కారులో రోడ్డుపైకి వచ్చిన జిల్లా మెజిస్ట్రేట్‌‌కు వార్నింగ్ ఇచ్చిన కానిస్టేబుల్‌కు రివార్డ్

  • Published By: srihari ,Published On : May 2, 2020 / 06:53 AM IST
కారులో రోడ్డుపైకి వచ్చిన జిల్లా మెజిస్ట్రేట్‌‌కు వార్నింగ్ ఇచ్చిన కానిస్టేబుల్‌కు రివార్డ్

రూల్ ఈజ్ రూల్. ఏ స్థాయిలో ఉన్న వారైనా నిబంధనలు పాటించాల్సిందే. లేదంటే ఆ రూల్ తీసుకొచ్చి ప్రయోజనం లేదు. ఇది గ్రహించిన ఆ కానిస్టేబుల్ తన డ్యూటీని కరెక్ట్ గా నిర్వహించాడు. లాక్ డౌన్ లో రోడ్డెక్కిన వారికి క్లాస్ తీసుకున్నాడు. కామన్ మ్యాన్ అయినా ఆఫీసర్ అయినా ఊరుకోలేదు. ఏకంగా జిల్లా మేజిస్ట్రేట్ ను అడ్డుకుని వార్నింగ్ ఇచ్చాడు. లాక్ డౌన్ నిబంధనలు ఆయనకు వివరించాడు. ఓ కానిస్టేబుల్, జిల్లా మేజిస్ట్రేట్ ను అడ్డుకోవడం సంచలనమైంది. అయితే తన డ్యూటీని కరెక్ట్ గా నిర్వహించినందుకు గాను ఆ కానిస్టేబుల్ కు ప్రశంసలు వెల్లువెత్తాయి. రివార్డ్ తో సత్కరించారు.

జిల్లా మేజిస్ట్రేట్ కారుని అడ్డుకున్న కానిస్టేబుల్:
ఉత్తరప్రదేశ్ లోని బులంద్ షహర్ లో ఈ ఘటన జరిగింది. ఆ కానిస్టేబుల్ పేరు అరుణ్ కుమార్. లాక్ డౌన్ డ్యూటీలో ఉన్నాడు. లాక్ డౌన్ లో పోలీసులు ఏ విధంగా విధులు నిర్వహిస్తున్నారో తెలుసుకోవడానికి ఉన్నతాధికారులు ఆకస్మిక తనిఖీలు చేస్తున్నారు. ఇందులో భాగంగా జిల్లా మేజిస్ట్రేట్ కారులో రోడ్డు మీదకు వచ్చారు. లాక్ డౌన్ నిబంధనల ప్రకారం అనుమతి లేకుండా రోడ్డు మీదకు రాకూడదు. సికంద్రబాద్ ప్రాంతంలో కానిస్టేబుల్ అరుణ్, ఆ కారుని ఆపాడు. ఎందుకు రోడ్డుపైకి వచ్చారని డ్రైవర్ ని అడిగాడు. ఆ తర్వాత వారికి ఓ వార్నింగ్ ఇచ్చి పంపేశాడు. దానికి ముందు లాక్ డౌన్ రూల్స్ ఏంటో వారికి వివరించాడు. అకారణంగా రోడ్డు మీదకు రావొద్దని కోరాడు. కరోనా వైరస్ కట్టడికి ప్రతి ఒక్కరూ సహకరించాలన్నాడు. కాగా అదే కారులో వెనుక సీటులో జిల్లా మేజిస్ట్రేట్ ఉన్నారు. ఈ విషయం కానిస్టేబుల్ కు తెలియదు. 

మరోసారి రూల్ బ్రేక్ చేయొద్దని వార్నింగ్:
”కానిస్టేబుల్ అరుణ్ కుమార్ సికింద్రాబాద్ ప్రాంతంలో కారు ఆపాడు. ఎలాంటి అనుమతి లేకుండా రోడ్డు మీదకు ఎందుకు వచ్చారని కారులో ఉన్న వారిని నిలదీశాడు. అంతేకాదు కారులో ముగ్గురు వ్యక్తులు వెళ్లడానికి పర్మిషన్ లేదన్నాడు. ఆ తర్వాత వారికి ఓ వార్నింగ్ ఇచ్చి పంపేశాడు. మరోసారి నిబంధనలు బ్రేక్ చేయొద్దన్నాడు. మరోసారి ఇలాంటి తప్పు చేస్తే జరిమానా వేస్తామని హెచ్చరించాడు” అని బులంద్ షహర్ ఎస్ఎస్పీ సంతోష్ తెలిపారు. 

కానిస్టేబుల్ పై ప్రశంసల వర్షం:
కానిస్టేబుల్ అరుణ్ కుమార్ డ్యూటీ మైండెండ్ ను జిల్లా మేజిస్ట్రేట్ ప్రశంసించారు. ఎంతో నిబద్దతగా డ్యూటీ చేశావని మెచ్చుకున్నారు. అరుణ్ కు ప్రశంసాపత్రాన్ని అందజేశారు. అంతేకాదు రూ.2వేల రివార్డ్ కూడా ఇచ్చారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లోనూ పోలీసులు ఎంతో నిబద్దతగా విధులు నిర్వహించడం చాలా ఆనందంగా ఉందని పోలీసు ఉన్నాధికారులు అన్నారు.

Also Read | లాక్ డౌన్ 3.0 ప్రకటన తర్వాత…ట్వీట్ చేసిన మోడీ