తెలంగాణలో ఎయిర్ పోర్టుల నిర్మాణానికి ఆరు అనుకూల ప్రాంతాలు

తెలంగాణలో నూతన విమానాశ్రయాల నిర్మాణానికి మార్గం సుగమమైంది. క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసిన అధికారుల బృందం ఆరు ప్రాంతాల్లో విమానాశ్రయాల నిర్మాణానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్లు నివేదికను ఇచ్చింది.

  • Published By: veegamteam ,Published On : March 11, 2020 / 02:33 AM IST
తెలంగాణలో ఎయిర్ పోర్టుల నిర్మాణానికి ఆరు అనుకూల ప్రాంతాలు

తెలంగాణలో నూతన విమానాశ్రయాల నిర్మాణానికి మార్గం సుగమమైంది. క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసిన అధికారుల బృందం ఆరు ప్రాంతాల్లో విమానాశ్రయాల నిర్మాణానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్లు నివేదికను ఇచ్చింది.

తెలంగాణలో నూతన విమానాశ్రయాల నిర్మాణానికి మార్గం సుగమమైంది. రాష్ట్రంలో ఆరు విమానాశ్రయాలు రానున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం ఒక్కటే ప్రయాణికులకు సేవలు అందిస్తోంది. ప్రభుత్వ వ్యూహం కార్యరూపం దాల్చితే రానున్న సంవత్సరాల్లో విమానాశ్రయాల సంఖ్య ఏడుకు చేరుకుంటుంది.

విమాన అనుసంధానతకు ఉడాన్ పథకం 
చిన్న చిన్న ప్రాంతాలకు విమాన అనుసంధానత కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ఉడాన్ పథకాన్ని ప్రవేశపెట్టింది. దీని కింద రాష్ట్రంలోని బసంత్ నగర్ (పెద్దపల్లి), మామునూరు (వరంగల్), ఖానాపూర్ (ఆదిలాబాద్)లలో వినియోగంలోలేని ఎయిర్ ఫీల్డ్ లను విమానాశ్రయాలుగా మార్చే అవకాశం ఉంది. దీంతోపాటు జక్రాన్ పల్లి (నిజామాబాద్), కొత్తగూడెం/భద్రాచలం, గుడిబండ (మహబూబ్ నగర్)లలో విమానాశ్రయాల కోసం రాష్ట్ర ప్రభుత్వం స్థలాలను గుర్తించింది. రాష్ట్ర ప్రభుత్వం సాంకేతికంగా సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేసే బాధ్యతను భారత విమానాశ్రయ ప్రాధికార సంస్థకు అప్పగించింది. 

విమానాశ్రయాల నిర్మాణానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్లు నివేదిక 
క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసిన అధికారుల బృందం ఆరు ప్రాంతాల్లో విమానాశ్రయాల నిర్మాణానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్లు నివేదికను ఇచ్చింది. సాంకేతికంగా పచ్చజెండా లభించిన ఆరు ప్రాంతాల్లో విమానాశ్రయాల విస్తరణ, నిర్మాణానికి అవకాశం ఉన్నట్లు నిపుణుల బృందం పేర్కొంది. చిన్న విమానాలైన ఏటీఆర్ -72, క్యూ-400లతో తొలుత సర్వీసులను ప్రారంభించొచ్చని స్పష్టం చేసింది.

వరంగల్, మహబూబ్ నగర్ విమానాశ్రయాల నిర్మాణం… ఆ నిబంధనే ప్రతిబంధకం 
వరంగల్, మహబూబ్ నగర్ విమానాశ్రయాలకు సాంకేతికంగా ఇబ్బంది లేకపోయినప్పటికీ ఆ రెండూ శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి 150 కిలోమీటర్లలోపు ఉండటం ప్రతిబంధకంగా ఉంది. శంషాబాద్ విమానాశ్రయం ప్రారంభమైనప్పటి నుంచి 25 ఏళ్ల వరకు 150 ఏరియల్ కిలోమీటర్ల దూరంలో మరో విమానాశ్రయం నిర్మాణం లేదా విస్తరణ చేయకూడదన్నది అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వం, నిర్మాణ సంస్థ మధ్య జరిగిన ఒప్పందంలోని నిబంధన. ఆ నిబంధన చిక్కుముడిని ఎలా విప్పాలన్నది ఇప్పుడు తేల్చాల్సి ఉంది.

