Telangana Police : దమ్ముంటే పట్టుకో! తెలంగాణ కాప్స్‌కు దొంగ సవాల్‌, 56 కార్లు చోరీ

Telangana Police : దమ్ముంటే పట్టుకో! తెలంగాణ కాప్స్‌కు దొంగ సవాల్‌, 56 కార్లు చోరీ

Tg Cops

56 Cars Robbery : ఒకటి కాదు..రెండు కాదు.. 56 కార్లు చోరీ చేశాడు. అయినా ఆ దొంగోడు ఖాకీలకు చిక్కలేదు. పైగా పోలీస్‌ ఉన్నతాధికారులకే సవాల్‌ విసురుతున్నాడు. దమ్ముంటే పట్టుకోండంటూ విర్రవీగుతున్నాడు. సవాల్ చేయడమే కాదు..తాను దయతలిస్తేనే మీ పని ఈజీ అవుతుంది కానీ లేకపోతే పట్టుకోలేరంటూ హల్‌చల్‌ చేశాడు. దీంతో బిత్తరపోవడం బంజారాహిల్స్ పోలీసుల వంతయ్యింది.

రాజస్థాన్ దొంగ : – 
రాజస్థాన్‌కు చెందిన ఈ దొంగ .. దేశవ్యాప్తంగా 56 కార్లను చోరీ చేసి దర్జాగా తిరుగుతున్నాడు. ఈ ఏడాది జనవరి 22న బెంగళూరు నుంచి హైదరాబాద్‌ వచ్చి ఓ స్టార్‌ హోటల్‌లో బస చేసిన సినీ నిర్మాత మంజునాథ్‌ ఫార్చ్యూనర్‌ కారును చోరీ చేసింది ఇతనే. కారులో బంగారు గణపతి విగ్రహంతో పాటు విలువైన స్థలాలకు చెందిన డాక్యుమెంట్లు కూడా ఉన్నాయి. బాధితుడి ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. పార్క్‌ హయత్‌ సీసీ కెమెరాల ఫుటేజ్‌ను పరిశీలించారు. యాప్‌ టెక్నాలజీతో కారు తాళం తీసి ఉడాయించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. రెండు రోజులకు ఔటర్‌ రింగ్‌ రోడ్డు టోల్‌ గేట్‌ నుంచి రాజస్థాన్‌ వైపు దూసుకెళ్లినట్లు పోలీసులు గుర్తించారు.

పోలీసు అధికారికి కాల్ చేసిన దొంగ : – 
రాజస్థాన్‌లో దొంగ ఆచూకీ కోసం గాలిస్తూ 15 రోజులు వెతికారు బంజారాహిల్స్‌ పోలీసులు. అయితే వాళ్లు అక్కడ ఉండగానే పోలీస్‌ అధికారికి ఓ కాల్‌ వచ్చింది. హైదరాబాద్‌ నుంచి ఫలానా ట్రైన్‌లో మీరు రాజస్థాన్‌ వచ్చారు… ఫలానా చోట దిగి నా ఆచూకీ కోసం గాలిస్తున్నారు… ఇంత వర్కవుట్‌ చేస్తున్నందుకు హ్యాట్సాఫ్‌… కానీ నేను దొరకను… కారును కూడా పట్టుకోలేరంటూ మాట్లాడుకుంటూ పోయేసరికి పోలీస్‌ అధికారి అవాక్కయ్యారు.

ఫుడ్ తినండి..బిల్లు నేనే కడుత : –
ఎలాగూ ఇంతదూరం వచ్చారు..మీరున్న చోటుకు సమీపంలోనే మంచి హోటల్‌ ఉంది… అక్కడ ఫుడ్‌ బాగుంటుంది… కడుపారా తినండి… మిమ్మల్ని గెస్ట్‌లుగా భావిస్తా… బిల్లు నేనే కడతా అని.., దొంగ ఏమాత్రం బెరుకు లేకుండా చెప్పేసరికి…పోలీసులు ఖంగుతిన్నారు. కొట్టేసిన కారును నచ్చినంత కాలం వాడుకుని ఎక్కడో చోట వదిలేస్తా, అప్పుడు వచ్చి పట్టుకెళ్లండి…అంతేకానీ ఈ కేసులో మీరు దణ్ణం పెట్టి వేడుకున్నా దొరకను.. మనస్సు మారి లొంగిపోతే తప్ప అని అనేసరికి..ఉత్తచేతులతో హైదరాబాద్‌ తిరిగొచ్చారు పోలీసులు.

వీడియో కాల్ చేసిన దొంగ : – 
రాజస్థాన్‌ చేరుకున్నాక నాలుగు రోజులు కష్టపడి దొంగ అడ్రస్‌ తెలుసుకోగలిగారు. అతనిపై 56 కారు చోరీ కేసులున్నాయని గుర్తించారు. కానీ ఆ దొంగకు పెద్ద నెట్‌వర్క్‌ ఉందని తెలుసుకున్న బంజారాహిల్స్‌ పోలీసులు ఈ కేసును మరింత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. హైదరాబాద్‌ వచ్చిన రెండు రోజులకు పోలీస్‌ అధికారికి మరోసారి కాల్‌ చేశాడు దొంగ. ఈసారి మామూలు కాల్‌ చేయలేదు. వాట్సప్‌ వీడియో కాల్‌ చేశాడు. గంటసేపు మాట్లాడాడు. మరోసారి ఫోన్‌చేయనంటూ చెప్పాడు.

గాలిస్తున్న పోలీసులు : – 
తన ఫోటోను స్క్రీన్‌ షాట్‌ తీసుకోవాలన్నాడు. అంతేనా…కార్ల చోరీలో తాను అనుసరిస్తున్న టెక్నాలజీతోనే తప్పించుకుకోగలుతున్నానంటూ కాలరెగరేశాడు. పనిలోపనిగా బంజరాహిల్స్ పోలీసుల పనితీరునూ ప్రశంసించాడు. తనను వెతుక్కుంటూ రాజస్థాన్‌ వరకు వచ్చినవారు మీరేనంటూ అభినందించాడు. నేరస్తులను పట్టుకోవడంలో హైదరాబాద్‌ పోలీసులకు మంచి పేరు ఉంది. అలాంటి తమకే సవాల్‌ విసురుతున్న రాజస్థానీ దొంగను పట్టుకునేందుకు పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు.

Read More : CM Jagan : ఢిల్లీలో సీఎం జగన్, పోలవరం పెండింగ్ నిధులు విడుదల చేయాలి