ప్రపంచంలో ఫస్ట్ టైమ్ : లీటర్ల కొద్దీ పాలు ఇస్తున్న 5రోజుల లేగదూడ

  • Published By: veegamteam ,Published On : February 23, 2020 / 03:29 AM IST
ప్రపంచంలో ఫస్ట్ టైమ్ : లీటర్ల కొద్దీ పాలు ఇస్తున్న 5రోజుల లేగదూడ

లేగ దూడ ఏంటి.. పాలు ఇవ్వడం ఏంటి.. నమ్మబుద్ధి కావడం లేదు కదూ.. కానీ.. ఇది నిజం..నమ్మి తీరాల్సిందే.. 5 రోజుల లేగ దూడ.. లీటర్ల కొద్దీ పాలు ఇస్తోంది. ఉదయం, సాయంత్రం.. టైమ్ ఏదైనా.. వద్దన్నా పాలు ఇస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో ఈ వింత జరిగింది. నిర్మల్ జిల్లా దిలావర్ పూర్ మండలంలోని లోలం గ్రామంలో ఉన్న ఓ డెయిరీ ఫాంలో 5 రోజుల వయసున్న లేగ దూడ పాలు ఇస్తోంది. డెయిరీ నిర్వహాకులే కాదు.. విషయం తెలిసిన స్థానికులు కూడా షాక్ అయ్యారు. లేగ దూడను చూసేందుకు డెయిరీకి క్యూ కట్టారు.  ఇంకా సరిగా నిలబడలేని వయస్సులో ఉన్న ఆ లేగదూడకు పాలు రావడం చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు.

నిర్మల్ పట్టణానికి చెందిన మహ్మద్ అజర్.. దిలావర్ పూర్ మండలం లోలంలోని తన వ్యవసాయ క్షేత్రంలో డెయిరీ ఫాం నిర్వహిస్తున్నాడు. అందులో 50 గేదెలతో పాటు 8 మేలు రకం జెర్సీ ఆవులున్నాయి. ఐదు రోజుల కిందట ఓ ఆవు… దూడకు జన్మనిచ్చింది. పుట్టిన మర్నాడు అక్కడ పనిచేసే వ్యక్తి… లేగదూడ పొదుగును పరిశీలించగా పెద్దదిగా ఉంది. ఆ పొదుగును తమిడి చూస్తే..ధారలా పాలు వచ్చాయి. దీంతో అతడు పాలు పితికి చూశాడు. లీటర్ పాలు ఇచ్చింది. దాంతో నాలుగు రోజులుగా… ఉదయం, సాయంత్రం వేళ పాలు పితుకుతున్నారు. 

ఆవు పాలు ఇవ్వడం కామన్. లేగదూడ వయస్సు నుంచి క్రమంగా పెరిగి పెద్దదైన తర్వాత.. ఓ లేగదూడకు జన్మనిచ్చాక పాలివ్వడం సాధారణం జరుగుతుంది. కానీ, పట్టుమని పదిరోజులైనా నిండని లేగదూడ పాలివ్వడం అందరిని విస్తుపోయేలా చేసింది. 5 రోజుల లేగ దూడ పాలు ఇవ్వడం సంచలనంగా మారింది. దీనిపై పశు వైద్యులు స్పందించారు. ఇలా ప్రపంచంలో ఎక్కడా జరగలేదని అన్నారు. అలాగని ఇది వింతేమీ కాదంటున్నారు. హార్మోన్ల లోపం వల్ల ఇలా జరిగి ఉండొచ్చని పశువైద్యులు వివరించారు. కారణం ఏదైనా.. ఐదు రోజుల లేగదూడ పాలివ్వడం మాత్రం చర్చగా మారింది.