Home » బ్యాక్ టు స్కూల్ : కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె
Published
1 year agoon
By
madhuతెలంగాణ రాష్ట్రంలో ఓ వైపు ఆర్టీసీ సమ్మె..మరోవైపు 2019, అక్టోబర్ 21వ తేదీ సోమవారం నుంచి స్కూళ్లు ప్రారంభం అవుతుండడంతో ఎలాంటి సమస్యలు వస్తాయా అని పేరెంట్స్ ఆందోళన చెందుతున్నారు. బస్సులు లేకపోవడంతో స్కూళ్లకు, కాలేజీలకు తమ పిల్లలు ఎలా వెళ్లి వస్తారా అనే టెన్షన్ వారిలో నెలకొంది. ఆటోలు, క్యాబ్‌లలో వెళ్లాలంటే డబ్బులు ఖర్చు చేయాల్సి వస్తోంది. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో అధికంగా సమస్యలు ఎదుర్కొంటున్నారు. ప్రధాన రహదారికి చేరుకోవడానికి ఇబ్బందులు పడుతున్నారు. ఈ తరుణంలో స్కూళ్లు, కాలేజీలు తిరిగి తెరుచుకోనున్నాయి.
దసరా సెలవులు అక్టోబర్ 13వ తేదీతో ముగియనున్నాయి. అక్టోబర్ 14 నుంచే ప్రారంభం కావాల్సి ఉంది. కానీ సమ్మె కారణంగా..బస్సులు సకాలంలో లేకపోవడంతో స్టూడెంట్స్ ఇబ్బందులు పడుతారన్న ఉద్దేశ్యంతో సెలవులను పొడిగించారు. అక్టోబర్ 20వ తేదీ ఆదివారంతో సెలవులు ముగిశాయి. సోమవారం నుంచి యదావిధిగా స్కూళ్లు, కాలేజీలు తిరిగి ప్రారంభం కానున్నాయి.
ఎప్పుడూ లేని విధంగా 16 రోజులు సెలవులు వచ్చాయి. ఆర్టీసీ కార్మికుల సమ్మె..పండుగకు హైదరాబాద్ తిరుగు పయనం అయ్యే వారికి బస్సుల కొరత ఉండడంతో సెలవులు పొడిగించాలని తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది.
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, తదితర డిమాండ్స్‌తో అక్టోబర్ 05వ తేదీ నుంచి సమ్మెలోకి వెళ్లారు ఆర్టీసీ కార్మికులు. దసరా పండుగ నేపథ్యంలో సమ్మెకు వెళ్లడంపై సీఎం కేసీఆర్ తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. చర్చలు జరిపే ప్రసక్తే లేదని కుండబద్ధలు కొట్టారు. సమ్మెలో పాల్గొంటున్న వారు డిస్మిస్ అయిపోయినట్టేనని ప్రకటించింది. ప్రతిపక్షాలు కార్మికుల సమ్మెకు మద్దతు ప్రకటించాయి. డిమాండ్లు సాధించే వరకు సమ్మె విరమించే ప్రస్తక్తే లేదని తేల్చిచెప్పాయి. అటు ప్రభుత్వం..ఇటు కార్మికులు మెట్టు దిగకపోతుండడంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసినా..అవి సరిపోవడం లేదు. స్కూళ్ల పున:ప్రారంభం కావడంతో ఎలాంటి సమస్యలు ఉత్పన్నమౌతాయో చూడాలి.
Read More : వెదర్ అప్ డేట్ : తెలంగాణలో 4 రోజులూ భారీ వర్షాలు