Aadhar Card: ఈ ఊళ్లోకి ఎంటర్ అవ్వాలా.. ఆధార్ ప్లీజ్

అదేమీ ఎయిర్‌పోర్టు కాదు.. పాస్ పోర్టును ఐడీ ప్రూఫ్‌గా చూపించి లోపలికి అనుమతించడానికి.. కరోనా సమస్యా లేదు ఆధార్ తో వివరాలు రికార్డు చేసుకోవడానికి. కేవలం ఒక ఊరు. అందులోకి ఎంటర్ అవ్వాలంటే కచ్చితంగా ఐడీ ప్రూఫ్ ఉండాల్సిందే.

Aadhar Card: ఈ ఊళ్లోకి ఎంటర్ అవ్వాలా.. ఆధార్ ప్లీజ్

Aadhar

Aadhar Card: అదేమీ ఎయిర్‌పోర్టు కాదు.. పాస్ పోర్టును ఐడీ ప్రూఫ్‌గా చూపించి లోపలికి అనుమతించడానికి.. కరోనా సమస్యా లేదు ఆధార్ తో వివరాలు రికార్డు చేసుకోవడానికి. కేవలం ఒక ఊరు. అందులోకి ఎంటర్ అవ్వాలంటే కచ్చితంగా ఐడీ ప్రూఫ్ ఉండాల్సిందే. ఆధార్ తప్పనిసరి చేస్తూ.. ఆ పంచాయతీ తీర్మానం చేసింది. ఆధార్‌ ఐడీ చూపిస్తేనే ఆ గ్రామంలోకి ఎంట్రీ కల్పిస్తారు అక్కడి ప్రజలు. గుర్తింపు కార్డు లేకుంటే.. పొలిమేరలోకి అడుగు కూడా పెట్టనివ్వరు.

అలా ఎందుకు చేస్తున్నారు.. ఆ పల్లె విధించిన ఆంక్షలేంటి…?
కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం పెద్ద పొతంగల్ గ్రామం. చిన్న గ్రామమైనా.. గ్రామస్తుల ఆలోచన సరికొత్తగా ఆకర్షిస్తోంది. గ్రామంలోకి కొత్త వ్యక్తులు, అనుమానస్పద వ్యక్తులు అడుగుపెట్టకుండా కొత్త తరహా విధానాన్ని అమలు చేస్తున్నారు వారంతా. గ్రామంలోకి అడుగు పెట్టగానే ఒరిజినల్ ఆధార్ కార్డు చూపించి గ్రామ పంచాయతీలో రిపోర్ట్‌ చేయాలి.

పంచాయతీ సిబ్బంది వివరాలు సేకరించి కార్డును తిరిగి వెళ్లే సమయంలో అప్పగిస్తారు. ఊళ్లోకి వచ్చే కొత్త వ్యక్తులు, సంతలో వివిధ రకాల వస్తువులు అమ్మకానికి తెచ్చే వ్యక్తులు, కూలీ పనులకు వచ్చే వాళ్లు, ఇలా ఏ స్థాయిలో ఉన్నా.. ఆధార్ చూపిస్తేనే గ్రామంలోకి ఎంట్రీ. కాదు కూడదు అంటే.. ఊరి పొలిమేరలోనే నిలిపేస్తారు. మొండికేస్తే ఊరంతా ఏకమై.. తరిమికొడతారు.

కొద్ది నెలలుగా ఈ కొత్త సిస్టం అమలు చేస్తున్నారు పెద్ద పొతంగల్ గ్రామస్థులు. ఈ కండీషన్ పెట్టడానికి.. గతంలో జరిగిన దొంగ బాబాల మోసాలు, దొంగతనాలే కారణమట.

అసలేం జరిగింది:
కొద్ది నెలల క్రితం దొంగ బాబాలు గ్రామంలో మహిళలను టార్గెట్ చేసి.. పూజల పేరుతో మోసాలకు పాల్పడ్డారు. చాలామంది ఇళ్లలో బంగారాన్ని ఊడ్చుకెళ్లారు. దీంతో గ్రామస్తులు.. కొత్త వ్యక్తులు ఎవరు వచ్చినా ఆధార్ కార్డు గ్రామ పంచాయతీలో సమర్పించాలని రూల్ పెట్టారు. ఊళ్లో చుట్టాలింటికి వచ్చినా ఆధార్ కార్డు తప్పనిసరిగా ఇవ్వాల్సిందే అంటున్నారు.

ఇలా కండీషన్స్‌ అమలు చేస్తున్నప్పటి నుంచి మోసాలు, దొంగతనాలు తగ్గాయంటున్నారు పొతంగల్‌ గ్రామస్తులు. పండ్లు, కూరగాయలు అమ్మాలని ఊరికి వచ్చినా కార్డును పంచాయతీలో అప్పగించాల్సిందేనని చెబుతున్నారు.

వస్తువులు అమ్మి తిరిగి వెళ్లే సమయంలో కార్డులు తిరిగి ఇచ్చేస్తామని.. గుర్తింపు కార్డు సిస్టం వల్ల.. మోసాలు, దొంగతనాలను అరికట్టగలిగామంటున్నారు పెద్ద పొతంగల్‌ గ్రామ పెద్దలు. ఈ కండిషన్‌ వల్ల అపరిచితులు, మోసగాళ్లు తమ ఊరివైపు కన్నెత్తి చూడటం లేదని చెబుతున్నారు.