తెలంగాణలోని ఆ ఆరు జిల్లాలు కరోనాను ఎలా కట్టడి చేశాయంటే..!

తెలంగాణలో కరోనా మహమ్మారి రోజురోజుకూ విజృంభిస్తూ కేసుల సంఖ్య పెరుగుతున్నా.. కొన్ని జిల్లాల్లో మాత్రం ఇప్పటికీ ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాకపోవడం గమనార్హం.

తెలంగాణలోని ఆ ఆరు జిల్లాలు కరోనాను ఎలా కట్టడి చేశాయంటే..!

తెలంగాణలో కరోనా మహమ్మారి రోజురోజుకూ విజృంభిస్తూ కేసుల సంఖ్య పెరుగుతున్నా.. కొన్ని జిల్లాల్లో మాత్రం ఇప్పటికీ ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాకపోవడం గమనార్హం.

తెలంగాణలో కరోనా మహమ్మారి రోజురోజుకూ విజృంభిస్తూ కేసుల సంఖ్య పెరుగుతున్నా.. కొన్ని జిల్లాల్లో మాత్రం ఇప్పటికీ ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాకపోవడం గమనార్హం. మరికొన్ని జిల్లాల్లో ఒకట్రెండు కేసులు నమోదైనప్పటికీ రోగులు కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. కొన్ని జిల్లాల్లో భారీ సంఖ్యలో కేసులు నమోదు కాగా.. వరంగల్ రూరల్, యాదాద్రి భువనగిరి, వనపర్తి జిల్లాల్లో ఇప్పటి వరకు ఒక్క కేసు కూడా నమోదుకాకపోవడం విశేషం.

జనగామ, సిద్ధిపేట, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో స్వల్ప సంఖ్యలో కేసులు నమోదైనా..  వైరస్ బారిన పడ్డవారు కోలుకొని డిశ్చార్జ్ కావడంతో ఈ జిల్లాలు కూడా వైరస్ రహిత జిల్లాలుగా మారిపోయాయి. ప్రపంచ దేశాలను వణికిస్తున్న వైరస్ ను తెలంగాణలోని ఈ ఆరు జిల్లాల్లో ఎలా కట్డడి చేశారన్న అంశాలపై సర్వత్తా ఆసక్తి రేకెత్తింది.

అధికారుల కృషి, ప్రజల అప్రమత్తతో వరంగల్ రూరల్, యాదాద్రి భువనగిరి, వనపర్తి జిల్లాల్లో ఇప్పటివరకు ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడం గమనార్హం. వరంగల్ అర్బన్, ఖమ్మం జిల్లాల్లో కేసులు పెరుగుతన్నా వరంగల్ రూరల్ జిల్లాలో మాత్రం కరోనా కేసులు నమోదుకాకపోవడంతో విశేషం. అనుమానితులను గుర్తించి ఆయా ప్రాంతా్లో వైరస్ నియంత్రణ చర్యలు తీసుకోవడమే కాకుండా ఎప్పటికప్పుడు క్వారంటైన్ కు తరలించారు. పట్టణాల్లో కంటే గ్రామాల్లోనే కరోనాపై ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవడం
గమనార్హం.

గ్రామీణ ప్రాంతాల్లో అందరూ ఇంటి పట్టునే ఉంటూ పట్టణవాసులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. విదేశాల నుంచి జిల్లాకు వచ్చిన 100 మందిని గుర్తించిన అధికారులు, వారిని ఇళ్లకే పరిమితం చేయగలిగారు. ఫలితంగా ఆ 100 మందికి నెగెటివ్ వచ్చింది. అలాగే ఇతర రాష్ట్రాల నుంచి స్వగ్రామాలకు వచ్చిన 1,742 మందిని ఇళ్లకే పరిమితం చేయగలిగారు. హోం క్వారంటైన్ లో ఉన్న వారికి గ్రామ స్థాయిలో ఆశా కార్యకర్తలతో
పరీక్షలు నిర్వహించారు. ప్రజా చైతన్యం, అధికారుల కట్టుదిట్టమైన చర్యలతోనే కరోనాను అడ్డుకోగలినట్లు కలెక్టర్ హరిత చెప్పారు.

ఇక చుట్టూ వైరస్ వ్యాప్తిస్తున్న యాదాద్రి భువనగిరి జిల్లాలో మాత్రం ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. అనుమానితుల గుర్తింపు, పరీక్షలు, కట్టడి వంటి ప్రణాళికాబద్దమైన చర్యలతో ప్రజలు వైరస్ బారిన పడకుండా జిల్లాను కరోనా రహితంగా ఉంచగలిగామని కలెక్టర్ అనితారామచంద్రన్ అంటున్నారు.  33 మంది విదేశాల నుంచి వచ్చిన వ్యక్తులకు, 12 మంది మర్కజ్ వ్యక్తులను, ఇతర జిల్లాల నుంచి వచ్చిన నలుగురి వ్యక్తులతోపాటు 26 మంది కాశీ యాత్రికులకు గుర్తించి క్వారంటైన్ చేశారు. అందరికీ నెగెటివ్ వచ్చిందని, నలుగురి నివేదికలు మాత్రమే అందాల్సి ఉందని డీఎంహెచ్ వో సాంబశివరావు తెలిపారు.

వనపర్తి జిల్లాలో తొలుత విదేశాల నుంచి వచ్చిన 58 మంది గుర్తించి క్వారంటైన్ చేశారు. తర్వాత మర్కజ్ వెళ్లి వచ్చిన 10 మందిని, అజ్మీర్ కు వెళ్లి వచ్చిన 16 మందిని కూడా క్వారంటైన్ చేశారు. కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా ప్రత్యేక చొరవ తీసుకుని త్రిసభ్య కమిటీలను ఏర్పాటు చేశారు. మర్కజ్ కు సంబంధించి 10 మంది, వారి కాంటాక్టులు 82 మంది నమూనాలు సేకరించిగా అందరికీ నెగెటివ్ వచ్చింది.

జనగామ జిల్లాలో కరోనా పాజిటివ్ వచ్చిన ఇద్దరు వ్యక్తులు కోలుకొని డిశ్చార్జ్ అయిన వారం రోజులు కావస్తుండగా ఇప్పటివరకు మళ్లీ ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు. ఢిల్లీ వెళ్లొచ్చిన ఓ మటన్ వ్యాపారితో పాటు ప్రభుత్వ ఉద్యోగికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో వారి కుటుంబ సభ్యులు వారిని కలిసిన 116 మందిని క్వారంటైన్ కు తరలించారు. వారందరికీ నెగెటివ్ వచ్చింది. జిల్లా కలెక్టర్ కె.నిఖిల, డీసీపీ బి.శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో పటిష్ట చర్యలు చేపట్టారు.

కరోనా నియంత్రణలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా యంత్రాంగం భేష్ అనిపించుకుంది. జిల్లాలో నాలుగు పాజిటివ్ కేసులు రాగా వారంతా కోలుకున్నారు. ఈ క్రమంలో కలెక్టర్ ఎంవీ.రెడ్డి, జిల్లా ఎస్పీ సునీల్ దత్ తోపాటు జిల్లా యంత్రాంగాన్ని ప్రజలు అభినందిస్తున్నారు. కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి లవ్ అగర్వాల్ భద్రాద్రి అధికారులను ప్రశంసించారు. ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరోనా రహిత జిల్లాగా మారింది. హరీష్ చొరవ, అధికారుల కృషితో సిద్ధిపేట జిల్లా కూడా సేఫ్ జోన్ లో ఉంది.