Gandhi Hospital : వెంటిలేటర్‌పై ఉన్నవారిలో 30 శాతం మంది యువకులే..

కరోనా బారిన పడిన అందరికీ ఆక్సిజన్‌ అవసరం పడదని.. కానీ అనేక మంది భయంతో అనవసరంగా వాడుతున్నారని గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రాజారావు అన్నారు. గాంధీలో వెంటిలేటర్‌పై ఉన్న వారిలో 30 శాతం మంది యువకులే ఉన్నారని తెలిపారు.

Gandhi Hospital : వెంటిలేటర్‌పై ఉన్నవారిలో 30 శాతం మంది యువకులే..

30 Percent Of Young People Are On A Ventilator In Gandhi Hospital

30 percent of young people on a ventilator : కరోనా బారిన పడిన అందరికీ ఆక్సిజన్‌ అవసరం పడదని.. కానీ అనేక మంది భయంతో అనవసరంగా వాడుతున్నారని గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రాజారావు అన్నారు. తమ వద్దకు వచ్చే రోగుల్లో 30 శాతం మంది అవసరం లేకపోయినా ఆక్సిజన్‌ కోసం వస్తున్నారని తెలిపారు. అందువల్లనే అవసరమైన వారికి కూడా ఆక్సిజన్‌ దొరకని పరిస్థితి నెలకొందని చెప్పారు. గాంధీలో వెంటిలేటర్‌పై ఉన్న వారిలో 30% మంది యువకులే ఉన్నారని.. అంటే 30–45 ఏళ్ల వయస్సు వారని తెలిపారు. కరోనా సెకండ్‌ వేవ్‌లో యువకులు కూడా ఎక్కువగా వైరస్‌ బారినపడుతున్నారని తెలిపారు. అలాగే చిన్నపిల్లల ద్వారా పెద్దలకు సోకుతోందని పేర్కొన్నారు. పిల్లలకు వైరస్‌ కనిపించదు కానీ వారు పెద్దలకు వ్యాపింపజేస్తున్నారని పేర్కొన్నారు.

అలాంటి యాంటీ వైరల్‌ డ్రగ్స్‌తో ప్రాణాలు నిలపడం సాధ్యం కాదు
రెమిడెసివిర్, తుసిలిజు మాబ్‌… ఇప్పుడు వీటికున్న క్రేజే వేరు. వీటిని కరోనా రోగులపాలిట అపర సంజీవనిగా అందరూ భావిస్తున్నారు. ఇదే కరోనా సీరియస్‌ రోగులను కాపాడే గొప్ప మందుగా తలపోస్తున్నారు. కానీ ఇలాంటి యాంటీ వైరల్‌ డ్రగ్స్‌తో ప్రాణాలు నిలపడం సాధ్యం కాదని, వాటిని వాడాల్సిన అవసరమే లేదని హైదరాబాద్‌ డాక్టర్‌ రాజారావు తేల్చి చెబుతున్నారు. వాటి కోసం పిచ్చెక్కినట్లు బ్లాక్‌లో కొంటూ వేలు, లక్షల రూపాయలు వృథా చేసుకుంటున్నారని అంటున్నారు. సెకండ్‌ వేవ్‌లో పిల్లలతోపాటు యువకులు కూడా ఎక్కువగా కరోనా బారిన పడుతున్నారని చెప్పారు. గాంధీలో 30 శాతం మంది యువకులే వెంటిలేటర్‌పై ఉన్నారన్నారు. కరోనా చికిత్సకు సంబంధించి మరిన్ని వివరాలు ఆయన మాటల్లోనే..

అవసరం లేకున్నా భయంతో ఆక్సిజన్‌…
కరోనా బారిన పడిన అందరికీ ఆక్సిజన్‌ అవసరం పడదు. అనేక మంది భయాందోళనతో అనవసరం గా వాడుతున్నారు. మా వద్దకు వచ్చే రోగుల్లో 30 శాతం మంది అవసరం లేకపోయినా ఆక్సిజన్‌ కోసం వస్తున్నారు. వాస్తవంగా ఆక్సిజన్‌ శాచురేషన్‌ స్థాయిలను బట్టి వాడాలా లేదా అనే నిర్ధారణకు వస్తాం. ఆక్సిజన్‌ శాచురేషన్‌ లెవెల్స్‌ 85 శాతం కంటే తక్కువగా ఉంటే అత్యంత విషమమైన పరి స్థితుల్లో రోగి ఉన్నట్లు లెక్క. 85–89 మధ్య ఉంటే విషమం, 90–93 శాతం శాచురేషన్‌ ఉంటే మధ్య స్థాయి, 93–95 వరకు ఉంటే మైల్డ్‌గా ఉన్నట్లు లెక్క. 95 అంతకంటే ఎక్కువగా శ్యాచురేషన్‌ ఉంటే సాధారణం కింద లెక్క. కానీ శాచురేషన్‌ స్థాయి 100 శాతం రావడం లేదని, 95 మాత్రమే ఉందని.. ఆక్సిజన్‌ పెట్టాలని అనేక మంది ఆసుపత్రులకు పరుగులు పెడుతున్నారు. అందువల్లనే అవసర మైన వారికి కూడా ఆక్సిజన్‌ దొరకని పరిస్థితి. చాలా మంది దమ్ము అని ఆస్పత్రికి వస్తుంటారు.. కానీ వారిని చూస్తే సాధారణంగానే ఉంటారు.

