Corona Treatment : కరోనా చికిత్స కాలం 15 రోజులు

కరోనా సెకండ్‌ వేవ్‌లో కనీసం 15 రోజులు చికిత్స అందించాల్సి వస్తుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హోంక్వారంటైన్‌లో ఉండి కోలుకున్నవారికి సైతం కనీసం 15 రోజులపాటు వ్యాధి లక్షణాలు కనిపిస్తున్నాయి.

Corona Treatment : కరోనా చికిత్స కాలం 15 రోజులు

Corona Treatment

15 days treatment for corona : కరోనా అనగానే చాలామందిలో ఓ వారం రోజులు ఉండే జ్వరమని.. ఇంట్లో ఉండి నాలుగైదురోజులు చికిత్స తీసుకుంటే సరిపోతుందనే భావన ఉంది. ఇది తప్పుడు భావన అని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మొదటి వేవ్‌ సమయంలో అసిమ్టమాటిక్‌ వ్యక్తులు, స్వల్ప లక్షణాలు ఉన్న బాధితులు నాలుగైదు రోజులు ఐసొలేషన్‌లో లేదా క్వారంటైన్‌లో ఉండి జాగ్రత్తలు పాటిస్తూ చికిత్స తీసుకుంటే కోలుకున్న సంగతి వాస్తవమే. కాస్త ఎక్కువ లక్షణాలు ఉన్నవారు (మోడరేట్‌), తీవ్ర లక్షణాలు ఉన్నవారు సగటున 7 నుంచి 10 రోజులు ఆస్పత్రిలో ఉండి చికిత్స పొందాల్సి వచ్చేది.

కొవిడ్‌-19లో ఉత్పరివర్తనాలు
ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. కొవిడ్‌-19లో ఉత్పరివర్తనాలు రావడం, డబుల్‌ వేరియంట్లు ఇప్పుడు దాడులు చేస్తుండటంతో చికిత్సలోనూ చాలామార్పులు వచ్చాయని వైద్యనిపుణులు చెప్తున్నారు. సెకండ్‌ వేవ్‌లో కరోనా బాధితుల్లో కొత్త లక్షణాలు కనిపిస్తున్నాయని పేర్కొంటున్నారు. డబుల్‌ వేరియంట్ల ప్రభావంతో వైరస్‌ కాస్త బలపడినట్టు కనిపిస్తుందని, దీంతో చికిత్స కాలం పెరిగిందని వెల్లడిస్తున్నారు.

సెకండ్‌ వేవ్‌లో కనీసం 15 రోజులు చికిత్స అందించాల్సి వస్తుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హోంక్వారంటైన్‌లో ఉండి కోలుకున్నవారికి సైతం కనీసం 15 రోజులపాటు వ్యాధి లక్షణాలు కనిపిస్తున్నాయి. ఆ తర్వాత సైతం మరో ఒకటిరెండు వారాలు దగ్గు, ఆయాసం, నీరసం వంటివి ఉంటున్నాయి.

కారణాలు
వైరస్‌లో అధిక ఉత్పరివర్తనాల వల్ల ఇన్ఫెక్షన్‌స్థాయి పెరిగింది. కొత్త స్ట్రెయిన్లు దాడి చేస్తుండటంతో కొత్త లక్షణాలు కనిపిస్తున్నాయి. చాలామంది సొంత వైద్యం చేసుకుంటూ వ్యాధి ముదిరిన తర్వాత ఆస్పత్రికి వెళ్తున్నారు. దీంతో వారికి ఎక్కువకాలం చికిత్స అందించాల్సి వస్తుంది. కొత్త స్ట్రెయిన్లతో చాలామందికి వైరస్‌ సోకినా.. యాంటీజెన్‌ పరీక్షల్లో నెగెటివ్‌గా వస్తుంది. దీంతో వారు ఎలాంటి చికిత్స తీసుకోవడం లేదు. వ్యాధి తీవ్రమైన తర్వాత ఆస్పత్రికి వెళ్తున్నారు.

దీంతో కోలుకోవడానికి ఎక్కువ సమయం పడుతుంది. కరోనా సోకినవారు కచ్చితంగా కనీసం 15 రోజులపాటు ఐసొలేషన్‌లో ఉండాలని, చికిత్స తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మానసికంగా ధైర్యంగా ఉంటూ, పౌష్ఠికాహారాన్ని తీసుకుంటూ, సమయానికి మందులు వేసుకుంటే సులభంగా జయించవచ్చని అంటున్నారు.