Safety Tips : నిప్పులు కురిచే ఎండాకాలం.. వాహనాలతో భద్రం.. ఈ జాగ్రత్తలు పాటిస్తే పేలవు, కాలవు

సమ్మర్ వచ్చేసింది. ఎండలు మండిపోతున్నాయి. సూర్యుడు నిప్పులు కురిపిస్తున్నాడు. ఏ ప్రాంతం చూసినా నిప్పుల కొలిమిని తలపిస్తోంది. ఈ సమ్మర్ మనుషులకే కాదు వాహనాలకూ గడ్డుకాలమే. వాహనదారులు తమ బండ్లతో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేదంటే ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. హాట్ సమ్మర్ లో వాహనాలను జాగ్రత్తగా ఎలా ఉంచుకోవాలి? కార్లు లేదా బైక్ లు కాలిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి?

Safety Tips : నిప్పులు కురిచే ఎండాకాలం.. వాహనాలతో భద్రం.. ఈ జాగ్రత్తలు పాటిస్తే పేలవు, కాలవు

Safety Tips

Vehicle Safety Tips In Hot Summer : సమ్మర్ వచ్చేసింది. ఎండలు మండిపోతున్నాయి. సూర్యుడు నిప్పులు కురిపిస్తున్నాడు. ఏ ప్రాంతం చూసినా నిప్పుల కొలిమిని తలపిస్తోంది. రికార్డు స్థాయిలో(40కి పైగా) ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సుర్రుమనే ఎండతో, మాడు పగిలేలా కాస్తున్న ఎండతో జనాలు విలవిలలాడిపోతున్నారు. మధ్యాహ్నం సమయంలో ఇంట్లో నుంచి బయటకు వచ్చే సాహసం కూడా చెయ్యడం లేదంటే ఎండల తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.

కాగా, ఈ సమ్మర్ జనాలకు మరో కష్టం కూడా తెచ్చిపెట్టింది. ఈ సమ్మర్ మనుషులకే కాదు వాహనాలకూ గడ్డుకాలమే. ఈ ఎండా కాలంలో వాహనాలతో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే.. ఎండ వేడికి రోడ్లే కాదు బండ్లు కూడా భగ్గుమంటున్నాయి. నడిరోడ్డు మీదే కళ్ల ముందే కాలి బూడిదవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో గత నెల రోజుల్లోనే 10 వాహనాలు కాలిపోయాయి అంటే ఎండల తీవ్రత ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలో వాహనదారులు తమ బండ్లతో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేదంటే ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది.

మరి హాట్ సమ్మర్ లో వాహనాలను జాగ్రత్తగా ఎలా ఉంచుకోవాలి? కార్లు లేదా బైక్ లు కాలిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి? దీనికి వాహన రంగ నిపుణులు పలు విలువైన సూచనలు చేశారు. అవి పాటిస్తే మీ వాహనాలు ఎండలకు పేలిపోవు, కాలిపోవు. సేఫ్ గా ఉంటాయి. మీ ప్రాణాలకు ప్రమాదం కూడా తప్పుతుంది.

ఇలా చేస్తే మీ వాహనాలు సేఫ్:
* బండ్లు కాలిపోయే విపత్కర పరిస్థితి రాకుండా ఉండాలంటే వాహనాన్ని ఎప్పటికప్పుడు సర్వీసింగ్‌ చేయించటమే కాదు ఎప్పటికప్పుడు పరీక్షించుకోవటం అవసరం.
* ఎండాకాలం వస్తుందంటే వాహనాలు.. ప్రత్యేకించి కార్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఎప్పటికప్పుడు సర్వీసింగ్‌ చేయించటంతోపాటు ఇంజిన్‌ను చల్లబరిచే అన్ని రకాల ఉపశమనాలు పూర్తిస్థాయిలో ఉన్నాయో లేదో చూసుకోవాలి.
* టైర్లలో గాలి తగినంత ఉందో లేదో చూసుకోవాలి.
* ఇంజిన్‌ ఆయిల్‌, కూలెంట్లు తగ్గిపోయినా వాహనం దగ్ధమయ్యే అవకాశం ఉంటుంది. గాలి తక్కువగా ఉన్నా, టైర్లు అరిగిపోయినా ఎండవేడిమికి వాహన వేగం తోడై టైర్లు పేలిపోయే అవకాశాలు ఉంటాయి.

పాటించాల్సిన జాగ్రత్తలు:
* కారు ప్రయాణించేటప్పుడు ఇంజిన్‌లో 170 డిగ్రీల సెల్సియస్‌ వరకు ఉష్ణోగ్రత ఏర్పడుతుంది.
* బయట 40 డిగ్రీలకు పైనే వేడి ఉంటుంది. ఈ పరిస్థితుల్లో ఇంజిన్‌లో ఉండే లిక్విడ్‌ కూలెంట్‌, ఇంజిన్‌ ఆయిల్‌ త్వరగా ఆవిరి అయిపోతాయి.
* ముందు అద్దాన్ని శుభ్రం చేసే వైపర్‌ ఫ్లూయిడ్‌ను, ఏసీలో ఉండే క్లోరో ఫ్లోరో కార్బన్‌ స్థాయిలను తరచుగా తనిఖీ చేసుకోవాలి.
* ఆయా లిక్విడ్లు ఆవిరైతే ఇంజిన్‌ మరింతగా వేడెక్కుతుంది.
* ఇంజిన్‌లో ఉండే వైరింగ్‌, ప్లాస్టిక్‌ ఉపకరణాలు వేడికి కరిగిపోయే ప్రమాదం ఉంది.
* కొన్ని సందర్భాల్లో ఇంజిన్ లో ఆయిల్‌ లీక్‌ కావటం కూడా ప్రమాదాలకు కారణమవుతుంది.
* సైలెన్సర్‌ నుంచి వేడిమి బయటకు వస్తుంది.
* ఎక్కడైనా ఆయిల్‌ లీకైతే సైలెన్సర్‌ నుంచి కారుతుంటుంది. అది కూడా కొన్ని సందర్భాల్లో ప్రమాదాలకు కారణమవుతుంది.

* ప్రతి 10వేల కిలోమీటర్లకు క్రమం తప్పకుండా వాహనాన్ని సర్వీసింగ్‌ చేయించాలి.
* వేసవిలో వాహనాలను సాధ్యమైనంత వరకు ఎండలో నిలపకుండా ఉంటే మంచిది.
* వేసవి ప్రారంభానికి ముందే సర్వీసింగ్‌ చేయించుకోవటం మంచిది.
* సర్వీసింగ్‌ సమయంలో అన్ని రకాల లిక్విడ్ల స్థాయిలను చెక్‌ చేశారో లేదో తెలుసుకోవాలి.
* కూలెంట్‌, ఇంజిన్‌ ఆయిల్‌ను చెక్‌ చేసుకునేందుకు ఆయా ట్యాంకుల్లో సదుపాయం (డిప్‌ స్టిక్‌) ఉంటుంది. మనం కూడా చెక్‌ చేసుకోవచ్చు.
* మైలేజీ తగ్గుతున్నట్లు గుర్తిస్తే లీకేజీ ఉన్నట్లు లెక్క. వెంటనే సర్వీసింగ్‌ చేయించుకోవాలి.
* టైర్లల్లో గాలి తగినంత ఉండేలా చూసుకోవాలి. ఇంధనం నింపుకొనే సమయంలో టైర్లలో గాలి చెక్‌ చేయించటం అలవాటు చేసుకోవాలి.
* లైట్లు, హారన్‌, స్టీరియోల వంటివి మార్చకుండా ఉంటే మంచిది.