Google: మీ పిల్లల ఫోటోలు తొలగించమని గూగుల్‌ను అడగొచ్చు

టెక్ దిగ్గజం గూగుల్ రాబోయే కొద్దిరోజుల్లో కొత్త పాలసీని ప్రవేశపెట్టేందుకు ప్లాన్ చేస్తుంది

Google: మీ పిల్లల ఫోటోలు తొలగించమని గూగుల్‌ను అడగొచ్చు

Google

Google: టెక్ దిగ్గజం గూగుల్ రాబోయే కొద్దిరోజుల్లో కొత్త పాలసీని ప్రవేశపెట్టేందుకు ప్లాన్ చేస్తుంది, 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారు లేదా వారి తల్లిదండ్రులు గూగుల్ ఇమేజ్ సెర్చ్ ఫలితాల నుండి తమ ఫోటోలను తీసివేయమని అభ్యర్థించేందుకు అవకాశం కల్పిస్తుంది. 13నుంచి 18ఏళ్లలోపు వయస్సు ఉన్న పిల్లల కోసం ఈ కొత్త పాలసీని తీసుకొచ్చింది గూగుల్.

18 ఏళ్లలోపు యూజర్లుగానీ, వాళ్ల తల్లిదండ్రులు గానీ, విజ్ఞప్తి చేస్తే గూగుల్‌ ఇమేజెస్‌లో కనిపించే ఫొటోల్ని డిలీట్‌ చేసే వీలును గూగుల్‌ కల్పిస్తుంది. ఇలాంటి ఆప్షన్‌ పెద్దల కోసం ఇదివరకే ఉండగా.. అశ్లీల కంటెంట్‌, వేధింపులతో ఎక్కువగా బాధితులు అవుతోంది పిల్లలే కాబట్టి, ఈమేరకు కీలక నిర్ణయం తీసుకుంది గూగుల్. ఆ ఏజ్‌ గ్రూప్‌ యూజర్లు, పేరెంట్స్‌, సంరక్షకులు ఎవరైనా సరే సంబంధిత ఫోటోలకు సంబంధించి కారణాలను గూగుల్ దృష్టికి తీసుకుని వచ్చి ఫొటోలను తొలగించొచ్చు. ఈ నెలాఖరులో ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకుని రాబోతోంది గూగుల్‌. గూగుల్ ప్లే స్టోర్‌లో కూడా పూర్తి పేరెంట్‌ గైడ్‌లైన్స్‌ వివరిస్తూ వివరాలను పెట్టింది గూగుల్.

మా విధానాల్లో భాగంగా 13 ఏళ్ల వయస్సు మించిన పిల్లలను Google అకౌంట్ సృష్టించడానికి అనుమతి ఇచ్చినప్పటికీ, వారు, టీనేజ్‌లో ఉన్న కారణంగా కుటుంబాల కోసం ప్రత్యేకంగా ఉత్పత్తి అనుభవాలను రూపొందించడానికి సిద్ధపడ్డామని Google ఒక బ్లాగ్ పోస్ట్‌లో పేర్కొంది. ఇక 13 ఏళ్లలోపు పిల్లలకు గూగుల్‌ అకౌంట్‌ క్రియేట్‌ చేసుకునే అవకాశమే లేదని చెప్పింది. గూగుల్‌ తన ఇమేజ్‌ సెర్చ్‌ ఇంజిన్‌ నుంచి ఫొటోను తొలగించేందుకు మాత్రం కట్టుబడి ఉన్నట్లు ప్రకటించింది.