ముస్లిం కరోనా రోగులకు గుడ్ న్యూస్ : ఐసోలేషన్ వార్డులు, క్వారంటైన్లలో నాణ్యమైన రంజాన్ ఫుడ్

ముస్లిం కరోనా రోగులకు గుడ్ న్యూస్ : ఐసోలేషన్ వార్డులు, క్వారంటైన్లలో నాణ్యమైన రంజాన్ ఫుడ్

పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ముస్లిం కరోనా రోగులకు శుభవార్త అందించింది. నెల రోజులపాటు కఠోర ఉపవాస దీక్షలు చేయనున్న ముస్లింలకు వారి ఇళ్లలో తయారు చేసే వంటకాల మాదిరిగానే ఐసోలేషన్  వార్డులు, క్వారంటైన్లలోనూ నాణ్యమైన రంజాన్ ఆహారాన్ని అందించనుంది. షెహరి, ఇఫ్తార్ విందుల్లో ముస్లింలకు వెజ్, నాన్ వెజ్ వంటకాలతో కూడిన భోజనాన్ని అందించనుంది.

ప్రత్యేకంగా తయారు చేసిన రంజాన్ మెనూ శనివారం (ఏప్రిల్ 25, 2020) నుంచి అందుబాటులోకి రానుంది. తెల్లవారుజామున 3:30 గంటలకు ఉపవాస దీక్షను ప్రారంభించనున్న క్రమంలో కరోనా సోకిన ముస్లిం రోగులకు అప్పటికే భోజనాన్ని సిద్ధం చేస్తారు. ఆ సమయంలో తినేందుకు వీలుగా షెహరిగా రొట్టెలు, వెజ్ కర్రీ, దాల్ అందించనున్నారు. సాయంత్రం ఉపవాస దీక్ష అనంతరం ఇఫ్తార్ విందులో కిచిడీ, చికెన్ కర్రీ, భగారా రైస్, దాల్చ, వెజ్ బిర్యాని, చికెన్ బిర్యానిని అందించనున్నారు.

దాంతో పాటుగా మటన్ కర్రీ లేదా చికెన్ కర్రీని రోజు విడిచి రోజు పెడతారు. ఇక అల్ఫాహారం మెనుగా ఖర్జూరం, అరటిపండ్లు, ఇతర పండ్లను వడ్డిస్తారు. కాగా, గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కరోనా వైరస్ ముస్లిమేతర రోగులను వేరే గదిలోకి తరలించనున్నట్లు తెలుస్తోంది. ముస్లింలు నమాజ్ చేసుకోవడానికి వీలుగా ఉండేలా అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.