ఎమ్మెల్సీ కవిత పెద్దమనస్సు : మెకానిక్ ఆదిలక్ష్మికి ఆధునిక మిషన్లు

ఎమ్మెల్సీ కవిత పెద్దమనస్సు : మెకానిక్ ఆదిలక్ష్మికి ఆధునిక మిషన్లు

Adilaxmi Mechanic in Telangana : తెలంగాణ రాష్ట్రంలోనే తొలి మహిళా మెకానిక్‌ ఆదిలక్ష్మిని ఆదుకునేందుకు ఎమ్మెల్సీ కవిత ముందుకొచ్చారు. మరోసారి తన పెద్ద మనసు చాటుకున్నారు. ఆదిలక్ష్మి మెకానిక్‌ దుకాణానికి అవసరమైన యంత్ర సామగ్రి అందిస్తానని తెలిపారు. అంతేకాదు.. ఆమె ఇద్దరు కుమార్తెలను చదివించే బాధ్యతనూ తీసుకుంటానని కవిత ప్రకటించారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాత అంజనాపురానికి చెందిన నిరుపేద కుటుంబానికి చెందిన ఆదిలక్ష్మి.. భర్తతో కలిసి ఖమ్మం రహదారి పక్కనే మెకానిక్‌ షాపు నిర్వహిస్తున్నారు.

తొలుత ఆమె భర్త మెకానిక్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవారు. వచ్చే ఆదాయం అవసరాలకు సరిపోకపోవడంతో తానూ పని చేయాలని ఆదిలక్ష్మి నిర్ణయించుకున్నారు. అప్పులు చేసి భార్యాభర్తలిద్దరూ సుజాతనగర్‌లో టైర్‌ వర్క్స్‌షెడ్డు తెరిచారు. అలా వాహనాలకు సంబంధించిన అన్ని పనులూ చేస్తూ ఆదిలక్ష్మి ప్రశంసలందుకున్నారు. ఇప్పుడు తానే సొంతంగా కొత్తషాపు ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించి.. సాయం కోసం ఎదురుచూస్తున్నారు.

ఆదిలక్ష్మి గురించి తెలుసుకున్న ఎమ్మెల్సీ కవిత ఆమెతో నేరుగా మాట్లాడి అభినందనలు తెలిపారు. కొత్త షాపు కోసం కావల్సిన యంత్రాలు అందజేస్తానని హామీ ఇచ్చారు. దీంతో హైదరాబాద్‌లో ఎమ్మెల్సీ కవితను ఆదిలక్ష్మి కుటుంబ సభ్యులు కలిశారు. మహిళలు ప్రయత్నిస్తే ఏదైనా సాధించగలరని, ఆదిలక్ష్మి జీవితమే అందుకు నిదర్శనమని కవిత కొనియాడారు. అడగకుండానే సాయం చేస్తానని హామీ ఇచ్చిన ఎమ్మెల్సీ కవితకు ఆదిలక్ష్మి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.