భయపడొద్దు, 5కోట్ల డోలో సహా 54రకాల మందులు సిద్ధం చేసిన ప్రభుత్వం

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

కరోనా కట్టడికి తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మరిన్ని చర్యలు చేపట్టింది. పెద్ద ఎత్తున మందులు సిద్ధం చేసింది. 5కోట్ల డోలో మాత్రలను రెడీ చేసింది. వాటిని రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రులకు పంపింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్‌సీలు), సామాజిక ఆరోగ్య కేంద్రాలు (సీహెచ్‌సీలు), ఏరియా ఆస్పత్రులు, జిల్లా ఆసుపత్రులు, బస్తీ ఆసుపత్రులు, బోధనాస్పత్రులు సహా అన్ని రకాల ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఆసుపత్రులకు 5 కోట్ల డోలో మాత్రలను సరఫరా చేసింది. కరోనా వైరస్‌ వచ్చిన వారికి జ్వరం ఉంటే తప్పనిసరిగా డోలో లేదా పారాసిటమాల్‌ వంటి మాత్రలు ఇస్తారు. అలాగే సీజనల్‌ జ్వరాలను ఎదుర్కొనేందుకు వాటిని పంపించారు.

డోలో సహా 54 రకాల ఔషధాలు సరఫరా:
డోలో మాత్రలు సహా మొత్తం 54 రకాల ఔషధాలను ప్రభుత్వ ఆసుపత్రులకు సరఫరా చేశారు. వాటిలో కరోనా వచ్చిన వారికి ఉపయోగించే అజిత్రోమైసిన్‌ వంటి యాంటీబయోటిక్స్, మల్టీవిటమిన్, సీ-విటమిన్, డీ-విటమిన్‌ మాత్రలు ఉన్నాయి. అలాగే జలుబు, దగ్గు, ఇతరత్రా లక్షణాలున్న వారికి ఉపయోగపడే మందులను కూడా పంపించారు. బీపీ, షుగర్, శ్వాసకోశ సంబంధ వ్యాధులు సహా ఇతర దీర్ఘకాలిక రోగాలకు అవసరమైన మందులను కూడా ప్రభుత్వం సరఫరా చేసింది. వాటితోపాటు అత్యవసర మందులను కూడా పంపారు.

అత్యవసర మందుల కొరత:
కరోనా తీవ్రంగా ఉన్న వారికి ప్రస్తుతం ఉపయోగిస్తున్న రెమిడిసివిర్, ఫ్యాబీ ఫ్లూ వంటి మందులను కూడా జిల్లాలకు పంపారు. అయితే దేశవ్యాప్తంగా ఈ మందులకు డిమాండ్‌ ఉండటంతో కొరత ఏర్పడిందని, తయారీ కూడా తక్కువగా ఉందని, అందువల్ల వాటిని అవ సరమైన మేరకు జిల్లాలకు ఇంకా సరఫరా చేయలేకపోయినట్లు అధికారులు తెలిపారు. త్వరలో మరిన్ని ఆర్డర్లు తెప్పించి సరఫరా చేస్తామన్నారు. ఈ మందులు వాడితే రోగులు వేగంగా కోలుకుంటుండటంతో పెద్ద ఎత్తున కొనుగోలు చేయాలని వైద్య, ఆరోగ్యశాఖ నిర్ణయించింది. రాబోయే నాలుగైదు వారాలు సంక్లిష్టమైన రోజులని, కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని ప్రభుత్వం స్పష్టం చేసిన నేపథ్యంలో ఈ మందులు మరిన్ని తెప్పించాల్సిన అవసరముందని వైద్య నిపుణులు అంటున్నారు.

ఈ కరోనా మందు వాస్తవ ధర రూ.30వేలు, బ్లాక్ మార్కెట్ లో లక్షన్నర:
ఈ రెండు రకాలే కాకుండా మరో కీలకమైన తొసిలిజుమాబ్‌(Tocilizumab) సూది మందును కూడా సరఫరా చేయాల్సి ఉంటుందని అంటున్నారు. ఇది ప్రాణాపాయ పరిస్థితుల్లో వెంటిలేటర్‌పై చికిత్సపొందే కొవిడ్‌ బాధితులను కాపాడుతుందన్న భావన వైద్య వర్గాల్లో ఉంది. అయితే కొందరు దళారులు దీన్ని బ్లాక్‌లో విక్రయిస్తున్నారు. వాస్తవ ధర రూ. 30 వేలని, కానీ మార్కెట్లో దాన్ని రూ. లక్షన్నరకు కూడా విక్రయిస్తున్నారని బాధితులు అంటున్నా రు. ఇలాంటి ముఖ్యమైన మందుల ధర అధికంగా ఉండటంతో వైద్య, ఆరోగ్యశాఖ మరింత బడ్జెట్‌ ఇవ్వాల్సి ఉంటుందని ఒక అధికారి వ్యాఖ్యానించారు. అలాగే జిల్లాలకు ఆక్సిజన్‌ సిలిండర్ల సరఫరా కూడా అవసరమైన మేరకు పంపించాలని వైద్యులు కోరుతున్నారు.

READ  KCR చివరి సభ : వికారాబాద్‌‌ సభకు భారీ ఏర్పాట్లు

నెలకు లక్ష మందికి సరిపోయేలా మందులు సరఫరా:
జ్వరం వస్తే వెంటనే పరిస్థితిని బట్టి అది వైరస్‌ ఇన్‌ఫెక్షన్‌గా రూపాంతరం చెందకుండా తక్షణమే యాంటిబయోటిక్స్‌ సహా దానికి సంబంధించిన కోర్సును ప్రారంభిస్తారు. కరోనా పరీక్ష, దాని నిర్ధారణకు ముందే వైద్య చికిత్స ప్రారంభిస్తారు. ఉదాహరణకు ఎవరికైనా 100 డిగ్రీలు, ఆపైన జ్వరం ఉంటే తక్షణమే అజిత్రోమైసిన్‌ యాంటిబయోటిక్‌ సహా డోలో, మల్టీ విటమిన్, సీ విటమిన్‌ మాత్రలను ఇస్తారు. వాటిని ఐదు రోజుల కోర్సుగా వాడతారు. పరిస్థితిని బట్టి కోర్సు పరిధి పెరిగే అవకాశముంది. రాష్ట్రంలో ప్రతి నెలా లక్ష మందికి సరిపోయేలా, ఐదు నెలల్లో ఐదు లక్షల మందికి అవసరమైన 54 రకాల మందులను సరఫరా చేశామని తెలంగాణ వైద్య సేవలు మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ) ఎండీ చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. మున్ముందు అవసరాన్ని బట్టి ఇంకా మందుల సరఫరా ఉంటుందన్నారు.

Related Posts