Manikrao Thakre : మోదీకి, బీజేపీకి భయపడం.. రాహుల్ గాంధీ సభ్యత్వం రద్దుపై పోరాటం చేస్తాం- మాణిక్ రావ్ ఠాక్రే

రాహుల్ గాంధీ పదవి తీసేయ్యడంతో భయపడిపోతాం అనుకోవడం మూర్ఖత్వం. మా పోరాటాలు ఆగవు, మేము ప్రశ్నించడమూ ఆగదు.(Manikrao Thakre)

Manikrao Thakre : మోదీకి, బీజేపీకి భయపడం.. రాహుల్ గాంధీ సభ్యత్వం రద్దుపై పోరాటం చేస్తాం- మాణిక్ రావ్ ఠాక్రే

Manikrao Thakre

Manikrao Thakre : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై అనర్హత వేటు దేశ రాజకీయాల్లో సంచలనంగా మారింది. లోక్ సభ సెక్రటరీ జనరల్.. లోక్ సభ సభ్యుడిగా రాహుల్ ను అనర్హుడిగా ప్రకటించారు. మోదీ (ఇంటిపేరు) పై అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో గుజరాత్ లోని సూరత్ కోర్టు ఆయనకు రెండేళ్ల జైలు శిక్షను విధించిన సంగతి తెలిసిందే. ఎవరైనా ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ కనీసం రెండేళ్ల జైలు శిక్షకు గురైతే వారు అనర్హతకు గురవుతారు. ఈ నిబంధన ప్రకారమే రాహుల్ పై అనర్హత వేటు వేసినట్లు వివరించారు.

రాహుల్ గాంధీ సభ్యత్వం రద్దుపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు భగ్గుమన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. రాహుల్ గాంధీ లోక్ సభ సభ్యత్వం రద్దు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి మాణిక్ రావు ఠాక్రే. ప్రజాస్వామ్యానికి ఇవి చీకటి రోజులు, పార్లమెంట్ ప్రక్రియలకు చీకటి రోజులు వచ్చాయని అన్నారు. తీవ్రమైన నిర్బంధం, దేశంలో నియంత పాలన సాగుతోందని మండిపడ్డారు.(Manikrao Thakre)

Also Read..Rahul Gandhi: 2013లో ఏ చట్టాన్నైతే రాహుల్ చింపేశారో.. ఇప్పుడదే చట్టానికి బలయ్యారు

రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు భారత్ జోడో యాత్ర చేశారని, ప్రజల్లో రాహుల్ గాంధీ పట్ల విశ్వాసం పెరిగిందన్నారు. రాహుల్ గాంధీని చూసి బీజేపీ నాయకులు, ప్రధాని మోదీ భయపడుతున్నారని చెప్పారు. మోదీకి, బీజేపీకి భయపడేది లేదన్నారు. రాహుల్ గాంధీ సభ్యత్వం రద్దుపై న్యాయపరంగా, చట్టపరంగా పోరాటం చేస్తామన్నారు. కాంగ్రెస్ కు ప్రజల నుంచి సంపూర్ణ మద్దతు ఉందన్నారు మాణిక్ రావ్ ఠాక్రే.

వీ.హనుమంతరావు, కాంగ్రెస్ సీనియర్ నేత..
” రాహుల్ గాంధీ.. మోదీని ఏదో అన్నారని పరువు నష్టం కేసు వేశారు. సూరత్ జిల్లా కోర్టు 2ఏళ్ల జైలు శిక్ష వేసింది. 30రోజుల గడువు ఇస్తూ బెయిల్ కూడా ఇచ్చింది. 30 రోజుల గడువు ఉండగానే ఇలాంటి నిర్ణయం ఎలా తీసుకుంటారు. గతంలో అనేక మంది అనేక రకాలుగా మాట్లాడారు. ఇలా ఎవ్వరు చేయలేదు. రాహుల్ గాంధీకి ప్రజల సంపూర్ణ మద్దతు ఉంది. రాహుల్ గాంధీ సభ్యత్వం రద్దుపై న్యాయపోరాటం చేస్తాం”.

Also Read..Rahul Gandhi: మోదీపై వ్యాఖ్యలకు భారీ మూల్యం చెల్లించుకున్న రాహుల్ గాంధీ.. పార్లమెంట్ నుంచి 8 ఏళ్లు ఔట్

మధుయాష్కీ, కాంగ్రెస్ సీనియర్ నేత..
పార్లమెంట్ తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మోడీ, బీజేపీ నియంతల పోకడలను ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు ఖండించాలి. రాహుల్ గాంధీ సభ్యత్వం రద్దు అనేది కాంగ్రెస్, రాహుల్ గాంధీ వ్యక్తిగత సమస్య కాదు. ఇది ప్రజాస్వామ్య, పార్లమెంటరీ విధానాలకు చీకటి రోజులు. తెలంగాన ప్రజలు ఈ విషయంలో పోరాటాలు చేయాలి. ప్రజాస్వామ్యాన్ని రక్షించుకునేందుకు ఉద్యమాలు చేయాలి. కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో ఉధృతంగా పోరాటం చేస్తుంది. న్యాయపరంగా, రాజకీయంగా మా పోరాటాలు ఉంటాయి. రాహుల్ గాంధీ పదవి తీసేయ్యడంతో భయపడిపోతాం అనుకోవడం మూర్ఖత్వం. మా పోరాటాలు ఆగవు, మేము ప్రశ్నించడమూ ఆగదు.”(Manikrao Thakre)

అసలేం జరిగింది..
కోర్టు రెండేళ్ల జైలుశిక్ష విధించడంతో.. రాహుల్ ని అనర్హుడిగా ప్రకటిస్తూ లోక్ సభ సెక్రటరీ జనరల్ పేరిట ఉత్తర్వులు వెలువడ్డాయి. వయనాడ్ పార్లమెంటు స్థానం నుంచి లోక్ సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న రాహుల్ గాంధీని అనర్హుడిగా ప్రకటిస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సూరత్ కోర్టు తీర్పు మేరకు ఈ నిర్ణయాన్ని తీసుకున్నామని చెప్పారు. నిన్నటి (మార్చి 23) నుంచే అనర్హత అమల్లోకి వస్తుందని తెలిపారు. ఈ ప్రకటనతో కాంగ్రెస్ శ్రేణులు దిగ్భ్రాంతికి గురయ్యాయి.

2019 కర్ణాటక ఎన్నికల సమయంలో మోదీ అనే ఇంటి పేరును ఉద్దేశిస్తూ రాహుల్ విమర్శలు చేశారు. దీనికి సంబంధించిన కేసును నాలుగేళ్లుగా విచారించిన సూరత్ కోర్టు.. రాహుల్ కు జైలు శిక్షను విధిస్తూ నిన్న తీర్పును వెలువరించింది. అయితే అప్పీల్ కు వెళ్లడానికి 30 రోజుల గడువు విధించింది. ఇంతలోనే.. లోక్ సభ సెక్రటేరియట్ స్పందించింది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఒక్క రోజు వ్యవధిలోనే రాహుల్ పై అనర్హత వేటు వేసింది. ఆయన లోక్ సభ సభ్యత్వం చెల్లుబాటు కాదని ప్రకటించింది.