బాప్ రే.. మల్కాజ్‌గిరి ACP మామూలోడు కాదు, రూ.50 కోట్ల అక్రమాస్తులు కూడబెట్టాడు

  • Published By: naveen ,Published On : September 23, 2020 / 01:28 PM IST
బాప్ రే.. మల్కాజ్‌గిరి ACP మామూలోడు కాదు, రూ.50 కోట్ల అక్రమాస్తులు కూడబెట్టాడు

మల్కాజ్‌గిరి ఏసీపీ నరసింహారెడ్డి ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఆదాయానికి మించిన ఆస్తులున్నట్లు ఏసీపీపై ఆరోపణలు రావడంతో.. నరసింహా రెడ్డితో పాటు అతని బంధువుల ఇళ్లలో ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. గతంలో ఉప్పల్ సీఐగా, చిక్కడపల్లి ఏసీపీగా పనిచేసిన నరసింహారెడ్డి.. పలు ల్యాండ్ సెటిల్‌మెంట్లు, భూ వివాదాల్లో కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌లో ఆరు చోట్ల ఏసీబీ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు.

రూ.50 కోట్ల అక్రమాస్తులు గుర్తింపు:
ఏసీబీ రైడ్స్ తో నరసింహారెడ్డి అక్రమాస్తులు వెలుగులోకి వచ్చాయి. ఆయన భారీగా ఆస్తులు కూడబెట్టినట్టు గుర్తించారు. ఏసీపీ పేరుతో రూ.50 కోట్ల విలువైన అక్రమాస్తులు ఉన్నట్టు గుర్తించిన అధికారులు షాక్ తిన్నారు. హైదరాబాద్ సహా 12 ప్రాంతాల్లో ఏకకాలంలో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, నల్గొండ, అనంతపురంలో సోదాలు జరుపుతున్నారు.

ల్యాండ్ సెటిల్ మెంట్లు, భూ వివాదాలు:
ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయని, పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారని ఏసీపీ నరసింహారెడ్డిపై ఆరోపణలు వచ్చాయి. దీంతో ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు. నరసింహారెడ్డితో పాటు అతడి బంధువుల ఇళ్లలో తనిఖీలు చేస్తున్నారు. సికింద్రాబాద్ మహేంద్ర హిల్స్ లోని ఏసీపీ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు జరుపుతున్నారు. ఆయన పని చేసిన అన్ని ప్రాంతాల్లో అవినీతికి పాల్పడినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటివరకు జరిపిన సోదాల్లో కీలక ఆధారాలు, భారీగా అక్రమాస్తులు గుర్తించారు అధికారులు. 2008 నుంచి 2010 వరకు మియాపూర్ లో సీఐగా పని చేశారు. ఆ తర్వాత బేగంపేట, ఉప్పల్ సీఐగా పని చేశారు. ఆ తర్వాత చిక్కడపల్లి ఏసీపీగానూ విధులు నిర్వహించారు.

హఫీజ్ పేటలో మూడంతస్తుల భవనం, సైబర్ టవర్ దగ్గర 2వేల గజాల స్థలం:
నగర శివారు ప్రాంతంలోని భూ సెటిల్ మెంట్లలో ఏసీపీ ఇన్వాల్వ్ అయినట్టు ఆధారాలు సేకరించారు. మియాపూర్ లో విధులు నిర్వహించే సమయంలో పెద్ద ఎత్తున భూ సెటిల్ మెంట్లు చేసినట్టు తెలుసుకున్నారు. మియాపూర్ హఫీజ్ పేట్ లోని మంజీరా రోడ్డు సమీపంలో ఉన్న వినాయక్ నగర్ లో మూడు అంతస్తుల భవనం కూడా గుర్తించారు. ఆ భవనాన్ని ప్రస్తుతం బచ్ పన్ స్కూల్ కి అద్దెకి ఇచ్చారు. హైటెక్ సిటీలో సైబర్ టవర్ దగ్గర దాదాపు నరసింహారెడ్డి పేరుతో 2వేల గజాల స్థలం కూడా ఉన్నట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఇంకా ఏయే ప్రాంతాల్లో ఎన్ని ఆస్తులు ఉన్నాయో అని తెలుసుకుంటున్నారు.