నకిలీ పాసు పుస్తకాలతో రూ.2 కోట్లు కాజేశారు

నకిలీ పాసు పుస్తకాలతో రూ.2 కోట్లు కాజేశారు

2 crore rupees fraud with fake pass books : పెద్దపల్లి జిల్లాలో ఘరానా మోసం జరిగింది. నకిలీ పాసు పుస్తకాలతో సుమారు 2 కోట్ల రూపాయలు కాజేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రామగిరి, ముత్తారం మండలానికి చెందిన 153 మంది రైతులు 2016-18 మధ్య నకిలీ పుస్తకాలతో తెలంగాణ గ్రామీణ బ్యాంకులో రుణాలు తీసుకున్నారు. వీరంతా కలిసి కోటి 99లక్షల రూపాయలు రుణం పొందారు. 2019 డిసెంబర్‌లో బ్యాంకు అధికారులు రుణాలు చెల్లించాలంటూ రైతులకు నోటీసులు జారీ చేశారు.

ఒక్క రైతు కూడా రుణాలు చెల్లించకపోవడంతో అనుమానం వచ్చిన బ్యాంకు మేనేజర్‌.. రికార్డులను పరిశీలించారు. అనంతరం అవన్నీ నకిలీవని తేలడంతో వ్యవహారం బయటపడింది. రైతులు రుణాలు చెల్లించకపోవడంపై బ్యాంకు మేనేజర్ విచారణ మొదలుపెట్టామన్నారు. ఇందుకు సంబంధించి భూమి వివరాలను ముత్తారం తహశీల్దార్ కార్యాలయానికి మార్చి 2020లో పంపారన్నారు.

లాక్‌డౌన్ కారణంగా విచారణ ఆలస్యమైందని.. ఆ తర్వాత రైతుల పాసు పుస్తకాలు నకిలీవని సెప్టెంబర్‌లో తేలిందన్నారు. అక్రమాలకు పాల్పడిన 153 మందిపై పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. సీపీ ఆదేశాల మేరకు విచారణ చేపట్టామన్నారు.