విద్యార్థులకు గమనిక : నారాయణ (26), చైతన్య (18) కాలేజీల గుర్తింపు రద్దు

నిబంధనలు పాటించని జూనియర్‌ కాలేజీలపై తెలంగాణ ఇంటర్‌ బోర్డు కొరడా ఝుళిపించింది. హైకోర్టు ఆదేశాల మేరకు అనుమతులు లేని, నిబంధనలు పాటించని 68 జూనియర్‌ కాలేజీల గుర్తింపు రద్దు చేసింది. ఇ

విద్యార్థులకు గమనిక : నారాయణ (26), చైతన్య (18) కాలేజీల గుర్తింపు రద్దు

నిబంధనలు పాటించని జూనియర్‌ కాలేజీలపై తెలంగాణ ఇంటర్‌ బోర్డు కొరడా ఝుళిపించింది. హైకోర్టు ఆదేశాల మేరకు అనుమతులు లేని, నిబంధనలు పాటించని 68 జూనియర్‌ కాలేజీల గుర్తింపు రద్దు చేసింది. ఇందులో నారాయణ,  శ్రీచైతన్య కాలేజీలు ఉన్నాయి. కాలేజీల గుర్తింపు రద్దు చేస్తున్నట్లు ఆయా కాలేజీల యాజమాన్యాలకు ఇంటర్‌బోర్డు ఈ-మెయిల్‌ ద్వారా సమాచారం అందించింది.

తెలంగాణలో జూనియర్‌ కాలేజీలపై చర్యలకు ఇంటర్‌ బోర్డు రంగంలోకి దిగింది. హైకోర్టు ఆదేశాలతో కార్పొరేట్‌ కాలేజీలపై చర్యలకు ఉపక్రమించింది.  రాష్ట్ర వ్యాప్తంగా 68 కాలేజీల గుర్తింపు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇందులో 26 నారాయణ కాలేజీలు ఉండగా… ఇక మరో కార్పొరేట్ కాలేజీ శ్రీచైతన్యవి 18 కళాశాలలు ఉన్నాయి. ఇవన్నీ నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నట్టు ఇంటర్‌ బోర్డు తెలిపింది. ఫైర్‌ డిపార్ట్‌మెంట్‌ నుంచి ఎన్‌వోసీ తీసుకోకుండానే కాలేజీలను రన్‌ చేస్తున్నట్టు వెల్లడించింది.

వాస్తవానికి గతంలో కార్పొరేట్‌ కాలేజీలైన శ్రీచైతన్య, నారాయణలో జరుగుతున్న అక్రమాలపై విచారణ చేపట్టాలని, నిబంధనలు పాటించని కాలేజీలపై చర్యలు తీసుకోవాలని సామాజిక కార్యకర్త రాజేష్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై హైకోర్టు గత ఫిబ్రవరి 27న విచారణ చేపట్టింది. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న కళాశాలపై చర్యలు తీసుకోవాలని ఇంటర్‌ బోర్డును హైకోర్టు ఆదేశించింది. ఏప్రిల్‌ 3లోపు తీసుకున్న చర్యలపై నివేదిక ఇవ్వాలని సూచించింది. (గట్టెక్కేనా : TSRTCపై కరోనా కాటు)

హైకోర్టు ఆదేశాలతో  రంగంలోకి దిగిన ఇంటర్‌బోర్డు.. ఫైర్‌ డిపార్ట్‌మెంట్ నుంచి నో అబ్జక్షన్‌ సర్టిఫికెట్‌ పొందని కాలేజీలకు షోకాజ్‌ నోటీసులు ఇచ్చింది. మార్చిలో పరీక్షలు జరుగుతున్నందున కాలేజీల గుర్తింపు రద్దు చేస్తే విద్యార్థుల భవిష్యత్‌ ప్రశ్నార్థకమవుతుందని బోర్డు భావించింది. దీంతో షోకాజ్‌ నోటీసులతో సరిపెట్టింది. గత నెలలోనే ఇంటర్‌ పరీక్షలు ముగియడంతో బోర్డు ఇప్పుడు చర్యలకు ఉపక్రమించింది.

షోకాజ్‌ నోటీసులకు ఆయా కాలేజీలు స్పందించకపోవడంతో అనుమతిలేని కాలేజీలను మూసివేయాలని నిర్ణయించింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 68 జూనియర్‌ కాలేజీలను రద్దు చేసినట్టు ఇంటర్‌ బోర్డు కార్యదర్శి జలీల్‌ తెలిపారు. అనుమతి రద్దు చేసిన సమాచారాన్ని  ఈ-మెయిల్‌ ద్వారా యాజమాన్యాలకు అందించామన్నారు. 68 కాలేజీలపై వేటు వేయడంతో  మిగిలిన కాలేజీ యాజామాన్యాల్లోనూ కలవరం మొదలైంది.