తెలంగాణకు 3.64 లక్షల వ్యాక్సినేషన్ డోసులు..తొలిరోజు 4,170 మందికి టీకా

తెలంగాణకు 3.64 లక్షల వ్యాక్సినేషన్ డోసులు..తొలిరోజు 4,170 మందికి టీకా

3.64 lakh corona vaccination doses for Telangana : కరోనా మహమ్మారికి అడ్డుకట్ట వేసే టీకా డోసులు తెలంగాణలో అన్ని జిల్లాలకు వెళుతున్నాయి. తొలి విడతగా తెలంగాణకు కేంద్రం 3లక్షల 64 వేల డోసులను పంపింది. మూడంచెల భద్రత మధ్య వాటిని అన్ని జిల్లాలకు పంపిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. ఇప్పటికే 15 లక్షల సిరంజీలు అన్ని జిల్లాలకు వెళ్లాయి. మొత్తం డ్రై ఐస్‌తో ప్రత్యేకంగా తయారు చేసిన బాక్స్‌లలో వయల్స్‌ను జిల్లాలకు పంపిస్తోంది. ఒక్కో బాక్సులో 1200 వయల్స్‌, ఒక్కో వయల్‌లో 5 మిల్లీలీటర్ల మోతాదు టీకా ఉన్నట్లు బాక్సులపై ముద్రించి ఉంది.

లబ్ధిదారుల సంఖ్య ఆధారంగా డోసుల సంఖ్యను కేంద్రమే నిర్ణయించి పంపింది. వచ్చిన దాంట్లో పదిశాతం వేస్టేజ్‌ కింద పంపినట్లు తెలిపారు అధికారులు. మరోవైపు.. భారత్‌ బయోటెక్‌ రూపొందించిన కోవాగ్జిన్‌ డోసులు కూడా తెలంగాణ ప్రభుత్వానికి పంపారు అధికారులు. మొత్తం మూడు బాక్సుల్లో కోవాగ్జిన్‌ టీకాలను ప్రభుత్వానికి అందించారు.

ఒక్కో టీకా వయల్స్‌లో 5 మిల్లీ లీటర్ల చొప్పున వ్యాక్సిన్‌ ఉంటుంది. ప్రతి లబ్ధిదారునికీ సున్నా పాయింట్‌ ఐదు ఎంఎల్‌ డోసు ఇస్తారు. అంటే ఒక్కో డోసు నుంచి పది మందికి టీకా ఇవ్వొచ్చు. వయల్‌ను ఓపెన్‌ చేశాక వెంటనే ఆరు గంటల్లోపే పది మందికి ఇవ్వాలని.. ఆలస్యమైతే టీకా పనిచేయదని చెబుతున్నారు అధికారులు. అది కూడా 2 నుంచి 25 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేసినప్పుడు మాత్రమే పనిచేస్తుంది. టీకా ఇచ్చిన తర్వాత 30 నిమిషాలపాటు వారు వైద్యుల పర్యవేక్షణలో ఉండాలి.

ఈ నెల 16న.. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో 31 వ్యాక్సిన్‌ కేంద్రాలను ప్రధాని నరేంద్రమోడీ వర్చవల్‌గా ప్రారంభించనున్నారు. ఆ రోజు వ్యాక్సినేషన్ ప్రక్రియ ఉంటుంది. మరసుటి రోజు ఆదివారం కావడంతో టీకాను పంపిణీ చేయరు. 18 నుంచి తిరిగి కార్యక్రమం మొదలవుతుంది. సోమవారం నుంచి టీకా పంపిణీ కేంద్రాల సంఖ్యను 12వందల 13 కేంద్రాలకు పెంచుతారు. వారానికి నాలుగు రోజులు మాత్రమే అంటే.. సోమ, మంగళ, గురు, శుక్రవారాల్లోనే వ్యాక్సినేషన్‌ ఉంటుంది.

ఒక్కో కేంద్రంలో రోజులో 30 నుంచి 50 మందికి టీకా చేయనున్నారు. ప్రతి కేంద్రానికీ ఒక ప్రత్యేక అధికారిని నియమిస్తారు. తొలిదశలో టీకా పొందే హెల్త్‌కేర్‌ వర్కర్స్‌ 3 లక్షలు, తొలిదశలో టీకా పొందే ఫ్రంట్‌లైన్ వర్కర్స్‌ 2 లక్షలు, తొలిదశలో టీకా పొందే ప్రాధాన్యతా వర్గం 75 లక్షలు.