తెలంగాణ నేతలకు కరోనా.. జాగ్రత్త చర్యలు సరేనా.. ఇళ్లలోనే ప్రజాప్రతినిధులు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

కరోనా వైరస్‌ రోజురోజుకు విజృంభిస్తోంది. రాజు పేదా తేడా లేదు.. సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకూ అందరినీ కరోనా భయంతో వణికిపోతున్నారు. మొన్నటి వరకూ వైరస్‌ వారియర్స్‌ అయిన డాక్టర్లు, పోలీసులు, మీడియా, జీహెచ్‌ఎంసీపై అటాక్ చేసిన ఈ కోవిడ్ .. ఇపుడు రాజకీయ నాయకుల్లోనూ బెదురుపుట్టిస్తోంది. తెలంగాణలో సోమవారం ఒక్కరోజే అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌, హోం మంత్రికి కరోనా వైరస్‌ సోకింది. ముందుజాగ్రత్తగా కుటుంబ సభ్యులంతా హోం క్వారంటైన్‌లో ఉంచారు.

తెలంగాణలో కరోనా మహమ్మారి కలవరం సృష్టిస్తోంది. ప్రజాప్రతినిధులు ఒక్కొక్కరు కరోనా బారినపడుతున్నారు. దీంతో తెలంగాణలో కరోనా బారినపడుతున్న ఖద్దరు చొక్కాల సంఖ్య పెరుగుతోంది. తెలంగాణ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌ పద్మారావుకు కరోనా వైరస్‌ సోకింది. ప్రస్తుతం ఆయన సెల్ఫ్‌ ఐసోలేషన్‌లో ఉన్నారు. పద్మారావుతోపాటు ఆయన ఇద్దరు కుమారులకూ వైరస్‌ సోకింది. ఆయన కుటుంబ సభ్యులందరికీ కరోనా పరీక్షలు నిర్వహించారు. అనంతరం వారంతా హోంక్వారంటైన్‌లో ఉన్నారు. పద్మారావును ఇటీవల కలిసిన వారి గురించి అధికారులు ఆరా తీస్తున్నారు.

హోంమంత్రి మహమూద్ అలీ సైతం కరోనా బారిపడ్డారు. ఆయన కుటుంబ సభ్యులకు కరోనా పాజిటివ్ వచ్చింది. మహమూద్ అలీ కుమారుడు, అల్లుడు, మనవడికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. హోంమంత్రి మహమూద్ ప్రస్తుతం జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రసుత్తం కరోనా బారిన పడిన హోంమంత్రి కుమారుడు, అల్లుడు హోమ్‌ క్వారంటైన్‌లో ఉన్నారు. వారం రోజుల క్రితం మహమూద్ అలీ గన్‌మెన్స్ ఆరుగురికి కరోనా పాజిటివ్ వచ్చింది.

రాష్ట్ర హోంమంత్రికే కరోనా వైరస్ సోకడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. మహమూద్ అలీని కలిసిన వారిని గుర్తించి వారందరినీ హోం క్వారంటైన్‌కు తరలిస్తున్నారు. జులై 19న పంజాగుట్ట స్టీల్‌ బ్రిడ్జ్‌ను హోంమంత్రి మహమూద్ అలీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, గ్రేటర్ మేయర్ బొంతు రామ్మోహన్‌తో పాటు పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అలాగే 25న గోషామహల్ స్టేడియంలో నిర్వహించిన హరితహారం కార్యక్రమంలో హోంమంత్రి పాల్గొన్నారు.

దీంతో హోంమంత్రి కార్యక్రమాలకు హాజరైన వారందరికీ కూడా కరోనా పరీక్షలు జరిపేందుకు అధికార యంత్రాంగం సిద్ధమవుతోంది. టీఆర్‌ఎస్‌కు చెందిన పలువురు ఎమ్మెల్యేలు ఇప్పటికే కరోనా సోకడంతో చికిత్స తీసుకుంటున్నారు. ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్‌, గణేష్‌ గుప్తాకు గతంలోనే కరోనా పాజిటివ్‌ వచ్చింది. దీంతో వీరంతా హైదరాబాద్‌లోని కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో చికిత్స తీసుకున్నారు.

ఇక కాంగ్రెస్‌ నేతలు వి. హనుమంతరావు, గూడూరు నారాయణరెడ్డి, బీజేపీ మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డికి సైతం కరోనా సోకింది. ఇలా ఒక్కొక్కరు కరోనా బారినపడుతుండడంతో…. చాలా మంది రాజకీయ నేతలు… ప్రజా ప్రతినిధులు ఇళ్లకే పరిమితం అవుతున్నారు.