పోలీస్ కావాలనే కలతో కష్టాలను అధిగమిస్తున్న యువతి..ఆన్‌లైన్ క్లాసుల కోసం రోజుకు ఐదు కి.మీ ప్రయాణం

పోలీస్ కావాలనే కలతో కష్టాలను అధిగమిస్తున్న యువతి..ఆన్‌లైన్ క్లాసుల కోసం రోజుకు ఐదు కి.మీ ప్రయాణం

young woman travels five kilometers for online classes : పోలీస్‌ ఆఫీసర్‌ కావాలనే కల కళ్లలోనే కదలాడుతున్నా… కనీస సౌకర్యాలకు దూరమై చదువుకోలేక పోయిన ఓ తండ్రి… మారుమూల గ్రామంలో పుట్టినా ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆశించే ఓ కూతురు… వీరిద్దరి సంకల్పం ముందు కష్టాలు చిన్నబోయాయి. భయాలు బెదిరిపోయాయి. ఆశ, ఆశయమే ముందుకు సాగుతున్నాయి. ఆన్‌లైన్ క్లాస్ కోసం ఐదు కిలోమీటర్లు ప్రతీ రోజూ వెళ్లేలా చేస్తున్నాయి.

కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లా తిర్యాణి మండలం మొర్రిగూడ ఓ మారుమూల గ్రామం. సెల్‌ఫోన్‌ సిగ్నల్‌ కాదు కదా కనీసం రోడ్డు సౌకర్యం కూడా లేని ఓ గిరిజన గూడెం. తాగు నీటి నుంచి ప్రతీ అవసరానికి .. కిలోమీటర్ల కొద్ది దూర ప్రాంతాలకు వెళ్లాల్సిందే. ఈ గ్రామానికి చెందిన భగవంతరావు తన కూతురు సరస్వతిని పొరుగున ఉన్న మంచిర్యాల జిల్లా తాండూరు మండలంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో చదివిస్తున్నాడు.

కరోన నేపథ్యంలో ఇప్పటి వరకు ప్రైమరీ పాఠశాలలు ఇంకా ప్రారంభం కాలేదు. కానీ ఆన్‌లైన్‌ క్లాసులు జరుగుతున్నాయి. మొర్రగూడలో సెల్‌ఫోన్‌ సిగ్నల్స్‌ రాకపోవడం పెద్ద సమస్యగా మారింది. ఆన్‌లైన్‌ క్లాసులు విని నేర్చుకుంటానంటూ సరస్వతి పట్టుబట్టడంతో ఆమె కోసం ఏం చేయడానికైనా సిద్ధమయ్యాడు భగవంతరావు. మొర్రిగూడ నుంచి ఐదు కిలోమీటర్ల దూరం ప్రయాణించి రోడ్డు పైకి చేరుకుంటే గానీ సిగ్నల్స్‌ అందడం లేదు.

అలా సిగ్నల్ అందే వరకూ రోజూ ఇద్దరూ ప్రయాణిస్తారు. సిగ్నల్ వచ్చిన చోట ఆగి ఆన్‌లైన్ క్లాస్‌కు అటెండ్ అవుతారు.. రాళ్లదారైనా.. రోడ్డుపక్కనైనా.. కల్వర్టైనా… ఆ రోజుకు అదే వాళ్లకు క్లాస్‌రూమ్.. విద్య పై పట్ల చిన్నారికి ఉన్న ఆసక్తి, దానికి తల్లిదండ్రుల సహాకారం తోడైన తీరు చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు.