Nagarkurnool: ఘోర ప్రమాదం.. 8 మంది మృతి!

10TV Telugu News

Nagarkurnool: నాగర్‌కర్నూల్‌ జిల్లాలో శుక్రవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్‌ – శ్రీశైలం జాతీయ రహదారిపై రెండు కార్లు ఒకదానికొకటి వేగంగా ఢీకొట్టాయి. అచ్చంపేట మండలం చెన్నారం గేట్‌ సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మృత్యువాతపడ్డారు. మరో ఇద్దరికి తీవ్ర గాయలవ్వగా ఆసుపత్రికి తరలించారు.

రెండు కార్లు ఢీ కొట్టుకోవడంతో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. ఇక ప్రమాదానికి గురైన రెండు కార్లు నుజ్జునుజ్జయ్యాయి. మృతదేహాలు చెల్లాచెదురుగా పడ్డాయి. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మరణించగా… మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. అయితే.. ప్రమాదం జరిగిన సమయంలో స్థానికులు అప్రమత్తమై… అటు పోలీసులకు ఇటు అంబులెన్సుకు ఫోన్‌ చేశారు.

దీంతో ఘటన స్థలానికి చేరుకున్న అంబులెన్స్‌ ద్వారా తీవ్రంగా గాయపడిన వారిని అచ్చంపేట ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు… మృత దేహాలను వెలికి తీస్తున్నారు. కాగా.. ఈ ప్రమాదంలో మృతులు అంతా హైదరాబాద్ కు చెందిన వారిగా తెలుస్తుంది. మరణించిన వారంతా నగరంలో సుచిత్రా సర్కిల్, ఆనంద్ బాగ్ ప్రాంతాలకు చెందిన వారుగా తెలుస్తుంది. సంఘటనా స్థలానికి చేరుకున్న ఎమ్మెల్యే గువ్వల బాల్ రాజు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

10TV Telugu News