వెంటిలేటర్‌పై 30 శాతం మంది యువకులే…
గాంధీలో వెంటిలేటర్‌పై ఉన్న వారిలో 30 శాతం మంది యువకులే ఉన్నారు. అంటే 30–45 ఏళ్ల వయస్సు వారన్నమాట. కరోనా సెకండ్‌ వేవ్‌లో యువకులు కూడా ఎక్కువగా వైరస్‌ బారినపడుతున్నారు. గతం కంటే ఇప్పుడు డాక్టర్లు ఎక్కువగా వైరస్‌కు గురవుతున్నారు. అలాగే చిన్నపిల్లల ద్వారా పెద్దలకు సోకుతోంది. పిల్లలకు వైరస్‌ కనిపించదు కానీ వారు పెద్దలకు వ్యాపింపజేస్తున్నారు. అందుకే ప్రభుత్వం పాఠశాలు, కాలేజీలను మూసేసింది.

అవి సీరియస్‌ కేసులను తగ్గించలేవు..
రెమిడెసివిర్, తుసిలిజుమాబ్, ప్లాస్మాలు వాడితే కరోనా తగ్గుతుందన్న రుజువు లేనేలేదు. రెమిడెసివిర్‌ను వాడాల్సిన అవసరం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) చెప్పింది. సీరియస్‌ రోగులను అది ఏమాత్రం సాధారణ స్థితికి తీసుకురాలేదు. రెమిడెసివిర్‌ కావాలని రోగులే ఎక్కువగా అడుగుతున్నారు. అది ఇస్తేనే సరైన వైద్యంగా భావిస్తున్నారు. దీనిపై జనాల్లో పిచ్చి అభిప్రాయాలు ఉన్నాయి. ఈ ఇంజెక్షన్‌ ప్రాణాలను ఏమీ కాపాడదు. యాంటీ వైరల్‌ డ్రగ్స్‌ అయిన రెమిడెసివిర్, తుసిలిజుమాబ్, ఫావిపిరావిర్‌లతో ప్రయోజనం లేదు. తుసి లిజుమాబ్‌ను డాక్టర్‌ నిర్ణయం మేరకు అత్యంత అరుదైన కేసుల్లోనే వాడాలి. ఈ మందు ఒక శాతం మందిలో కూడా అవసరం పడదు. అయితే రోగుల సంతృప్తి కోసం మాత్రమే ఇస్తున్నారు.

సివియర్‌ కేసుల్లో స్టెరాయిడ్‌ చికిత్స…
కరోనా లక్షణాలను బట్టే చికిత్స ఉంటుంది. సాధారణ కేసుల్లో డాక్టర్‌ సూచనల మేరకు మందులు వాడితే సరిపోతుంది. సీరియస్‌ కేసుల్లో స్టెరాయిడ్స్, యాంటీ ప్లేట్‌లెట్‌ డ్రగ్స్, యాంటీ కోయాగ్లెన్స్‌ మందులు అవసరాన్ని బట్టి వాడాలి. ఏ సమయంలో ఇవ్వాలో వాటిని అప్పుడు ఇస్తేనే సరిగా పనిచేస్తాయి.

సెకండ్‌ వేవ్‌లో వైరస్‌ విజృంభణ అధికం…
మొదటి వేవ్‌ కంటే సెకండ్‌ వేవ్‌ తీవ్రంగా ఉంది. ట్రిపుల్‌ మ్యుటేషన్‌ రాష్ట్రంలో గుర్తించలేదు. డబుల్‌ మ్యుటెంట్‌ వైరస్‌లైతే ఉన్నాయి. దీంతో వైరస్‌ ఇన్ఫెక్షన్‌ రేటు అధికంగా ఉంది. కుటుంబంలో ఒకరికి వస్తే ఇతరులకు వేగంగా వ్యాపిస్తుంది. దీంతో చాలామంది వైరస్‌ బారిన పడుతున్నారు. వందలో 80 మందికి ఇంట్లోనే రికవరీ అవుతుంది. మిగిలిన వారిలో ఐదుగురికి మాత్రమే ఆక్సిజన్‌ అవసరం పడుతుంది. వైరస్‌ విజృంభణ వల్ల అన్ని ప్రైవేట్‌ ఆసుపత్రుల్లోనూ ఇప్పుడు కరోనా చికిత్సలకు అనుమతి వచ్చింది. కిందిస్థాయి నుంచి పైస్థాయి వరకు పడకలు నిండుతున్నాయి. కేసుల సంఖ్య ఎక్కువుంది కాబట్టి అందులో సివియర్‌ కేసులు కూడా ఎక్కువగానే ఉన్నాయి. మూడు వారాల్లో వైరస్‌ తగ్గుముఖం పడుతుందని భావిస్తున్నాం.

టీకా వేసుకోండి… జాగ్రత్తలు పాటించండి
అనవసరంగా బయటకు పోవద్దు. సినిమాలు, పబ్స్, రెస్టారెంట్లు, బార్లకు వెళ్లొద్దు. అత్యవసరమైతే తప్ప శుభకార్యాలకు వెళ్లొద్దు. బర్త్‌డే పార్టీలు చేసుకోవద్దు. పండుగలను తక్కువ మందితో జాగ్రత్తలు తీసుకొని చేసుకోవాలి. ముక్కు, నోరు పూర్తిగా మూసుకునేలా మాస్క్‌ పెట్టుకోవాలి. తరచుగా చేతులు శుభ్రం చేసుకోవాలి. ఏ కంపెనీ వ్యాక్సిన్‌ అని చూడకుండా ఏది అందుబాటులో ఉంటే దాన్ని వేసుకోవాలి. కరోనా నియంత్రణలో ఇవే కీలకమైన అంశాలు.. అని రాజారావు తెలిపారు.