telangana supplied rice to 5 states in yasangi

లాక్‌డౌన్‌లో 5 రాష్ట్రాలకు అన్నం పెట్టిన తెలంగాణ

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

దేశచరిత్రలో ఇప్పటివరకు ఏ రాష్ట్ర ప్రభుత్వమూ సేవలు అందించని రీతిలో తెలంగాణ ప్రభుత్వం రైతుల నుంచి పదివేల కోట్ల రూపాయల యాసంగి ధాన్యం కొనుగోలు చేసి 5 రాష్ట్రాలకు కీలక సహకారం అందించింది. భారత ఆహార సంస్థకు యాసంగి ధాన్యాన్ని సమకూర్చడంలో తెలంగాణ నంబర్‌వన్‌గా నిలిచింది. ఈ విషయాన్ని భారత ఆహార సంస్థ సీఎండీ డీవీ ప్రసాద్‌ ప్రశంసించారు. యాసంగిలో పండిన వరిధాన్యం సేకరణలో జాతీయస్థాయిలో తెలంగాణది కీలకభాగస్వామ్యమని పేర్కొన్నారు.

495 గూడ్స్‌ రైళ్లలో కర్ణాటక, తమిళనాడు, కేరళ, పశ్చిమబెంగాల్‌, జార్ఖండ్‌ రాష్ర్టాలకు తరలించి.. ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా ప్రజలకు అందించామని, గతంలో ఎప్పుడూ ఇంతటి భారీ స్థాయిలో తరలింపు జరుగలేదని వెల్లడించారు. 2020 యాసంగిలో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 83.01 లక్షల టన్నుల ధాన్యం సేకరించగా.. అందులో తెలంగాణ వాటా 52.23 లక్షల టన్నులు (63%) అని తెలిపారు. ఎఫ్‌సీఐ లక్ష్యం 91.07 లక్షల టన్నులు కాగా అందులో 57 శాతానికి పైగా తెలంగాణదే కావడం అద్భుతం. 

లాక్‌డౌన్‌లో కేంద్రం చేపట్టిన ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ అన్న యోజన ద్వారా ఉచిత రేషన్‌ పంపిణీలో భాగంగా తెలంగాణలో 2.87 లక్షల టన్నుల బియ్యాన్ని 1.91 కోట్ల మంది నిరుపేదలకు ఉచితంగా అందించారని చెప్పారు. దీంతోపాటు 1.32 లక్షల టన్నుల సబ్సిడీ బియ్యాన్ని కేంద్రం రాష్ట్రానికి కేటాయించడం వల్ల 88 లక్షల మందికి లబ్ధి చేకూరింది. లాక్‌డౌన్‌ సమయంలో తెలంగాణ నుంచి ఎఫ్‌సీఐ 13 లక్షల టన్నుల బియ్యాన్ని ఇతర రాష్ర్టాలకు తరలించింది. 

తెలంగాణ సరికొత్త చరిత్ర
గత యాసంగి దిగుబడిలో మునుపెన్నడూ ఎరుగని రీతిలో వరి దిగుబడి సాధించి తెలంగాణ రైతులు రికార్డు సృష్టించారు. ఆ తరువాత పండించిన ధాన్యాన్ని పూర్తిగా ప్రభుత్వమే కొనుగోలు చేయడంతో రైతులకు కాస్త ఊరట లభించింది. దేశంలో తెలంగాణ తప్పించి ఇలాంటి నిర్ణయం ఏ రాష్ట్రం తీసుకోలేదు. కరోనా లాక్‌డౌన్‌ పరిస్థితుల్లో కూడా సీఎం కేసీఆర్‌ సాహసంతో ఈ చారిత్రక నిర్ణయం తీసుకోవడం యావత్‌ దేశాన్ని ఆశ్చర్యపరిచింది. 

ఛత్తీస్‌గఢ్‌ వంటి రాష్ర్టాల్లో దిగుబడితో సంబంధం లేకుండా పరిమితులతో ధాన్యాన్ని కొనుగోలు చేశారే తప్ప.. తెలంగాణ సీఎం కేసీఆర్‌ మాదిరిగా సాహసించినవారు లేరు. 2019-20 యాసంగిలో మే 22 వరకు ఎఫ్‌సీఐ లెక్కల ప్రకారం.. మొత్తం 83.01 లక్షల టన్నులు సేకరించగా, అందులో తెలంగాణ వాటా 52.23 లక్షల టన్నులు అంటే 63 శాతంగా ఉంది. రెండో స్థానంలో ఆంధ్రప్రదేశ్‌ 23.04 లక్షల టన్నులు. బుధవారం నాటికి తెలంగాణ నుంచి ధాన్య సేకరణ 55.52 లక్షల టన్నులకు చేరింది. 

Read: నల్గొండ జిల్లాలో ఎట్టకేలకు చిక్కిన చిరుత

Related Posts