తెలంగాణలో ఒక్కరోజే 209 కరోనా పాజిటివ్ కేసులు, 9 మంది మృతి

  • Published By: bheemraj ,Published On : June 11, 2020 / 05:44 PM IST
తెలంగాణలో ఒక్కరోజే 209 కరోనా పాజిటివ్ కేసులు, 9 మంది మృతి

తెలంగాణలో గురువారం (జూన్ 11, 2020) కొత్తగా 209 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. రాష్ట్రంలో ఇవాళ కరోనా సోకి తొమ్మిది మంది మృతి చెందారు. తెలంగాణలో కరోనా కేసులు 4,320కి చేరాయి. ఇప్పటివరకు మొత్తం 165 మంది మృతి చెందారు. తెలంగాణలో 2,162 యాక్టివ్ కేసులు ఉన్నాయి. వారికి ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. 1,993 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. 

జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 175 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. మేడ్చల్- 10, రంగారెడ్డి- 7, మహబూబ్ నగర్-3, కరీంనగర్-3 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. వరంగల్ అర్బన్, ఆసిఫాబాద్, సిద్ధిపేట జిల్లాలో రెండేసి కేసులు నమోదు అయ్యాయి. ములుగు, కామారెడ్డి, వరంగల్ రూరల్, సిరిసిల్ల జిల్లాలో ఒక్కో కేసు నమోదు అయింది. 

జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్‌ కారు డ్రైవర్‌ కరోనా సోకింది. కరోనా పరీక్షల్లో అతడికి పాజిటివ్‌గా నిర్దారణ అయినట్లు వైద్యులు తెలిపారు. ఈరోజు ఉదయం నుంచి మేయర్‌తో కారు డ్రైవర్ విధుల్లోకి వచ్చాడు. అతడికి కరోనా ఉన్నట్టు నిర్ధారణ కావడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.

వెంటనే అతడు ఎవరెవరిని కలిశాడో అందరిని ఆరా తీస్తున్నారు. తన డ్రైవర్‌కు కరోనా అని తెలిసిన మేయర్‌‌, ఆయన  కుటుంబం హోం క్వారంటైన్‌లోకి వెళ్లిపోయింది. మేయర్‌ రామ్మోహన్, ఆయన కుటుంబ సభ్యులకు కరోనా పరీక్షలు నిర్వహించనున్నట్టు సమాచారం. ఇటీవలే రోజుల క్రితమే బొంతు రామ్మోహన్‌కు కరోనా పరీక్షలు నిర్వహించగా నెగటివ్‌ అని తేలింది. 

స్పెషల్‌ శానిటేషన్‌ డ్రైవ్‌ ప్రారంభోత్సవం సందర్భంగా నగరంలోని ఓ హోటల్‌లో మేయర్‌ టీ కూడా తాగినట్టు తెలిసింది. అంతకుముందే టీ షాపులో పనిచేసే మాస్టర్‌కు కరోనా సోకినట్లు తేలింది. అధికారులు వైద్యులకు సమాచారం ఇవ్వడంతో ముందస్తు జాగ్రత్తగా పరీక్షలు నిర్వహించారు. పరీక్షల్లో నెగటివ్‌ రావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.