Hyderabad Heavy Rain : హైదరాబాద్‎‎లో మళ్లీ భారీ వర్షం.. ఎవరూ బయటకు రావొద్దని జీహెచ్ఎంసీ హెచ్చరిక

హైదరాబాద్ ను వరుణుడు వెంటాడుతున్నాడు. నగరంలో మళ్లీ భారీ వర్షం కురుస్తోంది.

Hyderabad Heavy Rain : హైదరాబాద్‎‎లో మళ్లీ భారీ వర్షం.. ఎవరూ బయటకు రావొద్దని జీహెచ్ఎంసీ హెచ్చరిక

Hyderabad Heavy Rain : హైదరాబాద్ ను వరుణుడు వెంటాడుతున్నాడు. నగరంలో మళ్లీ భారీ వర్షం కురుస్తోంది. వరుసగా రెండో రోజూ రాజధాని నగరంలో వాన దంచికొట్టింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, శేరిలింగంపల్లి, కూకట్ పల్లి, ఖైరతాబాద్ లో కుండపోత వాన పడుతోంది. భారీ వానలకు లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. మరో రెండు గంటల పాటు నగరంలో కుండపోత వర్షం కురిసే అవకాశం ఉందని, ప్రజలెవరూ బయటకు రావొద్దని జీహెచ్ఎంసీ అధికారులు సూచించారు. నాంపల్లి, గోశామహల్, కోఠి, బషీరాబాద్, నారాయణగూడ, అఫ్జల్ గంజ్, మల్లేపల్లి, చిక్కడపల్లి, అశోక్ నగర్, ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో అతి భారీ వర్షం కురుస్తోంది.

మంగ‌ళ‌వారం సాయంత్రం నగరంలో వ‌ర్షం దంచికొట్టింది. వాన పడే కంటే ముందు భారీగా ఉరుములు ఉరిమాయి. భారీ వ‌ర్షానికి రహదారులు జలమయం అయ్యాయి. ప‌లు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ ఏర్ప‌డింది. వాహ‌నాల రాక‌పోక‌ల‌కు తీవ్ర అంత‌రాయం క‌లగడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడ్డారు.

కాగా, సోమవారం సాయంత్రం మూడు గంటల పాటు కురిసిన భారీ వర్షానికి హైదరాబాద్ నగరం అతలాకుతలమైంది. ఈ ప్రభావం మరో రెండు రోజుల పాటు ఉండే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సూచిస్తోంది. మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని, నగరవాసులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు నమోదవుతున్నాయి.

నిన్న హైదరాబాద్ లో రికార్డ్ స్థాయిలో వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. గంటల వ్యవధిలోనే 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని.. మరో రెండు రోజుల పాటు వాతావరణం ఇలాగే ఉండే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారులు చెబుతున్నారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంతో పాటు దాని పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఉత్తర, వాయువ్య దిశల నుంచి తెలంగాణ వైపు గాలులు బలంగా వీస్తున్నాయని చెప్పారు.

నగరంలో ఒక్కసారిగా కురిసిన వానకు లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. నాలాలు, డ్రైనేజీలు ఉప్పొంగాయి. చాలా చోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అలర్ట్ అయ్యాయి. నాంపల్లిలో 9 సెమీ, చార్మినార్‌లో 5 సెమీ వాన పడింది. దీంతో అత్యవసరం అయితే తప్ప ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని పోలీసులు కోరారు. అందరూ ఇళ్లల్లోనే ఉండాలని, అవసరమైతే తప్ప బయటకు రావద్దని GHMC చెప్పింది. అయితే.. సోమవారం కురిసిన వాన కేవలం స్టార్టింగేనని, రానున్న రెండు రోజులు అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.