నిజామాబాద్ లో EVMలు లేవు : బ్యాలెట్ ద్వారా పోలింగ్

  • Published By: chvmurthy ,Published On : March 25, 2019 / 03:30 PM IST
నిజామాబాద్ లో EVMలు లేవు : బ్యాలెట్ ద్వారా పోలింగ్

హైదరాబాద్‌ :  ఏప్రిల్ 11 న తెలంగాణలో జరిగే లోక్‌సభ ఎన్నికలకు  సంబంధించి అందిన సమాచారం మేరకు 699 నామినేషన్లు దాఖలైనట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్‌కుమార్‌  చెప్పారు. నిజామాబాద్‌ లోక్ సభ స్థానానికి 245 నామినేషన్లు దాఖలయ్యాయని, రైతుల నామినేషన్‌ స్వీకరణలో ఎలాంటి నిబంధనలు ఉల్లంఘించలేదని ఆయన వివరించారు. అభ్యర్థుల సంఖ్య 90దాటితే బ్యాలెట్‌ పద్ధతిలో ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. నామినేషన్ల పరిశీలనకు ఒక్కో అభ్యర్థి తరఫున నలుగురు మాత్రమే హాజరు కావాలని ఆయన తెలిపారు.

నిజామాబాద్ లోక్ సభ స్దానానికి బ్యాలెట్ ద్వారా పోలింగ్ నిర్వహిస్తామని ఈసీ వివరించారు.  గత కొంత కాలంగా పసుపు, ఎర్రజొన్న పంటలకు మద్దతు ధర డిమాండ్ చేస్తున్న రైతులు తన నిరసన తెలుపుతూ  అధిక సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేశారు. జగిత్యాల, మెట్‌పల్లి, నిజామాబాద్ చుట్టుపక్కల గ్రామాల్లోని రైతులు నామినేషన్లు వేసేందుకు ఆఖరు రోజు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కాగా… నామినేషన్ల పరిశీలన జరిగి, ఉపసంహరణ నాటికి ఎంత మంది రైతులు బరిలో ఉంటారో తేలాల్సి ఉంది. సీఎం కేసీఆర్ కుమార్తె కవిత టీఆర్ఎస్ పార్టీ నుంచి, కాంగ్రెస్  పార్టీ నుంచి మధుయాష్కీ గౌడ్, బీజేపీ నుండి ధర్మపురి అరవింద్ పోటీలో ఉన్నారు. అయితే  తాము పండించిన  పంటలకు మద్దతు ధర లేక ప్రభుత్వం పై ఆగ్రహంతో నామినేషన్లు దాఖలు చేసిన రైతుల ప్రభావం ఇక్కడ ఎలా ఉండబోతోందన్నది  ఉత్కంఠ రేపుతోంది. 

లోక్‌సభ ఎన్నికలకు రాష్ట్రంలో 2.96 కోట్లమంది ఓటర్లు తమ ఓటు  హక్కు వినియోగించుకోనున్నారని రజత్ కుమార్ చెప్పారు.  ఎన్నికల సందర్భంగా నిర్వహించిన తనిఖీల్లో ఇప్పటివరకు సరైన  ఆధారాలు లేకుండా తరలిస్తున్న 10 కోట్ల 09 లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్నామన్నారు.  అలాగే రూ.2.04 కోట్ల విలువ చేసే మద్యం, రూ.2.45 కోట్ల విలువచేసే డ్రగ్స్‌ స్వాధీనం చేసుకున్నట్టు రజత్ కుమార్ వెల్లడించారు.  జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణ ..పాకిస్తానా అంటూ చేసిన వ్యాఖ్యలపై  పరిశీలిస్తామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.