ఎయిర్ పోర్టుల నిర్మాణానికి అనుకూల ప్రాంతాలు
1.బసంత్ నగర్ (పెద్దపల్లి), 2. మామునూరు(వరంగల్), 3. ఖానాపూర్ (ఆదిలాబాద్), 4. జక్రాన్ పల్లి (నిజామాబాద్), 5.కొత్తగూడెం, 6. గుడిబండ (మహబూబ్ నగర్)

వరంగల్ 
వరంగల్ ఎయిర్ స్ట్రిప్ 706 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. భవిష్యత్తు విస్తరణ కోసం మరో 400 ఎకరాలు అవసరం. ప్రస్తుతం వాయుసేన శిక్షణ కోసం వినియోగిస్తున్న ఈ ప్రాంతంలో విమానాశ్రయం నిర్మించాలంటే ఆ సంస్థ నుంచి అనుమతి తీసుకోవాలి.

ఆదిలాబాద్
ఆదిలాబాద్ నిషేధిత గగనతలం అవతలే ఎయిర్ ఫీల్డ్ ఉన్న నేపథ్యంలో ఇతర ప్రాంతాల విమానాశ్రయాలతో అనుసంధానానికి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. సాంకేతికంగానూ అవరోధాలు లేవు. ప్రస్తుతం ఎయిర్  ఫీల్డ్ ఉన్న 369.5 ఎకరాలు రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలో ఉంది. విస్తరించేందుకు ఆ శాఖ నుంచి అనుమతి అవసరం ఉంది. భవిష్యత్తు అవసరాల కోసం మరో 200 ఎకరాలు కావాలి.

బసంత్ నగర్ 
బసంత్ నగర్ ఎయిర్ ఫీల్డ్ ఎయిర్ ఫోర్స్ అకాడమీ నియంత్రిత గగనతలం పరిధిలో ఉంది. రక్షణ మంత్రిత్వ శాఖ నుంచి అనుమతి అవసరం. ప్రస్తుత ఎయిర్ ఫీల్డ్ 288 ఎకరాల్లో ఉంది. భవిష్యత్తు అవసరాలకు మరో 350 ఎకరాలు అవసరం.

జక్రాన్ పల్లి
జక్రాన్ పల్లి(నిజామాబాద్) విమానాశ్రయ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం 1,612.07 ఎకరాలను గుర్తించింది. ఈ స్థలం ఎయిర్ ఫోర్స్ అకాడమీ నియంత్రిత గగనతలంలో ఉంది. రక్షణ మంత్రిత్వ శాఖ అనుమతి అవసరం. సాంకేతికంగా అనుకూలతలు ఉన్నాయి. భవిష్యత్తులో విస్తరణ కోసం మరో 900 ఎకరాలు అవసరం.

కొత్తగూడెం/భద్రాచలం 
కొత్తగూడెంలో విమానాశ్రయం ఏర్పాటు కోసం సుమారు 1000 ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. ఈ భూమికి తూర్పువైపు దట్టమైన రిజర్వు ఫారెస్టు, ఉత్తరం, దక్షణం వైపు కొండలు ఉన్నాయి. కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ అనుమతి అవసరం. సాంకేతికంగా ఎలాంటి అభ్యంతరాలు లేవు. విమానాశ్రయ అభివృద్ధికి సుమారు 900 ఎకరాలు అవసరం. భద్రాచలంలో విమానాశ్రయం కోసం 400 ఎకరాలను ప్రభుత్వం గుర్తించింది. ఈ స్థలానికి తూర్పు, పశ్చిమం వైపు హైటెన్షన్ విద్యుత్తు తీగలు, దక్షిణం వైపు ఎత్తైన కొండలు ఉన్న నేపథ్యంలో అక్కడ విమానాశ్రయ నిర్మాణం సాధ్యం కాదు.

మహబూబ్ నగర్
మహబూబ్ నగర్ విమానాశ్రయం కోసం రాష్ట్ర ప్రభుత్వం 375 ఎకరాలను గుర్తించింది. ప్రతిపాదిత స్థలానికి ఈశాన్యం, నైరుతి దిక్కుల్లో రెండు 500 మెగావాట్ల సౌర విద్యుత్తు కేంద్రాలున్నాయి. వీటికి సంబంధించిన విద్యుత్తు లైన్లు ప్రతిపాదిత స్థలం మధ్య నుంచి వెళ్తున్నాయి. గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయాన్ని నిర్మించాలంటే వాటిని మరో ప్రాంతానికి మార్చాలి.
 

See Also | సంతాన యోగం : పురుషుల కోసం ప్రత్యేకం