ఏసీబీ దూకుడు : మాజీ తహసీల్దార్ నాగరాజు బినామీ లాకర్లు, బంగారమే బంగారం

  • Published By: madhu ,Published On : October 23, 2020 / 08:22 AM IST
ఏసీబీ దూకుడు : మాజీ తహసీల్దార్ నాగరాజు బినామీ లాకర్లు, బంగారమే బంగారం

ACB Opened Keesara MRO Nagaraju ICICI Bank Locker : తెలంగాణలో సంచలనం సృష్టించిన కీసర మాజీ తహసీల్దార్‌ నాగరాజు కోటి రూపాయల అవినీతి కేసులో… ఏసీబీ దూకుడు పెంచింది. విచారణ ఎదుర్కొంటూ ఇటీవలో ఆయన జైల్‌లో ఆత్మహత్యకు పాల్పడటంతో కేసు విచారణను ఏసీబీ మరింత వేగవంతం చేసింది. నాగరాజు అక్రమాస్తుల చిట్టాను విప్పుతోంది. ప్రధానంగా నాగరాజు బినామీలపై ఏసీబీ దృష్టి పెట్టింది. ఈ క్రమంలోనే అల్వాల్‌ ఐసీఐసీఐ బ్యాంక్‌లో నాగరాజు లాకర్లను ఏసీబీ అధికారులు ఓపెన్‌ చేశారు.



కిలో 250 గ్రాములు : – 
నాగరాజు బినామీ నందగోపాల్‌ పేరుతో ఉన్న ఈ లాకర్‌లో భారీగా బంగారు ఆభరణాలను అధికారులు గుర్తించారు. ఏకంగా కిలో 250 గ్రాముల బంగారు ఆభరణాలు బయటపడ్డాయి. నాగరాజు అక్రమ సంపాదన చూసి….ఏసీబీ అధికారులే అవాక్కయ్యారు.



బినామీ ఆస్తులపై ఫోకస్ : – 
బినామీ పేరుతో నాగరాజు పెద్ద ఎత్తున ఆస్తులు కూడబెట్టినట్టు ఇంతకుముందే ఏసీబీ గుర్తించింది. దీంతో బినామీ ఆస్తులపై ఫోకస్‌ చేసింది. రెండు రోజుల క్రితం నందగోపాల్‌ నివాసంలో ఏసీబీ సోదాలు నిర్వహించగా…. ల్యాకర్ల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీంతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు లాకర్‌ ఓపెన్‌ చేయగా.. పెద్ద ఎత్తున బంగారాన్ని గుర్తించి.. దాన్ని స్వాధీనం చేసుకున్నారు.



మూడు కిలోల 250 గ్రాముల బంగారం : – 
ఇంతకుముందు మరో బ్యాంక్‌ లాకర్లలో రెండు కేజీల బంగారాన్ని సీజ్‌ చేసింది. ఇప్పుడు మరో కిలోపావు బంగారు ఆభరణాలు గుర్తించింది. దీంతో ఇప్పటి వరకు నాగరాజు దగ్గర మూడు కిలోల 250 గ్రాముల బంగారు ఆభరణాలు గుర్తించినట్టయ్యింది.



సహకరించని నాగరాజు : – 
ఆగస్టు 14న నాగరాజు ఇంటిపై దాడి చేసిన సమయంలో.. ఏసీబీ అధికారులకు ఓ బ్యాంకు లాకర్‌కు చెందిన తాళంచెవి లభించింది. అది నాగరాజు బంధువైన నరేందర్‌ పేరిట అల్వాల్‌లోని సౌత్‌ ఇండియా బ్యాంకు లాకర్‌గా గుర్తించింది. ఏసీబీ అధికారులు కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించిన సమయంలోనూ నాగరాజు లాకర్‌ విషంలో సహకరించలేదు.



హై డ్రామా : – 
దీంతో లాకర్‌ తెరిచిన ఏసీబీ అధికారులకు అందులో కిలోకుపైగా ఉన్న బంగారు ఆభరణాలు లభించాయి. వాటిని సీజ్‌ చేసిన అధికారులు న్యాయస్థానంలో డిపాజిట్‌ చేయనున్నారు. లాకర్‌పై గతంలో చాలా హైడ్రామా నడిచింది. లాకర్‌కు సంబంధించిన వివరాలు చెప్పకుండా నాగరాజు భార్య పోలీసులను తప్పుదోవ పట్టించారు. తనకు తెలియదని.. గుర్తు లేదని ఆమె చెప్పడంతో ఏసీబీ అధికారులు… నేరుగా బ్యాంకు అధికారులను సంప్రదించారు.



అక్రమాస్తుల చిట్టా : – 
లాకర్‌ను ఓపెన్‌ చేయాలని కూడా కోరారు. మొత్తానికి ఇప్పటి వరకు 3 కిలోలకు పైగా బంగారు ఆభరణాలు లభించడంతో… ఏసీబీ దూకుడు పెంచింది. అక్రమాస్తుల చిట్టా విప్పే పనిలో పడింది. నాగరాజుకు ఇంకా ఎంతమంది బినామీలు ఉన్నారు? వారి పేరిట దాచిన ఆస్తులు ఏమేం ఉన్నాయన్న దానిపై ఎంక్వైరీ కొనసాగిస్తోంది.