కరోనా క్యారియర్లుగా తబ్లిగీ సభ్యులు పనిచేశారు..యోగి కీలక వ్యాఖ్యలు

  • Published By: venkaiahnaidu ,Published On : May 2, 2020 / 07:30 AM IST
కరోనా క్యారియర్లుగా తబ్లిగీ సభ్యులు పనిచేశారు..యోగి కీలక వ్యాఖ్యలు

దేశంలో ఉన్నట్లుండి ఒక్కసారిగా కరోనా కేసులు భారీగా పెరగడానికి తబ్లిగీ జమాత్ కారణమని, కేసుల పెరుగుదలకు వారిదే బాధ్యత అని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. తబ్లిగీ జమాత్ తో లింక్ ఉన్నవాళ్లు కరోనా వైరస్ క్యారియర్లుగా పనిచేసినట్లు యూపీ సీఎం తెలిపారు. ఈ-అజెండా ఆజ్ తక్ కార్యక్రమంలో యోగి మాట్లాడుతూ…తబ్లిఘి జమాత్ చేసిన పని ఖండించదగినది. వారు ఆ విధంగా ప్రవర్తించకపోయినట్లయితే… మొదటి దశ లాక్ డౌన్ సమయంలోనే కరోనావైరస్ పరిస్థితిని దేశం మేనేజ్ చేయగలిగి ఉండేదని యోగి ఆదిత్యనాథ్ అన్నారు.

తబ్లిగి జమాత్ నేరపూరిత చర్యకు పాల్పడినట్లు యోగి విమర్శించారు. ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలో జరిగిన తబ్లిఘి జమాత్ కార్యక్రమానికి ఉత్తరప్రదేశ్ నుంచి సుమారు 3 వేలమంది హాజరైనట్లు యోగి తెలిపారు. ఒక వ్యాధి రావడం నేరం కాదు. కానీ కోవిడ్ -19 వంటి అనారోగ్యాన్ని దాచడం ఖచ్చితంగా నేరం. చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటామని యూపీ సీఎం తెలిపారు. యూపీలో నమోదైన కేసుల్లో సగానికిపైగా తబ్లిగీ జమాత్ తో లింక్ ఉన్నవాళ్లవేనన్నారు యోగి ఆదిత్యనాథ్.

కాగా, శనివారం ఉదయం 8 గంటల నాటికి ఉత్తరప్రదేశ్‌లో మొత్తం 2,328 మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు తేలింది. ఈ 2,328 మంది రోగులలో, 654 మంది కోలుకోగా, 42 మంది ప్రాణాలు కోల్పోయారు. 1,000 కి పైగా కోవిడ్ -19 కేసులు నమోదైన కొన్ని రాష్ట్రాలలో ఉత్తర ప్రదేశ్ కూడా ఉంది. మార్చి ప్రారంభంలో ఆగ్రాలో రాష్ట్రంలో మొదటి కేసు నమోదైంది. కరోనా హాట్ స్పాట్ లలో ఆగ్రా కూడా ఇప్పుడు ఒకటిగా మారిపోయింది. తాజ్ సిటీలో కరోనా కేసుల సంఖ్య 500దాటిపోయింది.

కేంద్ర ప్రభుత్వం కేటాయించిన రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్ల జాబితా ప్రకారం, రెడ్ జోన్ పరిధిలో ఉత్తరప్రదేశ్ అత్యధిక జిల్లాలను కలిగి ఉంది. రాష్ట్రంలో రెడ్ జోన్ కింద 19 జిల్లాలు, ఆరెంజ్ జోన్ కింద 36 జిల్లాలు, గ్రీన్ జోన్ పరిధిలో 20 జిల్లాలు ఉన్నాయి. రాష్ట్రంలో ఎక్కువగా కరోనా ప్రభావితమైన జిల్లాలు….ఆగ్రా, లక్నో, గౌతమ్ బుద్ధ నగర్, ఘజియాబాద్ మరియు మొరాదాబాద్.

Also Read | కారులో రోడ్డుపైకి వచ్చిన జిల్లా మెజిస్ట్రేట్‌‌కు వార్నింగ్ ఇచ్చిన కానిస్టేబుల్‌కు రివార్డ్