : ఆర్బిటర్ అదుర్స్.. చంద్రునిపై OHRC ఫొటోలు తీస్తోంది!

ఇస్రో పంపిన ఆర్బిటర్ లోని ఆర్బిటర్ హై రెజుల్యుషన్ కెమెరా (OHRC) టూల్.. అద్భుతమైన ఫొటోలను తీసి భూకేంద్రానికి పంపుతోంది.

  • Published By: sreehari ,Published On : October 5, 2019 / 08:27 AM IST
విక్రమ్ పోతే పోనీ : ఆర్బిటర్ అదుర్స్.. చంద్రునిపై OHRC ఫొటోలు తీస్తోంది!

ఇస్రో పంపిన ఆర్బిటర్ లోని ఆర్బిటర్ హై రెజుల్యుషన్ కెమెరా (OHRC) టూల్.. అద్భుతమైన ఫొటోలను తీసి భూకేంద్రానికి పంపుతోంది.

ఇస్రో చేపట్టిన చంద్రయాన్-2 ప్రయోగం చివరి క్షణాల్లో విఫలమైంది. చంద్రునిపై ల్యాండ్ అయ్యే సమయంలో విక్రమ్ ల్యాండర్ అదృశ్యమై పోయింది. కానీ, ల్యాండర్ తో పాటు చంద్రుని దక్షిణ భాగ ఉపరితలం దగ్గరగా వెళ్లిన ఆర్బిటర్ మాత్రం అద్భుతంగా పనిచేస్తోంది. చంద్రునిపై దాగి ఉన్న రహస్యాలను ప్రపంచానికి తెలియజేసేందుకు ఇస్రో చేసిన సాహసోపేత ప్రయత్నం నిరూపయోగం అయిందని భావిస్తున్న తరుణంలో ఆర్బిటల్ కొత్త ఆశలు రేపుతోంది. విక్రమ్ ల్యాండర్ చేయలేని పనులను ఆర్బిటర్ చక్కగా చేసి చూపిస్తోంది. ఇస్రో శాస్త్రవేత్తలకు అవసరమైన ఫొటోలను చంద్రునిపై తీసి పంపుతోంది. ఇస్రో పంపిన ఆర్బిటర్ లోని ఆర్బిటర్ హై రెజుల్యుషన్ కెమెరా (OHRC) టూల్.. అద్భుతమైన ఫొటోలను తీసి భూకేంద్రానికి పంపుతోంది.

ఇస్రో ఎంపిక చేసిన చంద్రుని టాపో గ్రాఫిక్ ప్రాంతాన్ని తన శక్తివంతమైన కెమెరా టూల్ తో HD ఫొటోలను క్యాప్చర్ చేస్తోంది. సెప్టెంబర్ 5 నుంచి చంద్రునికి 100 కిలోమీటర్ల ఎత్తులో నుంచి ఆర్బిటర్ ఈ ఫొటోలను తీసి పంపుతోంది. ఆ ఫొటోల్లో బోగస్లావాస్కై ఈ క్రేటర్ భాగాన్ని కవర్ చేస్తూ క్యాప్చర్ చేసింది. ఆ క్రేటర్.. వ్యాసం.. 14 కిలోమీటర్ల నుంచి 3 కిలోమీటర్ల లోతుగా కనిపిస్తోంది. చంద్రుని దక్షిణ ధ్రువ ప్రాంతంలో ఉన్నట్టు కనిపిస్తోంది. సెప్టెంబర్ 7న చంద్రునిపై ల్యాండ్ అయ్యే క్రమంలో విక్రమ్ ల్యాండర్ అదృశ్యమైన సంగతి తెలిసిందే. విక్రమ్ తో కమ్యూనికేషన్ సిస్టమ్ సిగ్నల్స్ కట్ అయ్యాయి. విక్రమ్ నిర్దేశించినట్టుగా సేఫ్ గా ల్యాండ్ అయి ఉన్నట్టు అయితే.. అందులోని ఆరు చక్రాల ల్యూనర్ రోవర్ ప్రగ్యాణ్ బయటకు వచ్చేది. కానీ, అలా జరగలేదు. 

విక్రమ్ ల్యాండర్ క్రాష్ అయినట్టుగా ఇస్రో భావిస్తోంది. నాసా రంగంలో దిగి తమ ఆర్బిటర్ సాయంతో ఫొటోలు తీసినా విక్రమ్ ఆచూకీ దొరకలేదు. చివరికి నాసా కూడా చేతులేత్తేసింది. చంద్రయాన్ -2 ప్రయోగంలో భాగంగా విక్రమ్ ల్యాండర్ తోపాటు వెళ్లిన ఆర్బిటర్ చంద్రుని చుట్టూ పరిభ్రమిస్తోంది. ఇస్రో శాస్త్రవేత్తలకు అవసరమైన ప్రయోగాలకు స్పందిస్తూ ఆర్బిటర్ అద్భుతంగా పనిచేస్తోంది. చంద్రుని సమీపంలోని కొన్ని అణువులను గుర్తించి భూకేంద్రానికి OHRC కెమెరా టూల్ ద్వారా ఫొటోలు తీసి పంపినట్టు ఇస్రో తెలిపింది.