తెలంగాణలో 3,147 కరోనా కేసులు…. 105కు చేరిన మృతుల సంఖ్య

  • Published By: bheemraj ,Published On : June 4, 2020 / 06:36 PM IST
తెలంగాణలో 3,147 కరోనా కేసులు…. 105కు చేరిన మృతుల సంఖ్య

తెలంగాణలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. రాష్ట్రంలో కొత్తగా 127 కరోనా కేసులు నమోదు అయ్యాయి. దీంతో తెలంగాణలో పాజిటివ్ కేసుల సంఖ్య 3,147కు చేరింది. తాజాగా నమోదైన కేసుల్లో జీహెచ్ఎంసీ పరిధిలో 110, రంగారెడ్డిలో 6, ఆదిలాబాద్ లో 7, మేడ్చల్ లో 2, ఖమ్మ జిల్లాలో ఒకటి చొప్పున నమోదు అయ్యాయి. ఈ మేరకు గురువారం (జూన్ 4, 2020) న ప్రజారోగ్యం విభాగం సంచాలకుడు డా.శ్రీనివాస్ రావు బులిటెన్ లో పేర్కొన్నారు. గత 24 గంటల్లో కరోనా వైరస్ తో 6 మంది మృతి చెందారు. మృతుల సంఖ్య 105కు చేరింది. కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 105కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1455 యాక్టివ్ కేసులున్నాయి. 

తెలంగాణలో కరోనా పంజా విసురుతోంది. ప్రధానంగా హైదరాబాద్ పరిధిలో అత్యధికంగా కేసులు నమోదు అవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. అత్యధికంగా ఇక్కడ 2 వేల 035 కేసులు నమోదు కావడం గమనార్హం. మొన్నటి వరకు జియాగూడ, ఆసిఫాబాద్, భోలక్ పూర్, కార్వాన్ లో కేసులు నమోదైన సంగతి తెలిసిందే. తాజాగా నాగోల్ డివిజన్ లోని బండ్లగూడ, ఫతుల్లాగూడలో కరోనా కేసులు నమోదు కావడంతో స్థానికులు భయబ్రాంతులకు గురవుతున్నారు.

నారాయణగూడ, రామంతాపూర్ ల్యాబ్ టెక్నీషీయన్లకు కరోనా సోకింది. దమ్మాయిగూడలో 8 నెలల చిన్నారికి వైరస్ వ్యాపించగా, గోల్నాకాలో ఓ మహిళ కరోనాతో మృతి చెందింది. మరోవైపు…మహమ్మారి బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నవారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. బుధవారం (జూన్ 3, 2020)న కరోనాతో మరో ఏడుగురు మృతి చెందారు.

ఒక్కరోజులోనే ఇంతమంది చనిపోవడం ఇదే తొలిసారి. వీరితో కలిపి రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 99కి చేరింది. గత 3 రోజుల్లోనే 17 మంది చనిపోయారు. పాజిటివ్‌ కేసుల సంఖ్య 3వేలు దాటింది. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో వైరస్‌ ఉధృతి మరింత పెరిగింది. బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా మరో 129 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 108 మంది వైరస్‌ బారిన పడ్డారు.